ఏదైనా జరగొచ్చు 2019, ఆగస్టు 23న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుదర్శన్ హనగోడు నిర్మాణ సారథ్యంలో కె. రామకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాజా, పూజా సోలంకి, బాబీ సింహా, సాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించారు.[1] ఈ చిత్రంలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా తొలిసారిగా నటించాడు.[2][3] దర్శకుడు రామకాంత్ చంద్ర శేఖర్ యెలేటికి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 2018, జూలై 11న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ముఖ్యులు హాజరయ్యారు.[4]
జై (విజయ్ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ (పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ (బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ.[5]
ఈ చిత్రానికి శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్రంలో బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే ఉంది" అని రాసింది.[6] న్యూస్ మినిట్ పత్రిక ఈ చిత్రంపై విమర్శ రాసింది.[7]