గుండు హనుమంతరావు | |
---|---|
జననం | గుండు హనుమంతరావు 1956 అక్టోబరు 10 |
మరణం | 2018 ఫిబ్రవరి 19 | (వయసు 61)
ఇతర పేర్లు | గుండు |
క్రియాశీల సంవత్సరాలు | 1984 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బాబాయి హోటల్ కొబ్బరి బోండాం యమలీల |
జీవిత భాగస్వామి | ఝాన్సీ రాణి |
పిల్లలు | ఆదిత్య శాయి, హరిప్రియ |
తల్లిదండ్రులు |
|
గుండు హనుమంతరావు (1956 ఆక్టోబరు 10 - 2018 ఫిబ్రవరి 19) ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.[1] సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు ధారావాహికలు, కార్యక్రమాలు కూడా చేశాడు. అమృతం అనే టీవీ సీరియల్ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నాడు.[2] మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతూ 2018, ఫిబ్రవరి 19న హైదరాబాదులో కన్ను మూశాడు.
ఆయన 1956, అక్టోబరు 10వ తేదీన విజయవాడలో కాంతారావు, సరోజిని దంపతులకి జన్మించాడు.[3] అతను తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. పెదనాన్న కృష్ణబ్రహ్మం మంచి గాయకులు. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే పదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. చదువునాటకాల్లో ఆయన వేసిన మొట్ట మొదటి వేషం రావణబ్రహ్మ.[4]
అతను భార్య ఝాన్సీ రాణి (45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.[5] ఇతనికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు ఆదిత్య సాయి, కుమార్తె హరిప్రియ. కుమార్తె 2008 లో మెదడువాపు జ్వరంతో మరణించింది.
మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్యను హనుమంతరావు బాగా చదివించాడు. ఎంఎస్ చేసేందుకు అమెరికాకు పంపారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలోనే తండ్రికి గుండెపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకుని ఆదిత్య వచ్చేశాడు. తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతోనే ఉండేవాడు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న హనుమంతరావుకు అనుకోకుండా కిడ్నీ సమస్యలు ఇబ్బంది పెట్టసాగాయి. అవి దూరమైతే గాని గుండెకు శస్త్రచికిత్స చేయమన్నారు. ఆ తరువాత అతనికి డయాలసిస్ మొదలు పెట్టారు. దీంతో రెండు రోజులకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. 24 గంటల పాటు దగ్గర ఉంటూ సేవలందించేవాడు. ఈ లోపు ఓపెన్ హార్ట్సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్న పిల్లవాడిలా సాకుతూ సేవలు చేశాడు.[6]
ఇతను సినిమాలలో నటించక ముందు కుటుంబ సాంప్రదాయమైన మిఠాయి వ్యాపారం చేసేవాడు.[1] ఆగండి కొంచెం ఆలోచించండి, ఓటున్న ప్రజలకి కోటి దండాలు, రాజీవం, ఇదేవిటి? నాటకాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. 1985లో మద్రాసులో ఇదేవిటి? నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాలతోపాటు, నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంధ్యాల సినిమా అవకాశమిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే రెండేళ్ల తర్వాత సత్యాగ్రహం అనే చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చారు జంధ్యాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో అహనా పెళ్లంట చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై కనిపించాడు. పెళ్ళి కొడుకు తండ్రి పాత్రలో ముప్పయ్యేళ్ల వయసులో అరవయ్యేళ్ల వృద్ధుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన విజయవాడ నుంచి హైదరాబాదుకు మకాం మార్చాడు.
జంధ్యాల, ఎస్. వి. కృష్ణారెడ్డి వంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. కళ్ళు, బాబాయ్ హోటల్, కొబ్బరి బోండాం, యమలీల, చినబాబు, రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, చెవిలో పువ్వు, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, మావిచిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆలస్యం అమృతం, క్రిమినల్, పెళ్ళాం ఊరెళితే, తప్పు చేసి పప్పుకూడు, పెళ్ళికాని ప్రసాద్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, మృగరాజు, జల్సా మొదలైన సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు. జెమిని టి. విలో ప్రసారమైన అమృతం ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో అతను పోషించిన ఆంజనేయులు అలియాస్ అంజి పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. బుల్లితెర ద్వారా మూడు నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు గుండు.[7]
2014 సార్వత్రిక ఎన్నికల్లో హాస్య నటులు చిట్టిబాబు, పింకీతో కలిసి తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు ప్రచారం చేశాడు. ఈయన ప్రచారంలో హాస్యం పండించిన శైలి జనాలను ఆకట్టకొని, అభ్యర్థి గెలుపుకు దోహదపడింది.
అహనా పెళ్లంట సినిమాలో గుండు హనుమంతరావు చేసింది చిన్నపాత్రే కానీ గుర్తింపు ఉన్న పాత్ర. బ్రహ్మానందంతోనూ, రాజేంద్రప్రసాద్‌తోనూ, అలీతోనూ కలిసి పలు చిత్రాల్లో నవ్వించారు గుండు. అమాయకత్వంతో వ్యవహరిస్తూ సాగే అసిస్టెంట్ పాత్రల్లో తన మార్క్ నటనని ప్రదర్శించారు. బుల్లితెరపై అమృతం ధారావాహికలో అంజిగా గుండు హనుమంతరావు సిట్యువేషనల్ హాస్యం పండించాడు. వేదికలపై పంచ్‌లు, మాటల విరుపులతో అలరించడం ఆయనకు అలవాటు.[7]
ఈటీవీలో 2017 డిసెంబరులో ప్రసారమైన అలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతోనే గుండు హనుమంతరావు అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసింది. గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది. దాదాపు 12 కిలోలు బరువు తగ్గాను. ఆ తర్వాత కిడ్నీ సమస్య ఏర్పడింది. చికిత్స కోసం యేడాదికి రూ.6 లక్షలు ఖర్చవుతోంది అని ఆ కార్యక్రమంలో చెప్పారు గుండు. ఆయన పరిస్థితిని తెలుసుకొని కథానాయకుడు చిరంజీవి రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించింది.
కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు 2018, ఫిబ్రవరి 19 ఉదయం 3:30 గంటలకు హైదరాబాదు ఎస్. ఆర్. నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.[8][9]
2018 ఫిబ్రవరి 20 సోమవారం సాయంత్రం 4.30 గంటలకి ఈఎస్ఐ సమీపంలోని సత్య హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటికలో గుండు హనుమంతరావు అంత్యక్రియలు నిర్వహించారు.[7]
ఇతను హాస్యప్రధాన పాత్రలలో ఎక్కువగా నటించాడు.