ఎస్. గోపాల రెడ్డి | |
---|---|
జననం | |
వృత్తి | ఛాయాగ్రాహకుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు |
ఎత్తు | 5"9 |
జీవిత భాగస్వామి | మైకేలా |
పిల్లలు | సందీప్, సంధ్య |
ఎస్. గోపాలరెడ్డి సినీ ఛాయాగ్రాహకుడు (కెమెరామెన్) రచయిత, దర్శకుడు, నిర్మాత.[1] డా. కె. ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నాడు. తెలుగులోనే కాక కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతగా క్షణ క్షణం ఆయనకు బాగా పేరు తెచ్చింది.
గోపాల్ రెడ్డి జులై 4, 1951న కృష్ణా జిల్లాలో జన్మించాడు. ఆయన మరో కెమెరామెన్ అయిన రసూల్ ఎల్లోర్ సోదరి మైకేలాను వివాహం చేసుకున్నాడు.[2] వారికి ఒక కుమారుడు సందీప్, కుమార్తె సంధ్య ఉన్నారు. సందీప్ కూడా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.[1]
1968 లో చెన్నైలోని వీనస్ స్టూడియోలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి దగ్గర సహాయకుడిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో అనేక తెలుపు-నలుపు చిత్రాలకు పనిచేశాడు.1979 లో ఆయనకు సినిమాటోగ్రాఫర్ గా పేరు వచ్చింది. తరువాత 1980 వ దశకంలో అనేక తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. 1980 వ దశకంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, ఇంక్విలాబ్, సూర్యవంశీ మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. తరువాత 1990 వ దశకంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన కచ్చే ధాగే సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం. ఆయన మొత్తం 150 సినిమాలకు పైగా పనిచేస్తే అందులో నాగార్జున కథానాయకుడిగా నటించినవి 15 సినిమాలున్నాయి.
క్షణక్షణం, దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆయన నిర్మాతగా పేరు తెచ్చిన సినిమాలు. రవితేజ హీరోగా నటించిన, తమిళ సినిమాకు రీమేక్ అయిన నా ఆటోగ్రాఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.