ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా,భారతదేశం నుండి ఇంగ్లీషు భాషలో వెలువడిన ప్రఖ్యాత వారపత్రిక. ఈ పత్రిక 1880లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు అనుబంధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1923లో ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. ఈ పత్రిక 1993లో మూతపడింది.[1] పాఠకలోకంలో వీక్లీగా పేరుగాంచిన ఈ పత్రిక ఒక శతాబ్దానికి పైగా భారతదేశపు ముఖ్యమైన ఇంగ్లీషు పత్రికగా పరిగణించబడింది.[2]ఈ పత్రికను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు సంస్థ బెన్నెట్ కోలమెన్ & కంపెనీ లిమిటెడ్ బొంబాయి నుండి ప్రచురించింది. ఈ పత్రిక మామూలు వార పత్రికల కంటే చాలా పెద్దగా, మామూలు దిన పత్రికల కంటే చిన్నగా, ఒక విలక్షణమైన పరిమాణంలో ఉండేది.
ఈ పత్రికకు సీన్ మాండీ (ఐరిష్ దేశీయుడు), ఎ.ఎస్.రామన్, సుబ్రతా బెనర్జీ, కుష్వంత్ సింగ్, ఎం.వి.కామత్, ప్రీతిష్ నంది మొదలైనవారు సంపాదకులుగా ఉన్నారు.[3] ఈ పత్రికలో ఆర్.కె.లక్ష్మణ్, మారియో మిరాండ కార్టూనులు గీసేవారు. ఈ పత్రికలో సిద్ధార్థ్ కక్, దేవానంద్ మిశ్రా, కమలా దాస్, నిర్మల్ వర్మ, కమలా మార్కాండేయ, జగ్‌జీత్ సింగ్, కింగ్స్లే మార్టిన్, రఘుబీర్ సింగ్, రవి దయాళ్, ఉమా రాంనాథ్, నందితా కృష్ణ, అరుణ్ గాంధీ, ఎ.ఎన్.సేన్, ఆర్.కె. నారాయణ్, గురుదేవ్ శరణ్ మొదలైనవారి రచనలు ప్రచురితమయ్యాయి.
ఈ పత్రిక నవంబరు 13, 1993 నుండి వెలువడటం నిలిచిపోయింది.
చాలామంది యువపాఠకులకు ఇంగ్లీషు భాషలో తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ పత్రిక దోహదపడింది.