ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ | |
రకం | ఐఐటీ |
---|---|
స్థాపితం | 2008 |
విద్యార్థులు | 2,880 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,540 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 340 |
స్థానం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
జాలగూడు | www.iith.ac.in |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని ఎద్దుమైలారం గ్రామంలో ఉంది. సాంకేతిక విద్యాలయాల (సవరణ) చట్టం, 2011కి లోబడి, కేంద్ర మానవవనరుల శాఖ, భారత ప్రభుత్వం వారిచే ఏర్పాటుచేసిన 8 కొత్త ఐఐటీలలో ఇది ఒకటి.[1] ఈ చట్టం లోకసభలో 2011 మార్చి 24న,[2] రాజ్యసభలో 2012 ఏప్రిల్ 30న అమోదించబడింది.[3]
2008 సంవత్సరంలో ప్రారంభించిన ఐఐటీ, హైదరాబాద్ తాత్కాలిక ప్రాంగణం పూర్వ మెదక్ జిల్లా, ఎద్దుమైలారం గ్రామం లోని ఆర్డినెన్స్ ఫాక్టరీలో ఉంది. దీని శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి జిల్లా దగ్గర కంది గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 2009 ఫిబ్రవరి 27న, ఐక్య ప్రగతిశీల కూటమి చైర్ పర్సన్, సోనియా గాంధీ, శాశ్వత ప్రాంగణానికి శంకుస్థాపన చేసింది.[4]
సంగారెడ్డి వద్దనున్న ‘కంది’ గ్రామంలో సుమారు 550 ఎకరాలలో (2.2 చ.కి.మీ) సంస్థ శాశ్వత ప్రాంగణం విస్తరించి ఉంది. ఇది జాతీయ రహదారి 65 ను ఆనుకుని, ఔటర్ రింగురోడ్డుకి సమీపంలో ఉంది. ఇది సికిందరాబాదు రైల్వేస్టేషనుకి 50కి మీ దూరంలో ఉంది. 2011 అక్టోబరు 6న ఇక్కడ భూమిపూజ జరిగింది.[5]
ప్రస్తుతం హైదరాబాదు నగరానికి 45 కి.మీ. దూరంలో, మెదక్ జిల్లా, ఎద్దుమైలారం గ్రామం, ఆర్డినెన్సు ఫాక్టరీ లోని తాత్కాలిక ప్రాంగణంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడికి అతి దగ్గరి బస్సుస్టాపు పటాన్ చెరువు వద్ద ఉంది.
ఇంజనీరింగు, విజ్ఞానశాస్త్రాలు, లిబరల్ ఆర్ట్సు తదితర క్షేత్రాలలో మొత్తంగా 7 అండరుగ్రాడ్యుయేట్ ఇంజనీరింగు డిగ్రీలు, 6 పోస్టుగ్రాడ్యుయేటు ఇంజనీరింగు డిగ్రీలు, డాక్టరేటు డిగ్రీలను అందజేస్తోంది. వివిధ క్షేత్రాలలో నిష్ణాతులైన 83మంది ఆచార్యులు ఇక్కడ బోధిస్తున్నారు, పరిశోధిస్తున్నారు సలహాలనందిస్తున్నారు.[6]
ఐఐటీ హైదరాబాదు క్రింది విభాగాలను కలిగి ఉంది.
ఐఐటి హైదరాబాద్‌లో బి. టెక్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్.[7]
ఈ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవటానికి, దరఖాస్తుదారు మొదట ఐఐటి జెఇఇ ప్రవేశ పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఐఐటి ప్రత్యేకమైనది. ఇతర కళాశాలలకు ఉపయోగించబడదు. ఈ పరీక్ష విద్యా సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. మొత్తం భారతదేశమంతటికీ ఒకే పద్ధతిలో పరీక్ష ఉంటుంది.[8] దరఖాస్తుదారుడి స్కోరు ఆధారంగా, విద్యార్థి ఐఐటి హైదరాబాద్‌లో ప్రవేశం పొందగలడా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విద్యా సంవత్సరంలో, నిర్దుష్ట సంఖ్యలో టాప్ స్కోరర్లు మాత్రమే ప్రవేశాలు పొందుతారు. ప్రవేశానికి ఈ స్కోరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు - పాఠ్యాంశాలు, పాఠశాల మార్కులు వంటి ఇతర విషయాలు కీలక పాత్ర పోషించవు.[9]