కెవ్వు కేక | |
---|---|
దర్శకత్వం | దేవీ ప్రసాద్ |
రచన | సతీష్ వేగేశ్న (మాటలు) |
స్క్రీన్ ప్లే | దేవి ప్రసాద్ |
కథ | దేవి ప్రసాద్, సతీష్ వేగేశ్న |
నిర్మాత | బొప్పన చంద్రశేఖర్ |
తారాగణం | అల్లరి నరేష్, షర్మిలా మండ్రే, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, ఆశిష్ విద్యార్థి, కృష్ణ భగవాన్ |
ఛాయాగ్రహణం | అడుసుమిల్లి విజయ్ కుమార్ |
కూర్పు | హరి నందమూరి |
సంగీతం | భీమస్ సెసిరోలె, చిన్ని చరణ్ |
నిర్మాణ సంస్థ | జాహ్నవి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 జూలై 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కెవ్వు కేక 2013, జూలై 19న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, షర్మిలా మండ్రే, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, ఆశిష్ విద్యార్థి, కృష్ణ భగవాన్ తదితరులు నటించగా,[2] భీమస్ సెసిరోలె, చిన్ని చరణ్ సంగీతం అందించారు.[3] ఈ చిత్రానికి అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం, హరి నందమూరి ఎడిటింగ్ చేశారు.[4] 2017లో, వామ్ ఇండియా మూవీస్ వారిచే డేరింగ్ చల్బాజ్ అనే పేరుతో హిందీలోకి అనువాదమయింది.[5]
బుచ్చిరాజు (అల్లరి నరేష్) తన మామ మెజీషియన్ అబ్రకదబ్ర అప్పారావు (కృష్ణ భగవాన్) దగ్గర ఉంటూ కళానికేతన్ షాపింగ్ మాల్ లో సేల్స్ మాన్ గా పనిచేస్తూ ఉంటాడు. బుచ్చిరాజు, మహాలక్ష్మి (షర్మిల మాండ్రే) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ మహాలక్ష్మి నాన్న సుబ్బారావు (ఎం.ఎస్. నారాయణ)కి బాగా ఆస్తివున్నవాళ్ళే తన ఇంటికి అల్లుడు కావాలని వారానికో డబ్బున్న పెళ్లి కొడుకుల్ని చూస్తుంటాడు. దాంతో, బుచ్చిరాజు మొదట్లో డబ్బున్న వాడిలా నటిస్తాడు. కొన్నిరోజులకి నిజం తెలిసి సుబ్బారావు వారి పెళ్ళికి ఒప్పుకోనంటాడు. అప్పుడ బుచ్చిరాజు 6 నెలల్లో తను పనిచేస్తున్న దానికన్నా పెద్ద షాపింగ్ మాల్ కొంటానని శపథం చేస్తాడు. తన మామ అప్పారావు వల్ల బుచ్చిరాజుకి ఒక నిజం తెలుసి, బ్యాంకాక్ లో పెద్ద బిజినెస్ మాన్ అయిన గొట్టం గోపాలకృష్ణ (ఆశిష్ విద్యార్ధి) దగ్గర నుంచి తనకి రావాల్సిన డబ్బుకోసం బుచ్చిరాజు బ్యాంకాక్ వెళుతాడు. తనకి రావాల్సిన డబ్బు గురించి అడిగితే మెడపట్టి బయటకి గెంటేసిన గొట్టం గోపాలకృష్ణ దగ్గర నుంచి తనకి రావాల్సిన డబ్బుని ఎలా సంపాదించుకున్నాడు? చివరికి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ.[6]
అల్లరి నరేష్, దేవి ప్రసాద్ కాంబినేషన్ లో 2008లో వచ్చిన బ్లేడ్ బాబ్జీ చిత్రం విజయవంతమైంది.[7] ఈ చిత్రం పేరు, ప్రారంభానికి సంబంధించిన వార్తలు 2012, జూలై 22న వచ్చాయి. తన తదుపరి సినిమా దేవి ప్రసాద్ చేస్తున్నానని, ఆ చిత్రానికి కెవ్వు కేక అని పేరు పెట్టారని అదేరోజు నరేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించాడు.[8] 2012, జూలై 25వ తేదీన ఈ చిత్రం అధికారికంగా ప్రారంభించబడుతుందని కూడా తెలిసింది.[9] జూలై 25న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభ వేడుకకు అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[10] ఇంతకుముందు అనేక చిత్రాలకు నరేష్‌తో కలిసి పనిచేసిన రచయిత సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను, డైలాగ్‌లను అందిస్తాడని చెప్పారు.[11] దేవి ప్రసాద్, సతీష్ వేగేశ్న ఇద్దరూ కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ కోసం మూడేళ్ళుగా పనిచేశారని, గుట్టి మధు ఈ చిత్రానికి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని ప్రకటించారు.[4] సినిమాటోగ్రఫీని అడుసుమిల్లి విజయ్ కుమార్ నిర్వహిస్తారని, సంగీతాన్ని భీమస్ సెసిరోలె, చిన్ని చరణ్ అనే ఇద్దరు సంగీత స్వరకర్తలు కలిసి సమకూర్చనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం 2013లో విడుదలవుతుందని, నరేష్ సరసన కొత్త హీరోయిన్ నటించనున్నట్లు పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రంలోని కెవ్వు కేక అనే పాటను అనుసరించి ఈ చిత్రానికి పేరు నిర్ణయించారు. కన్నడ నటి షర్మిలా మాండ్రే ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు అక్టోబరు 3న వార్తాపత్రికల్లో వచ్చింది. ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్లు షర్మిలా మాండ్రే తన ఇంటర్వ్యూ ద్వారా ధృవీకరించింది.[12] తెలుగులో ఈమెకు ఇది తొలిచిత్రం.[13]
2012, అక్టోబరు 3న హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభమైంది.[14] చిత్రీకరణలోని ప్రధానభాగం హైదరాబాదు, బ్యాంకాక్ లలో జరుగుతుందని ప్రకటించారు.[4] చిత్రీకరణకు సంబంధించి వివరాలతో నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మొదటి షెడ్యూల్ 2012, నవంబరు 1 నుండి 15 వరకు హైదరాబాదు పరిసరాల్లో, రెండవ షెడ్యూల్ డిసెంబరు 5 నుండి 20 వరకు జరుగుతుందని, బ్యాంకాక్‌లో 2013, జనవరి 15 నుండి ఫిబ్రవరి 12 వరకు జరిగే మూడవ (చివరి) షెడ్యూలుతో చిత్రీకరణ పూర్తవుతుందని ప్రకటించారు.[15] నరేష్ నటింటిన కెవ్వు కేక సినిమా చిత్రీకరణ పూర్తయింది.[16][17][18]
కెవ్వు కేక యునైటెడ్ స్టేట్స్ షెడ్యూల్[19]
ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా 2013, జూలై 19న విడుదలయింది.[1]
ఈ చిత్రంలోని పాటలను భీమస్ సెసిరోలె, చిన్ని చరణ్ అనే ఇద్దరు సంగీత స్వరకర్తలు కలిసి సమకూర్చారు. 2013, జూన్ 30న ఆదిత్య మ్యూజిక్ పాటలు విడుదలయ్యాయి.[20] ఈ చిత్రంలోని నాలుగు పాటలను భీమస్ సెసిరోలె, శ్రీమణి, కేథారినాథ్, సుద్దాల అశోక్ తేజ రాశారు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఎర్ర ఎర్రనిదాన (రచన: సుద్దాల అశోక్ తేజ)" | హేమచంద్ర, గీతా మాధురి | 3:02 | ||||||
2. | "మొదల్ మొదల్ (రచన: శ్రీమణి)" | చిన్ని చరణ్, రమ్య బెహర | 4:02 | ||||||
3. | "బాబు ఓ రాంబాబు (రచన: భీమస్ సెసిరోలె)" | సునిధి చౌహాన్, భీమస్ సెసిరోలె, నరేంద్ర శరణ్ | 3:42 | ||||||
4. | "రోమియో జూలియట్ (రచన: కేథారినాథ్)" | విజయ్ ప్రకాష్, దీప్తి సయనోర | 4:01 | ||||||
14:47 |