జూబ్లీ హిల్స్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
నగరం | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• శాసనసభ్యుడు | మాగంటి గోపీనాథ్ (టిఆర్ఎస్) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ | 500 033 |
Vehicle registration | TS |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ అభివృద్ధి సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జూబ్లీ హిల్స్ హైదరాబాదులోని ఒక ముఖ్య, ఖరీదైన నివాసప్రాంతము. హైదరాబాదు నగరంలో సంపన్నులు ఎక్కువగా నివసించే ప్రాంతము. భారతదేశంలో అత్యంత ఖరీదైన వాణిజ్య, నివాస ప్రదేశాలలో ఇది ఒకటి.[1] హైదరాబాదు నగర హైటెక్ సిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.[2][3][4] దీనికి ఆగ్నేయ దిశలో 1.58 కి.మీ. విస్తీర్ణంలో భారతదేశంలోని అతిపెద్ద పట్టణ జాతీయ ఉద్యానవనాలలో ఒకటైన కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం (పూర్వపు చిరాన్ ప్యాలెస్), మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఉన్నాయి.
1963లో జూబ్లీహిల్స్ ఆలోచన వచ్చింది. మద్రాసులో అనేక కాలనీల ప్రణాళిక చేసిన ఐఏఎస్ అధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చల్లగల్ల నరసింహం అధ్యక్షుడిగా 1967లో కాలనీ అభివృద్ధి ప్రారంభమైంది. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ప్రాంతం అభివృద్ధిలేకుండా, కొండలను నిలయమై ఉండేది. ఆ ప్రాంతంలో నరసింహం కుటుంబం తొలిసారిగా జూబ్లీహిల్స్‌లో ఇంటిని నిర్మించుకొన్నారు. 1980 నాటికి ఈ ప్రాంతంలో 350 ఇళ్ళు నిర్మించబడ్డాయి.
జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ తెలుగు సినిమా పరిశ్రమ కేంద్రంగా ఉన్నాయి. రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని చాలామంది నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.
తాజ్ మహల్ హోటల్, టెస్టారోసా, వాక్స్, కేఫ్ లాట్టే, బారిస్టా, స్టార్‌బక్స్, కాఫీ డే వంటి వివిధ హోటళ్ళు, కేఫ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి. సీవేస్, గేట్‌వే మీడియా, రాధా రియల్ ఎస్టేట్, లాంకో గ్లోబల్ సిస్టమ్స్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల వంటి సంస్థల కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
దక్షిణాసియా గుండె ఆరోగ్య అవగాహన కలిగిస్తున్న అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్రంలోని ఒక ప్రధాన మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటైన అపోలో హెల్త్ సిటీ అపోలో హాస్పిటల్, అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి ఇతర అపోలో అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఎటర్నెస్ మెడికల్ క్లినిక్, ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఉన్నాయి. పి. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, వాల్డెన్ పాత్, శ్రీనిధి, ఓక్రిడ్జ్, ఆర్కిడ్స్ పాఠశాలలు ఉన్నాయి.
సీతారామస్వామి ఆలయం, జగన్నాథస్వామి ఆలయం, పెద్దమ్మ తల్లి దేవాలయం ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ఎన్టివి, యుప్ టివి, టివి9, టివి 5, టీ న్యూస్, వి6 న్యూస్, సివిఆర్ న్యూస్ మొదలైన మీడియా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్, ఫిల్మ్ నగర్ క్లబ్, హైదరాబాద్ జింఖానా, ఇండోర్ అవుట్డోర్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, ఫౌంటైన్లు మొదలైనవి ఉన్నాయి.[5]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషను సమీపంలో ఉంది. రోడ్ నంబర్స్ 36, 37 వెనుక వైపున ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.[6]
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలోని కమలానగర్ లో నిర్మించిన 210 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2023, మే 18న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించి, లబ్ధిదారులకు అందించారు.[7]
16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయలతో 210 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి, 15.50 లక్షల రూపాయలతో లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం, 15 దుకాణాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఒక్కొ ఇళ్ళు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో 8.50 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు డిగ్నిటీ కాలనీగా నామకరణం చేశారు.[8]