సర్ చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది | |||
చందులాల్ మాధవ్‌లాల్ త్రివేది | |||
ఒడిశా గవర్నరు
| |||
పదవీ కాలం 1 ఏప్రిల్ 1946 – 14 ఆగష్టు 1947 | |||
ముందు | హాథార్న్ లూయిస్ | ||
---|---|---|---|
తరువాత | కైలాష్‌నాథ్ కట్జూ | ||
పంజాబ్ గవర్నరు
| |||
పదవీ కాలం 15 ఆగష్టు 1947 – 11 మార్చి 1953 | |||
ముందు | లేరు | ||
తరువాత | సర్ చందేశ్వర్‌ప్రసాద్ నారాయణ్ సింగ్ | ||
ఆంధ్రప్రదేశ్ గవర్నరు
| |||
పదవీ కాలం 1 అక్టోబరు 1953 – 1 ఆగష్టు 1957 | |||
ముందు | లేరు | ||
తరువాత | భీంసేన్ సచార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కపాడ్వంజ్, ఖైరా జిల్లా, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటీషిండియా (ప్రస్తుత ఖేడా జిల్లా, గుజరాత్, భారతదేశం) | 1893 జూలై 2||
మరణం | 1980 మార్చి 15 కపాడ్వంజ్, ఖైరా జిల్లా (ప్రస్తుత ఖేడా జిల్లా, గుజరాత్, భారతదేశం) | (వయసు 86)||
జీవిత భాగస్వామి | కుసుమ్‌బెన్ చున్నీలాల్ త్రివేది |
సర్ చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది KCSI, CIE, OBE, ICS (1893, జూలై 2 - 1980, మార్చి 15) భారతీయ పాలనాధికారి, ప్రభుత్వాధికారి. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్రానికి తొలి గవర్నరుగా పనిచేశాడు. 1953 నుండి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి తొలి గవర్నరుగా పనిచేశాడు.
త్రివేది, అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీ లోని ఖైరా జిల్లా, కపాడ్‌వంజ్ గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇది ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో ఉంది. బొంబాయి విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ సెయింట్ జాన్స్ కళాశాలనుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, 1916లో భారతీయ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఆ తర్వాత సంవత్సరం అక్టోబరులో సివిల్ సర్వీసులో నియమితుడై, 1917 డిసెంబరులో భారతదేశం తిరిగివచ్చాడు.[1]
తొలుత మధ్య పరగణాల్లో సహాయ కమిషనురు (1924 జనవరి అధికారిక డిప్యుటీ కమీషనరు) గా పనిచేశాడు. నవంబరు 1926 నుండి సహకార సంఘాల రిజిస్ట్రారుగా, పరిశ్రమలకు ప్రాంతీయ డైరెక్టరుగా పనిచేశాడు. 1927 మార్చిలో డిప్యుటీ కమీషనరుగా, భారత ప్రభుత్వ గృహమంత్రిత్వశాఖలో ఉపకార్యర్శిగా 1927 మేలో నియమించబడ్డాడు. 1934లో అఫిషియేటింగ్ సంయుక్త కార్యదర్శిగా పదవోన్నతి పొంది, 1937 అక్టోబరులో మధ్యపరగణాల ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, 1942 మార్చిలో త్రివేది కేంద్ర ప్రభుత్వంలో యుద్ధ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించబడి, ఆ జూలైలో పూర్తి కార్యదర్శిగా పదవోన్నతి పొందాడు.[1]
యుద్ధం ముగిసిన తర్వాత, బ్రిటీషు రాజ్ అంతం కనుచూపు మేరలో ఉండగా, 1945 చివర్లో ఒడిశా రాష్ట్రానికి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఒడిశాకు బ్రిటీషు వారు నియమించిన తుది గవర్నరు, తొలి భారతీయ గవర్నరు త్రివేది. అధికారికంగా 1946 ఏప్రిల్లో గవర్నరు పదవి చేపట్టి, భారత స్వాతంత్ర్యం పొందే ముందు రోజు 1947, ఆగస్టు 14 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత రోజు స్వతంత్ర భారతంలో తూర్పు పంజాబ్ ప్రాంతానికి తొలి భారతీయ గవర్నరుగా నియమించబడ్డాడు (ఈ ప్రాంతం కొంత హర్యానా రాష్ట్రంలో భాగమైంది).[2]
భారత విభజనలో భాగంగా, అంతవరకు అవిభాజిత పంజాబ్ ప్రాంతానికి రాజధానిగా ఉన్న లాహోరు పాకిస్తాన్లోకి వెళ్ళడంతో, తూర్పు పంజాబ్ కు గవర్నరుగా నియమించబడిన వెంటనే త్రివేదికి అనేక కష్టాలు మొదలయ్యాయి. ఈయన మంత్రులు కార్యాలయాలు, సహాయక బృందం లేదా సమాచారప్రసరణ వ్యవస్థలు లేకుండానే పనులు ప్రారంభించాల్సి వచ్చింది. అన్ని టెలిఫోన్ మరిఉయు టెలిగ్రాఫ్ లైన్లు లాహోరు ద్వారా వెళుతుండటంతో, ఢిల్లీకి నేరుగాసమాచారం పంపే వ్యవస్థ లేకపోయింది. అరకొరగా ఉన్న మౌలిక సదుపాయాలు, 1947 శీతాకాలంలో ఆ ప్రాంతంలో చెలరేగిన సామూహిక అల్లర్లు, ఊచకోచతలకు ప్రభుత్వం యొక్క ప్రతిస్పందనను మరింత క్లిష్టతరం చేశాయి. అంతేకాకుండా పాకిస్తాన్ నుండి వరదలాగా పెద్ద సంఖ్యలో వలసవస్తున్న హిందువులు, సిక్ఖు కాందిశీకులకు సహాయం అందజేసేందుకు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.[3]
1950లో పేరుమార్చుకొని కొత్తగా ఏర్పడిన పంజాబ్ రాష్ట్రనికి తొలి గవర్నరుగా 1953 వరకు పనిచేశాడు.[4] 1953 అక్టోబరు 1న కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి తొలి గవర్నరుగా నియమించబడ్డాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు గవర్నరుగా కొనసగాడు.[5] 1957 ఆగస్టు 1 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు.1957 అక్టోబరు 28 నుండి 1963, డిసెంబరు 1 వరకు ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. 1963 సెప్టెంబరు 22 నుండి 1963 డిసెంబరు 2 వరకు, కొద్దికాలం పాటు ప్రణాళికా సంఘానికి డిప్యుటీ ఛైర్మన్ గా కూడా పనిచేశాడు.[6] త్రివేది 1967 ఫిబ్రవరి నుండి 1973 అక్టోబరు వరకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు.
సుదీర్ఘమైన, అర్ధవంతమైన జీవితం జీవించి త్రివేది, క్రియాశీలక జీవితం నుండి విరమణ పొంది తన స్వస్థలంలో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడే 86 ఏళ్ల వయసులో 1980, మార్చి 15న మరణించాడు.[7]
ఈయన కపాడ్వంజ్ కే చెందిన లేడీ కుసుమ్ చున్నీలాల్ త్రివేదిని పెళ్ళి చేసుకున్నాడు. 1947 ఆగస్టు 14న బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించిన తుట్టతుది పురస్కారాల్లో ఈమెకు కైజర్-ఏ-హింద్ స్వర్ణపతకాన్ని ప్రకటించింది.[8]
1931 నూతన సంవత్సర సత్కారాల జాబితాలో త్రివేదిని ఆర్డర్ ఆఫ్ బ్రిటీషు ఎంపైర్ (ఒ.బి.ఈ) అధికారిగా నియమించబడ్డాడు[9] 1935 జన్మదిన సత్కారాల జాబితాలో కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (సి.ఐ.ఈ) గా, 1941 జన్మదిన సత్కారాల జాబితాలో కంపానియన్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఇండియా (సి.ఎస్.ఐ) గా సత్కరించబడ్డాడు.[10][11] 1945 జన్మదిన సత్కారాల జాబితాలో "సర్"గా సత్కరించబడి, [12] 1945 ఆగస్టు 18న వైస్రాయ్ హౌస్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) లో జరిగిన సమావేశంలో లార్డ్ వేవెల్ ఈయన్ను లాంఛనంగా నైట్ ను చేశాడు.[13] ఆ తర్వాత అదే సంవత్సరం 1945 డిసెంబరు 21న నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (కె.సి.ఎస్.ఐ) గా ప్రకటించబడ్డాడు.[14] 1956లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మవిభూషణ సత్కారంతో గౌరవించింది.