కొండపాక

కొండపాక, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలానికి చెందిన గ్రామం.[1]

కొండపాక
—  రెవెన్యూ గ్రామం  —
కొండపాక is located in తెలంగాణ
కొండపాక
కొండపాక
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°58′31″N 78°50′58″E / 17.975175°N 78.8493425°E / 17.975175; 78.8493425
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం కొండపాక
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,607
 - పురుషుల సంఖ్య 2,784
 - స్త్రీల సంఖ్య 2,823
 - గృహాల సంఖ్య 1,247
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1247 ఇళ్లతో, 5607 జనాభాతో 2890 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2784, ఆడవారి సంఖ్య 2823. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1111 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 573053[3].పిన్ కోడ్: 502372.

గ్రామ విశేషాలు

[మార్చు]

మెదక్‌ జిల్లాలో సిద్ధిపేట రెవెన్యూ డివిజన్‌లోని కొండపాక గ్రామం ఒక మండల కేంద్రం. కొండపాక గ్రామం చారిత్రిక ప్రశస్తి పొందిన గ్రామం. కాకతీయరాజ్యంలో సైనికుల విడిదిగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామం సిద్ధిపేట నుండి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని పశ్చిమాన ‘రాముని గుట్టలు’ అనే కొండల వరుస ఉంది. ఈ కొండలపై ఒక రామాలయం ఉండడం విశేషం. కొండల ప్రక్కన వెలసిన గ్రామం ‘కొండప్రక్క’. బహుశా ఈ పేరే రానురాను ‘కొండపాక’గా పరిణామం చెంది ఉండవచ్చు.

గ్రామం ఉత్తరపు అంచున కాకతీయుల కాలం నాటి రెండు ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. 1. రుద్రేశ్వరాలయం 2. త్రికూటేశ్వ రాలయం. ఈ రెండింటిలో రెండు శాసనాలున్నాయి. వీటి ప్రకారం, పై దేవాలయాలు 800 సంవత్సరాల క్రితం నిర్మింపబడ్డాయి. అంతకుముందే కొండపాక అనే పేరుతోనే ఈ గ్రామం సకల సౌభాగ్యాలతో స్థిరపడి ఉందని స్పష్టమవుతోంది.కొండపాక గ్రామం యొక్క ప్రత్యేక సంఖ్య (7) ఏడు. ఏడు చిన్న చిన్న గ్రామాలు కలిసి ఈ గ్రామం ఏర్పడిందని ప్రతీతి! అందుకే గ్రామ మధ్య ఏడు నాభిశిలలు (ఏడు బొడ్రాయిలు) నెలకొల్పబడి ఉన్నాయి. ఏడు చెరువులు, ఏడు ఆంజనేయ స్వామి దేవాలయాలు, ఏడు గుట్టలు ఈ గ్రామ ప్రత్యేకత! బ్రతుకమ్మ పండుగ కూడా 7వ నాడే జరుపకోవడం ఈ గ్రామ సంపద్రాయం.

పోలీసు చర్యకు ముందు గ్రామ స్థితిగతులు

[మార్చు]

పోలీసుచర్య (సెప్టెంబర్‌, 1948)కు ముందు ఈ గ్రామం చాలా కాలం నల్లగొండ జిల్లాలోని చేర్యాల తాలూకాలో అంతర్భాగంగా ఉంది. నిజాం పాలనా కాలంలోనే జిల్లాల సరిహద్దులు మార్చబడినపుడు ఈ గ్రామాన్ని మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట తాలూకాకు మార్చబడింది. నిజాం పాలనా కాలంలో ఇక్కడ ‘‘సర్కార్‌ బంగ్లా’’ అనే పేర ఒక రెవెన్యూ వసూలు కేంద్రం నిర్మించబడింది. ఈ భవనం ఈనాటికీ చెక్కు చెదరలేదు.1948కి ముందే గ్రామంలో రెండు పాఠశాలలు ఉండేవి. విద్యాబోధన ఉర్దూ మాధ్యమంలో ఉండేది. 1. బాలుర ప్రాథమిక పాఠశాల (4వ తరగతి వరకు) 2. బాలికల ప్రాథమిక పాఠశాల (3వ తరగతి వరకు) ‘‘పరదాలు కట్టబడిన ఎడ్లబండి’’పై బాలికలను పాఠశాలకు చేర్చే సదుపాయం ఆనాడే ఉండేది!!

ఆనాటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడే పోస్టాఫీసు నిర్వహించే వాడు. సుస్థిరమైన పారిశుధ్య పనులను పర్యవేక్షించేవాడు. ఉత్తర, ప్రత్యుత్తరాలలో సహకరించేవాడు. శుభకార్యాలలో గౌరవప్రదమైన వ్యక్తిగా పరిగణింపబడేవాడు. పోలీసు చర్యకు ముందు తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల దురాగతలు, దుశ్చర్యలు మితిమీరి ఉండేవి. వారిని ఎదుర్కోవ డానికి గ్రామపెద్దలు, యువకులు కలసికట్టుగా ‘‘గ్రామ రక్షణ దళాలు’’గా ఏర్పడి, రాత్రులు కాపలా కాసేవారు. గ్రామ ప్రజలందరూ కులాలకు అతీతంగా బంధుత్వాలు ఏర్పరచుకుని, వరుసలతో పలకరించుకోవడం ఇక్కడి తరతరాల సాంప్ర దాయం. ఈ అన్యోన్యత గ్రామాన్ని రక్షించుకోవడంలో, ప్రగతి పథంలో పయనించడంలో బాగా తోడ్పడింది. నేటికీ ఈ సుహృద్భావం కొనసాగడం ముదావహం!

నిజాం పాలనా కాలంలో కొండపాక పోలీస్‌ పటేల్‌ పేరు దొమ్మాట రాజారాంరెడ్డి. ఇతనికి నిజాం నవాబు ఐదు రూపాయలు జరిమానా విధించే దండనాధికారం (థర్డ్ క్లాస్‌ మేజిస్ట్రియల్‌ పవర్‌) ఇచ్చారు. ఈ గౌరవం ఏ గ్రామ పటేలుకు ఆ రోజుల్లో లభించలేదు. స్వాతంత్ర సముపార్జనకు ముందే కొండపాక గ్రామం సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు. ‘కొండపాక పందిరి గుంజలు కూడా సంగీతం పాడేవి’ అనే ప్రతీతి ఉంది.బ్రహ్మశ్రీ మరుమాముల శ్రీరామ సిద్ధాంతి ఆ రోజుల్లో సుమారు 200 గ్రామాలకు ఏకైక సిద్ధాంతిగా, పంచాంగకర్తగా, జ్యోతిశ్శాస్త్ర పండితుడుగా పేరుపొందిన మహనీయుడు అని అంటారు. వారి పంచాంగాలు మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాదు‌లో కూడా గౌరవప్రదంగా వినియోగించబడ్డాయి.

సంగీత రంగంలో కొండపాక విద్వాంసులు పలువురు దశదిశలా పేరు గడించారు. ఎన్‌సాన్‌పల్లె రాజయ్య (వయొలిన్‌), రామేశ్వరం (హార్మోనియం-మురళి-ఘటం), రామచంద్రం (తబల), ఆగమయ్య (హార్మోనియం), సోమయ్య (ఢోక్‌), హరిదాసు రామన్న (గాత్రం) మొదలైనవారు సంగీత విద్వాంసుల్లో కొందరు. వీరు స్థానికంగా నిర్వహించిన హరికథలకు, పురాణ కాలక్షేపాలకు చక్కటి వాద్య సహకారం అందించేవారు. నల్లగొండ జిల్లాలో గల శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా రామేశ్వరం చాలాకాలం కొనసాగారు.బ్రహ్మశ్రీ మరుమాముల శ్రీరామ సిద్ధాంతి పెద్ద కుమారుడు బ్రహ్మశ్రీ సీతారామశర్మ.ఇతను గొప్ప సాహిత్యవేత్త, వేదవేదాంగ పండితుడు. వ్యాకరణ శాస్త్రజ్ఞుడు. విద్వత్కవి, ఉభయ భాషాకోవిదుడు. యమక, శ్లేష ప్రయోగంలో నిష్ణాతుడు. ఇతనిని మించిన మేథావి ఈనాటికీ ఆ గ్రామంలో జన్మించలేదు. గ్రామానికే ద్రోణాచార్యుడైన వీరిని కన్న కొండపాక ధన్యమైంది. వైదిక సంస్కారాన్ని తన జీవితానికి అన్వయించుకుని అందరికీ హితులుగా, పురోహితులుగా బ్రహ్మశ్రీ జనార్దనశర్మ విరాజిల్లుచున్నారు

అంబటి భూమయ్యగారు, కుమారుడు అంబటి ఎల్లయ్య ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చర్మవ్యాధులకు దివ్యంగా పనిచేసే ఔషధాన్ని ఉచితంగా గత వంద సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నారు. వేలాది రోగులు ఈ ఔషధంతో లాభపడ్డారు. ఈనాటికీ ఆ ఇంటి వారసులు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

పోలీసుచర్య తరువాత కొండపాక ప్రగతి

[మార్చు]

17.9.1948న పోలీసు చర్యద్వారా హైదరాబాదు‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం చేయబడింది. కొండపాక గ్రామంలో శాంతి పరిరక్షణకై 1948 నుండి 1952 వరకు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పోలీసు వారిలో కొందరు సాహితీప్రియులుండేవారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు గ్రామ విద్యావంతులతో కలసి ‘చిత్రా క్లబ్‌’, ‘చిత్రా గ్రంథాలయం’ ఏర్పాటుచేశారు. (చిత్ర ఆ పోలీసు అధికారి కూతురి పేరు.) మరుమాముల సీతారామశర్మ పర్యవేక్షణలో చాలాకాలం కొనసాగిన ఈ గ్రంథాలయం పలువురికి విద్యా జ్ఞానాన్ని అందజేసింది. హైదరాబాదు‌ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కాలంలో రాష్ట్రంలో సుస్థిరమైన గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కొండపాక గ్రామ ప్రథమ సర్పంచ్‌గా దొమ్మాట నర్సింహారెడ్డి 20 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగిన స్థితప్రజ్ఞులు. దుద్దెడ నాన్‌ బ్లాక్‌ అధ్యక్షులు గాను, మెదక్‌ జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులుగాను, ప్రముఖ కాంగ్రెస్‌ వాదిగాను, జిల్లా స్థాయి నాయకులుగాను నర్సింహారెడ్డి కీర్తిప్రతిష్ఠలు గడించారు. వీరి నాయకత్వంలోనే కొండపాక గ్రామం అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించింది. ప్రాథమిక పాఠశాలను, మాధ్యమిక పాఠశాలగాను; ఆ తదుపరి ఉన్నత పాఠశాలగాను మార్చడంలో అతను చేసిన కృషి ప్రశంసనీయం, ఆదర్శప్రాయం.అతని ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలిచిన ప్రముఖులు... దొమ్మాట రామకృష్ణారెడ్డి (ఆ రోజుల్లో ‘మజ్లిస్‌ తాలిం దేహి’ అంటే విద్యా కమిటీ అధ్యక్షులు), అనంతుల చక్రపాణి (నిజాం కాలంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేశారు, అనంతుల రామనాథం (స్వాతంత్ర్య సమరయోధులు), కొండపాక అనంత రామ్‌రావ్‌ (పట్వారీ), దోడం బాలకిష్టయ్య (సాంస్కతిక కార్యక్రమాల ప్రోత్సాహకులు), దొమ్మాట నారాయణరెడ్డి (మెదక్‌ జిల్లాలో తొలి ఫధమ శ్రేణి కాంట్రాక్టర్‌), పేర్ల వీరమల్లయ్య, ముచ్చెర్ల రాజారాం, గుడాల రాజేశం, అంబటి ఎల్లయ్య, చిట్టి గాల్‌రెడ్డి, వడ్ల రాజారాం, దొమ్మాట మల్లారెడ్డి, దేవులపల్లి బలరాం, దేవులపల్లి రామయ్య, మంతెన బుచ్చయ్య, మంతెన నారాయణ, గజ్జే ఐలయ్యలతో పాటు ఆ రోజుల్లో పనిచేసిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు పి.వి. బ్రహ్మయ్య, మహ్మద్‌ జమీల్‌ అహ్మద్‌లు గ్రామ సర్పంచికి అండగా నిలచి విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయులు. భూకైలాస్‌, శ్రీకృష్ణ రాయబారం, వీరాభిమన్యు నాటకాలను విద్యార్థులచే ప్రదర్శింపజేసి నిధులు సేకరించడంలో వీరి కృషి ప్రశంసనీయం.

గ్రామ పాఠశాలను 1950-51లో ఐదవ తరగతి, 51-52లో ఆరవ తరగతి, 52-53లో ఏడవ తరగతి, 58-59లో ఎనిమిదవ తరగతి, 59-60లో తొమ్మిదవ తరగతి, 60-61లో పదవ తరగతి అంచెలంచెలుగా ప్రారంభించ బడ్డాయి. సర్పంచ్‌ కృషి ఫలితంగా పాఠశాలకి ఐదు గదుల భవనం నిర్మితమయ్యి 1956లో ఆనాటి హైదరాబాదు‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుచే ప్రారంభించబడింది. ఇది కొండపాక గ్రామ చరిత్రలో ఒక మధుర జ్ఞాపిక. తరువాతి కాలంలో అదనంగా మరో ఆరు గదులు, ప్రయోగశాల ప్రహరీగోడల నిర్మాణం జరిగాయి. జిల్లాలోనే ఆదర్శవంతమైన ఉన్నత పాఠశాలగా పేరుపొందింది.

దొమ్మాట నరసింహారెడ్డి కాలంలోనే హైదరాబాదు‌-సిద్ధి పేట రహదారి నుండి గ్రామం వరకు అప్రోచ్‌ రోడ్డు వేయబడి బస్సు సదుపాయం సమకూర్చబడింది. గ్రామం మధ్యలో ఉన్న బురుజుపై ట్యాంకులు బిగించి రక్షిత మంచినీటి సదుపాయం ఏర్పరచబడింది. గ్రామ పంచాయతీ భవనం కూడా వీరి కాలంలోనే నిర్మించారు.

దొమ్మాట నరసింహారెడ్డిగారి వారసులుగా బైరు బాల్‌రెడ్డి, పోతుగంటి వెంకటరెడ్డి, కీ।।శే।। అంబటి సత్యనారాయణ, శ్రీమతి అనంతుల శారద, జడ్‌పిటిసి శ్రీమతి ఏర్పుల భూలక్ష్మి, మండల పరిషత్‌ అధ్యక్షుడు బొద్దుల కనకయ్య, వారివారి పదవీ కాలాల్లో గ్రామాభివృద్ధికై శక్తిమేరకు కృషి చేశారు. ప్రాథమిక పాఠశాల భవనం, వసతి గృహాలు, డ్వాక్రా భవనం, మురికి కాల్వల నిర్మాణం, సిమెంటు రోడ్లు వీరి కాలంలోనే క్రమక్రమంగా సాధించబడ్డాయి. 2006లో ఎన్నుకోబడిన ఎంపిపి శ్రీమతి శారద, ఎంపిటిసి శ్రీమతి డి.లక్ష్మి, సర్పంచ్‌ శ్రీ బైరు రామకృష్ణారెడ్డి అదే బాటలో పయనించి గ్రామ సౌభాగ్యానికి కృషి చేశారు.

కొండపాక ఆణిముత్యం మదన్‌మోహన్‌

[మార్చు]

కొండపాక గ్రామం రాష్ట్రస్థాయి, దేశస్థాయి నేతలకు జన్మనిచ్చిన మహాతల్లి. అనంతుల మదన్‌మోహన్‌ ఈ నేలపై ఎదిగిన మాణిక్యాలలో ఒకరు. రాష్ట్ర మంత్రివర్యులుగా, ఎఐసిసి సభ్యులుగా, ఇందిరాగాంధీ ఆంతరంగిక అనుచరులుగా చాలాకాలం కొనసాగారు.ఇతని కృషి ఫలితంగా విరాళంగా ఇచ్చిన రెండెకరాల భూమిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పరచబడి, ఆ తరువాతి కాలంలో శాశ్వత భవనం, ప్రహరీగోడ నిర్మించబడ్డాయి. స్థానిక విద్యావంతులు, యువకులు, చాలాకాలం నిర్వహించిన ‘ప్రగతి పఠనాలయా’న్ని ‘శాఖా గ్రంథాలయం’గా మార్చడంలో మదన్‌మోహన్‌ కృషి మరువరానిది.అతని వల్ల కొండపాక గ్రామానికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. 1985-89 మధ్య కాలంలో దొమ్మాట శాసనసభ్యులుగా కొనసాగిన దొమ్మాట రామచంద్రారెడ్డి ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేసి, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవచేశారు. ప్రస్తుత జవహర్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం రామ చంద్రారెడ్డి సాంకేతిక శాఖామాత్యులుగా ఉండగా స్థాపించినదే.

గుడాల సుశీల-ఆగయ్య స్మారక జూనియర్‌ కళాశాల

[మార్చు]

సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం వారు మండల కేంద్రమైన కొండపాకలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పరిచారు. ప్రముఖ వ్యాపారవేత్త, స్థానికులు గుడాల ఆగయ్య, కళాశాలకు తన దివంగత ధర్మపత్ని సుశీల పేరున ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభుత్వం వారు ఈ విరాళాన్ని స్వాగతించి జూనియర్‌ కళాశాలను గుడాల సుశీల-ఆగయ్య మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల - కొండపాకగా నామకరణం చేశారు.

2004 వరకు మంత్రివర్యులుగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డి చొరవతో రాజీవ్‌ రహదారిపై ఐదెకరాల కొండపాక శివారు భూమిలో సుమారు 40 లక్షల విలువచేసే జూనియర్‌ కళాశాల భవన సముదాయం, ప్రహరీగోడ నిర్మించారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొండపాకలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కొండపాకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 670 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 104 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 57 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 288 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 72 హెక్టార్లు
  • బంజరు భూమి: 661 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1022 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1498 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 258 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కొండపాకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 258 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కొండపాకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, ప్రత్తి

దేవాలయాలు

[మార్చు]

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

[మార్చు]

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా నిర్మించిన 93 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను 2022, సెప్టెంబరు 20న తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

గ్రామానికి చెందిన వ్యక్తులు

[మార్చు]
  • బుద్ధి అఖిల్‌ - 2022 సివిల్స్‌ ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-17.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. Today, Telangana (2022-09-20). "Siddipet: Harish Rao inaugurates 218 double bedroom houses in Gajwel". Telangana Today. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.
  5. Andhra Jyothy (31 May 2022). "సివిల్స్‌ ర్యాంకు సాధించిన జిల్లా ఆణిముత్యాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]