ఎన్.గోపాలస్వామి

ఎన్. గోపాలస్వామి
N. గోపాలస్వామి ఫిబ్రవరి 08, 2004న న్యూఢిల్లీలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

N. గోపాలస్వామి (జననం 1944 ఏప్రిల్ 21), భారతదేశ 15వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) గా పనిచేశాడు. 2015లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడు. అతను గుజరాత్ కేడర్‌కు చెందిన 1966 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. అతను 2006 జూన్ 30 న సిఇసి బాధ్యతలు చేపట్టి 2009 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశాడు. అతను వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది చెన్నై లోను, చుట్టుపక్కలా పాఠశాలలు నడుపుతోంది. [1] అతను 2014 అక్టోబరు 22 నుండి 2019 వరకు ఐదు సంవత్సరాల కాలానికి కళాక్షేత్ర ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు [2]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

గోపాలస్వామి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం తిరువారూరు జిల్లా నీడమంగళం. అతను మన్నార్గుడిలో చదువుకున్నాడు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. గోపాలస్వామి ఢిల్లీ యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్టు. లండన్ విశ్వవిద్యాలయం నుండి అర్బన్ డెవలప్‌మెంట్ ప్లానింగ్‌లో డిప్లొమా పొందాడు. 

తొలి ఎదుగుదల

[మార్చు]

గోపాలస్వామి 1966లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరాడు. గుజరాత్‌లో వివిధ హోదాల్లో పనిచేశాడు. 1967 నుండి 1992 వరకు, అతను గుజరాత్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా వివిధ ఉన్నత-స్థాయి పదవులను నిర్వహించాడు. గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డులో సభ్యునిగా, సాంకేతిక విద్యలో ప్రభుత్వ కార్యదర్శిగా, రెవెన్యూ శాఖలో కార్యదర్శిగా చేసాడు.

అంతకుముందు అతను కచ్, ఖేడా జిల్లాలలో జిల్లా మేజిస్ట్రేటుగా పనిచేసాడు. సూరత్ లో మునిసిపల్ కమీషనరుగా, గుజరాత్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ (హోమ్ శాఖ) గా పనిచేసాడు

బ్యూరోక్రాట్‌గా

[మార్చు]

గోపాలస్వామి 1992 - 2004 మధ్య భారత ప్రభుత్వంలో పనిచేశాడు. భారత ఎన్నికల కమిషన్‌లో నియామకానికి ముందు కేంద్ర హోం కార్యదర్శిగా పనిచేసాడు. అంతకు ముందు అతను సాంస్కృతిక శాఖలో కార్యదర్శిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సెక్రటరీ జనరల్‌గా ఉన్నాడు.

గోపాలస్వామి భారత ప్రణాళికా సంఘంలో సలహాదారుగా, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ ప్రమోషన్ విభాగానికి ఇన్‌ఛార్జిగా పనిచేసాడు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (STPI) సొసైటీకి, SATCOMM కూ అధిపతిగా కూడా పనిచేశాడు.

2015 అక్టోబరు 21 న గోపాలస్వామి, తిరుపతిలో ఉన్న రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీమ్డ్ యూనివర్సిటీకి ఐదేళ్ల కాలానికి ఛాన్సలర్‌గా నియమితుడయ్యాడు. 

వివాదం

[మార్చు]

2009 జనవరి 31 న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్ గోపాలస్వామి, అప్పటి ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని భారత రాష్ట్రపతికి సిఫార్సు పంపాడు. [3] చావ్లా ఎన్నికల కమీషనర్‌గా తన బాధ్యతలను పక్షపాత ధోరణితో నిర్వర్తించాడని, "ఒక పార్టీ" ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. కీలకమైన సమావేశాల్లో చావ్లా విరామం తీసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రహస్యంగా మాట్లాడి ఎన్నికల కమిషన్ రహస్య వివరాలను లీక్ చేస్తాడనీ సీఈసీ నివేదికలో రాసారు.[4] బెల్జియం నుండి విదేశీ గౌరవాలను స్వీకరించినందుకు సోనియా గాంధీకి ఎన్నికల సంఘం పంపించదలచిన నోటీసును కూడా చావ్లా వ్యతిరేకించినట్లు సమాచారం.[5]

చావ్లాపై ఎన్ గోపాలస్వామి చేసిన సిఫార్సు రాజకీయంగా వివాదాస్పదమైంది.[6] అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం (ఇది చావ్లాకు అనుకూలమని ఆరోపణలున్నాయి), 2009 మార్చి 1 న చావ్లాకు వ్యతిరేకంగా సిఇసి సిఫార్సును తిరస్కరించింది. ఆ తర్వాత, నవీన్ చావ్లా 2009 ఏప్రిల్ 20 న భారతదేశ సిఇసిగా బాధ్యతలు స్వీకరించాడు. 2009 భారత పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఎన్నికల సంఘం నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పుడు, కష్టతరమైన కసరత్తు కోసం గూగుల్ మ్యాప్‌లను ఉపయోగించాలని ఆయన (సీఈసీగా) సూచించాడు. ప్రాచీన హిందూ గ్రంధాలైన వేదాల పరిరక్షణ కోసం యునెస్కో నుండి రూ. 5 కోట్లు మంజూరు చేయించడంలో గోపాలస్వామి కీలక పాత్ర పోషించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "About us - Vivekananda Educational Society".
  2. "Ex-CEC Gopalaswami new chairman of Kalakshetra Foundation". The Hindu (in ఇంగ్లీష్). 22 October 2014. ISSN 0971-751X. Retrieved 2015-05-26.
  3. "Connecting News with Views". Archived from the original on 7 February 2009. Retrieved 2 February 2011.
  4. "Chawla's loo breaks led to Cong phone calls: CEC". Rediff.com. Retrieved 17 November 2012.
  5. Bharti Jain, ET Bureau 1 February 2009, 01.25am IST (1 February 2009). "CEC accuses Chawla of siding with one party – Economic Times". Economictimes.indiatimes.com. Retrieved 17 November 2012.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  6. [1] Archived 2 ఏప్రిల్ 2008 at the Wayback Machine
  7. "He lives by the give-nothing-take-nothing rule". Rediff.com. 31 December 2004. Retrieved 17 November 2012.