కిరణ్ మార్టిన్ | |
---|---|
జననం | 1959 జూన్ 9 |
జాతీయత | భారతీయత |
విద్య | బాచిలర్ ఆఫ్ మెడిసన్, సర్జరీ, డిప్లమో ఇన్ చైల్డ్ హెల్త్ అండ్ పీడియాట్రిక్స్ |
వృత్తి | సామాజిక కార్యకర్త, పిల్లల వ్యాధుల వైద్యురాలు, ఆశా సొసైటీ వ్యవస్థాపకురాలు, నిర్వాహకురాలు |
జీవిత భాగస్వామి | గాడ్ఫ్రే మార్టిన్ |
పిల్లలు | 2 |
పురస్కారాలు | పద్మశ్రీ |
కిరణ్ మార్టిన్, ప్రముఖ పిల్లల వ్యాధుల వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ప్రభుత్వేతర లాభాపేక్ష రహిత సంస్థ ఆశా సొసైటీకి ఆమె వ్యవస్థాపకురాలు.[1] కిరణ్ ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి లక్ష్యాలుగా పనిచేస్తోంది.[2] ఢిల్లీలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న దాదాపు 50 మురికివాడల అభివృద్ధి కోసం ఆమె కృషి చేస్తోంది. దాదాపు 400,000 నుంచి 500,000 వరకూ మురికివాడల్లో ఉండే ప్రజలకు సౌకర్యాలు కలిగిస్తోంది కిరణ్.[3][4][5] 2002లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పురస్కారం భారతదేశ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలలో నాలుగవది.[6]
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్యకళాశాలలో ఎంబిబిఎస్ చదివిన కిరణ్, 1985లో పీడియాట్రిక్స్ (పిల్లల వైద్యం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ హార్డింజ్ వైద్యకళాశాలలో పూర్తి చేసింది.[7][8][9]
1988లో, దక్షిణ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ బస్తీ అనే మురికివాడలో కలరా వ్యాధి ప్రబలినప్పుడు, అక్కడి ప్రజలకు చికిత్స చేసింది కిరణ్. ఈ సంఘటన ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది.[8] అప్పట్నుంచీ సంఘ సేవపై ఆమెకు ఆసక్తి పెరిగింది.[7][10] తన సేవలను ప్రజల వద్దకు తీసుకు వెళ్ళే ప్రయత్నంగా, తన ఆలోచనలకు సరిపోయే మరికొంత మందితో కలిసి, అదే ఏడాది ఆశా సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా అందరికీ న్యాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆమె కోరిక.[8][11][12]
తన ప్రేరణ, విలువలు ఎప్పటికీ నైతికంగా తన అభివృద్ధికి తోడ్పడేలా పని చేస్తాను అని చెబుతుంది కిరణ్.[13] తను నమ్మిన విలువలతోనే ఆశా సంస్థ కార్యాచరణ నిర్మించింది. సమాజంలో ఉన్న అందరూ సమానమైన హక్కులు కలిగి ఉండటమే ఆమె కోరిక అని చెబుతుంది. అందరికీ ఒకే రకమైన గౌరవం దక్కాలని ఆమె అభిప్రాయం. పేదలైన, ధనవంతులైన వారికి రక్షణ పొందే హక్కు సమానంగా ఉంటుంది అని ఆమె ఉద్దేశం. సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, మహిళలపై చిన్న చూపు వంటి రుగ్మతలపై ఆశా సంస్థ ద్వారా ఎదిరిస్తోంది కిరణ్. మహిళా సాధికారత సాధించడం ఆమె లక్ష్యాలలో ఒకటి.[3] అందరికీ సమానంగా కనీస అవసరాలు, సేవలు, అవకాశాలు, ప్రయోజనాలు, అభివృద్ధి అందాలన్నవే ఆశా సంస్థ ముఖ్య లక్ష్యాలు.[13] ప్రజల్లో ఇతరుల పట్ల కరుణ, కృతజ్ఞత, అభివృద్ధి పట్ల, జీవితం పట్ల ఆశావాదం పెంచాలని ఆశా సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ విలువల వల్ల ఆశా సంస్థ చేసే సేవల విస్తృతి పెరిగింది. దాంతో ఈ సంస్థ ద్వారా లాభం చేకూరిన ప్రజల సంఖ్య పెరిగింది అని చెబుతుంది కిరణ్.[13]
ఆశా సంస్థ ద్వారా కిరణ్, వైద్య శిబిరాలు, రహదారుల విస్తరణ, అభివృద్ధి, పరిశుభ్రత కార్యక్రమాలు, మంచినీటి పంపిణీ, ప్రాథమిక విద్య వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది.[10][12][14] దాదాపు 50కాలనీలలోని 400,000 నుంచి 500,000 మంది ప్రజలకు ఆశా సంస్థ నేరుగా సేవలందిస్తోంది.[9][10][12]
2002లో, భారత ప్రభుత్వం కిరణ్ ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[8][9][12][15] మురికివాడల్లోని ప్రజల ఆర్థిక అభివృద్ధి, ఉన్నత విద్య కోసం ఆశా సంస్థ ద్వారా కిరణ్ చేస్తున్న కృషికి గానూ, అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ఆమెను ప్రత్యేకంగా సత్కరించాడు.[16][17] ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి, మురికివాడల అభివృద్ధిలో కిరణ్ కు సహాయం లభించింది. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రముఖ భాజపా నాయకుడు ఎల్.కె.అద్వానీ, ఆమె కృషికి మద్దతు ఇస్తున్నాడు. 1990లలో ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన డాక్టర్ హర్ష్ వర్ధన్, తన పదవీ కాలంలో ఆశా సంస్థ సహాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు.