చంద్రబోస్,తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[1] ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.
చంద్రబోస్ సాహిత్యం అందించిన ‘నాటు నాటు’ పాట 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[2][3][4]
చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు.[6] తల్లి మదనమ్మ 2019 మే 20 న మరణించింది.[7]
వారి గ్రామంలో అప్పుడప్పుడూ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవాడు. తరువాత ఆ ఊర్లోకి సినిమా హాలు రావడంతో సినిమాలు వీక్షించడం అలవాటైంది.
చంద్రబోస్ ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవాడు.
దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాతరామానాయుడుకి చూపించడంతో తాజ్‌మహల్ సినిమాలోమంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీరంగంలో రెండో దాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు.
పెళ్ళిపీటలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్ పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరూ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
↑"Chandrabose". Golden Globes (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-11. Retrieved 2023-01-11.
↑"నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine)|Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.