అజయ్తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.
అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాదు, జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. [1]
అజయ్ తండ్రికి దర్శకుడు వేమూరి జ్యోతి కూమార్ పరిచయం ఉండటంతో మొదటగా కౌరవుడు అనే సినిమాలో అవకాశం వచ్చింది. దాని తరువాత అవకాశాల కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతకు మునుపు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బృందంలో పనిచేసిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సహకారంతో ఖుషి సినిమా నటీనటుల సెలక్షన్ లో ఎంపికయ్యాడు. అందులో అజయ్ చేసిన ఆకతాయి పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. [1]
ఖుషి తరువాత మరికొన్ని సినిమాలలో నటించినా అజయ్ కి బాగా గుర్తింపు సాధించిన చిత్రం ఒక్కడు. ఎమ్మెస్ రాజు, రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, అతడు, పోకిరి అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.