కోటిలింగేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 12°59′42.6114″N 78°17′41.2542″E / 12.995169833°N 78.294792833°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
ప్రదేశం | కమ్మసంద్ర, కోలార్ |
సంస్కృతి | |
దైవం | శివుడు |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి |
కోటిలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉంది. కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు. ఆలయ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగం, 32 అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాలలో ఒకటి[1].
కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ (CE 788-827) అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు, కాని నాస్తికుడు. శివుడిని చిన్నప్పటి నుండి అవమానించేవాడు. అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు. అతను శివుని దైవత్వాన్ని గ్రహించి, పరమశివుని గొప్ప భక్తుడు అయ్యాడు. ఒక రోజు భక్త మంజునాథుడు, అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి, దానికి కారణం మంజునాథుడు అని అందరు తిట్టారు. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వరవర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్లీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొమ్మని అన్నాడు. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తిగీతాన్ని పాడగానే అవి మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి. అతను తన జీవితకాలంలో శివుడిని కోటిసార్లు అవమానించాడని నమ్ముతారు. అందువల్ల, భక్త మంజునాథుడు, మహారాజు అంబికేశ్వరవర్మ ఆధ్వర్యంలో, అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి, కోటి లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్టించాడు. అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వర అని పేరు వచ్చింది, ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివ మూర్తి 1980లో నిర్మించాడు[2].
ఆలయం ప్రధాన ఆకర్షణ 108 అడుగుల (33 మీ) పొడవు, 35 అడుగుల (11 మీ) పొడవైన నంది విగ్రహం, దాని చుట్టూ 15 ఎకరాల (61,000 మీ 2) విస్తీర్ణంలో లక్షల చిన్న లింగాలు ఉన్నాయి. నంది విగ్రహం 60 అడుగుల (18 మీ) పొడవు, 40 అడుగుల (12 మీ) వెడల్పు, 4 అడుగుల (1.2 మీ) ఎత్తు ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. లింగానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది, దీనిని భక్తులు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. విగ్రహాల ఎత్తు 1 అడుగు (0.30 మీ, 3 అడుగుల (0.91 మీ)) మధ్య ఉంటుంది. ఇక్కడ గెస్ట్ హౌస్, కళ్యాణ మండపం, ధ్యానం చేసుకోవడానికి హాలు, బృందావనం, ఆలయానికి అనుబంధంగా ఒక ప్రదర్శన కేంద్రం ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద, ఎత్తైన లింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు వంద లక్షల లింగాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు, అయితే వాటి సంఖ్య ~6.5 లక్షలు (అనగా 1 చదరపు మీటర్ల భూమిలో 10 లింగాలు, 61000 చదరపు మీటర్ల భూమి సుమారు 6.1 లక్షల లింగాలను కలిగి ఉంటుంది). ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వినాయకుడు, అయ్యప్ప, ఆంజనేయుడు, కన్యకా పరమేశ్వరి, పార్వతి, లక్ష్మీ, నవగ్రహ, సత్యనారాయణస్వామి, సుబ్రహ్మణ్య, వెంకటేశ్వర, పంచముఖి ఆంజనేయ, సంతోషిమాత, మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి[3]. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్య సేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది.
స్థల పురాణం ప్రకారం, దేవతల రాజు ఇంద్రుడు ఒకసారి గౌతమ మహర్షిని శపించాడు. ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పది లక్షల నదుల నీటితో శివలింగాన్ని అభిషేకించాడు. నేటికీ ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తుంది[4].
భక్త మంజునాథ కథ మొత్తం శ్రీ మంజునాథ అనే పేరుతో దర్శకుడు కె.రాఘవేంద్రరావు ద్వారా సినిమాగా తీయబడింది.