కె.పి.కిట్టప్ప పిళ్ళై | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | చిదంబరం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1913 మే 5
మరణం | 30 అక్టోబరు 1999 | (aged 86)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్యం నృత్యకారుడు, నాట్యగురువు |
కె.పి.కిట్టప్ప పిళ్ళై (1913-1999) భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.
ఇతడు 1913 మే 5వ తేదీన సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి సంగీత కళానిధి తంజావూర్ కె.పొన్నయ్య పిళ్ళై.[1] ఇతడు తంజావూరు సంగీత చతుష్టయంగా పేరుపొందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలుల ఏడవ తరానికి చెందిన విద్వాంసుడు. ఈ తంజావూరు సంగీత చతుష్టయం ఇసై వెల్లాల కులానికి చెందినవారు. వీరు ముత్తుస్వామి దీక్షితుల వద్ద సంగీత శిక్షణ పొంది వివిధ రాజాస్థానాలలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు. చిన్నయ్య (జ.1802) భరతనాట్యాన్ని మైసూరు సంస్థానంలో ప్రవేశపెట్టి అక్కడ ఆస్థాన విద్వాంసుడిగా స్థిరపడ్డాడు. పొన్నయ్య (జ.1804), శివానందం (జ.1808) లు తంజావూరులోనే మరాఠాల ప్రాపకంలో జీవించారు. వడివేలు (జ.1810) కర్ణాటక సంగీతంలో వాయులీన విద్వాంసుడిగా తిరువాంకూరు మహారాజు స్వాతి తిరునాళ్ కోరికపై మోహినియాట్టం నృత్యరీతిని రూపొందించాడు. ఈ సోదరులు భరతనాట్యంలో మార్గాన్ని (అలరింపు నుండి తిల్లాన వరకు) అభివృద్ధి చేసి భరతనాట్యాన్ని నేటి రూపంలోనికి తీసుకువచ్చారు. ఈ సోదరులు ఎన్నో అలరింపులను, జతిస్వరాలను, కవిత్వాలను, శబ్దాలను, వర్ణాలను, పదాలను, జావళీలను, కీర్తనలను, తిల్లానాలను స్వరపరిచారు. ఈ తంజావూరు సంగీత చతుష్టయం వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి తరువాతి ఎనిమిది తరాల వంశీకులు వీరి సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, అభివృద్ధి చేస్తూ నేటి ఉత్తమ భరతనాట్య కళాకారులుగా కొనసాగుతున్నారు.
కిట్టప్ప పిళ్ళై తన తండ్రి పొన్నయ్య పిళ్ళై వద్ద సంగీతాన్ని నేర్చుకుని మొదట గాత్రవిద్వాంసునిగా తన వృత్తిని ఆరభించాడు. తరువాత తన మాతామహుడైన పందనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యం అభ్యసించి నట్టువన్నుగా స్థిరపడ్డాడు.
ఇతడు గొప్ప సంగీతకారుడిగా, గురువుగా, నృత్య దర్శకుడిగా రాణించి తంజావూరు శైలి భాండాగారంలోని శరభేంద్ర భూపాల కురువంజి, నవసంధి కవిత్వం వంటి అపురూపమైన కృతులను వెలికి తీసి వాటిని పరిష్కరించి 1950లలో ప్రచురించాడు.[2][3][4]
ఇతడు దేశవిదేశాలలో అనేక మంది శిష్యులకు శిక్షణనిచ్చి వారిని తంజావూరు బాణీలో పేరుపొందిన భరతనాట్య విద్వాంసులుగా తయారు చేశాడు. వారిలో పేర్కొనదగిన కొందరు:
ఇతడు తమిళనాడు సంగీత కళాశాలలో, అన్నామలై విశ్వవిద్యాలయంలో నాట్యాచార్యునిగా పనిచేశాడు.
ఇతనికి అనేక బిరుదులు, పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
ఇతడు తన పూర్వీకులైన తంజావూరు సంగీత చతుష్టయానికి సంబంధించిన రచనలతో పొన్నయ్య మణిమాల, తంజై నాట్య ఇసైకరువూలం, ఆది భారతకళామంజరి, చిన్నయ్య జావళీలు, గానకళా స్వరభూషణి (తన సోదరుడు తంజావూర్ కె.పి.శివానందంతో కలిసి) అనే గ్రంథాలను ప్రచురించాడు.
ఇంకా ఇతడు తంజావూరు బాణీకి చెందిన అపూర్వమైన నృత్యాలకు, షాజీ మహారాజ్ మరాఠీ బాణీ నృత్యాలకు భరతనాట్య పద్ధతిలో రూపకల్పన చేశాడు.