ఆమోస్ విట్నీ | |
---|---|
![]() ఆమోస్ విట్నీ | |
జననం | ఆమోస్ విట్నీ 1832 అక్టోబరు 8 బిడ్డెఫోర్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | ఆగస్టు 5, 1920 పోలండ్ స్ప్రింగ్, మైనే, యు.ఎస్ | (aged 87)
వృత్తి | ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు |
భాగస్వామి | ఫ్రాంసిస్ ఎ ప్రాట్ |
ఆమోస్ విట్నీ (1832 అక్టోబరు 8 - 1920 ఆగస్టు 5) మెకానికల్ ఇంజనీరు, ఆవిష్కర్త. అతను ప్రాట్ & విట్నీ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. అతను విట్నీ కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడు. 1860లో ఫ్రాంసిస్ ప్రాట్‌తో కలిసి ప్రాట్ & విట్నీ కంపేనీ స్థాపించడానికి సహాయపడ్డాడు. అప్పుడు జరుగుతున్న అమెరికా సివిల్ యుద్ధంలో వాడే తుపాకులు తయారు చేసింది ప్రాట్ & విట్నీ.
అతను బిడ్ఫోర్డ్, మైనే లో ఆరోన్, రెబెక్కా విట్నీ దంపతులకు జన్మించాడు. [1] మైనే లోని సక్కరప్పా, న్యూహాంప్ షైర్ లోణి ఎక్సెటెర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. [2] అతను తన 14వ యేట తన తల్లిదండ్రులతో పాటు మసాచుసెట్స్‌లోని లారెన్స్‌కు వెళ్లి ఎసెక్స్ మెషిన్ కంపెనీ లో అప్రెంటిస్ పొందాడు.
1852 లో అతను అమెరికా లోని హార్ట్ఫర్డుకు వెళ్లి కోల్ట్ ఆర్మరీ లో పనిచేశాడు. కోల్ట్ వద్ద ఫీనిక్స్ ఐరన్ వర్క్స్‌లో సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్న ఫ్రాంసిస్ ప్రాట్‌ను కలుసుకున్నాడు. ఫ్రాంసిస్ ప్రాట్ విట్నీని తనతో తీసుకువెళ్ళాడు. ఫీనిక్స్ ఐరన్ వర్క్స్‌లో పనిచేస్తున్నప్పుడు విట్నీ లింకన్ మిల్లింగ్ యంత్రం[3] రూపొందించాడు.
1860 లో ఫీనిక్స్ ఐరన్ వర్క్స్ లో పనిచేస్తున్నప్పుడు ప్రాట్, విట్నీలు కలసి ప్రాట్ & విట్నీ సంస్థను స్థాపించారు. వారు విల్లిమాంటిక్ నార కంపెనీకి థ్రెడ్ విండర్ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇది వారి మొదటి ఉత్పత్తి. వారు తుపాకులు, కుట్టు యంత్రాలు, సైకిళ్ళు, టైప్రైటర్ల తయారీకి యంత్ర పరికరాలను తయారు చేశారు. అమెరికన్ సివిల్ వార్ సమయంలో తుపాకీ తయారీ యంత్రాల తయారీ వేగంగా పెరిగింది.[4]
విట్నీ 1893 లో ఆ సంస్థ ఉపాధ్యక్షునిగా, 1898 నుండి 1901 వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ సంస్థను నైల్స్-బెమెంట్-పాండ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఆ సంస్థ డైరక్టర్లలో విట్నీ ఒకనిగా కొనసాగాడు. అతను గ్రే టెలిఫోన్ పే స్టేషన్ కంపెనీ అధ్యక్షుడిగా, డైరెక్టర్‌గా, ప్రాట్ & కేడీ కో డైరెక్టర్‌గా, సహకార సేవింగ్స్ బ్యాంక్‌లో డైరెక్టర్‌గా,[1] అతని కుమారుడు క్లారెన్స్ నిర్వహించిన విట్నీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కోశాధికారిగా కూడా పనిచేశాడు.[3]
అతను 1920 ఆగస్టు 5 న మైనేలోని పోలాండ్ స్ప్రింగ్‌లో మరణించాడు.[3] కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లోని సెడర్ హిల్ శ్మశానవాటికలో సమాధి చేసారు.[5]