టంగుటూరి అంజయ్య | |
---|---|
7వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | |
In office 11 అక్టోబరు 1980 – 24 ఫిబ్రవరి 1982 | |
గవర్నర్ | కె.సి.అబ్రహాం |
అంతకు ముందు వారు | మర్రి చెన్నారెడ్డి |
తరువాత వారు | భవనం వెంకట్రామ్ |
Member of the భారత Parliament for సికింద్రాబాదు | |
In office 31 డిసెంబరు 1984 – 27 నవంబరు 1986 | |
అంతకు ముందు వారు | పి.శివశంకర్ |
తరువాత వారు | టి.మణెమ్మ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1919 ఆగస్టు 16 భానూరు, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1986 (67 సం.వయసులో) |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | టంగుటూరి మణెమ్మ |
సంతానం | 1కుమారుడు, 4గురు కుమార్తెలు |
నివాసం | భానూరు, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16,1919 - అక్టోబరు 19,1986), రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]
టి. అంజయ్యగా సుపరిచితుడైన టంగుటూరి అంజయ్య అలియాస్ తాళ్ళ రామకృష్ణారెడ్డి 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య వెనుకబడిన కులానికి లేదా దళిత వర్గానికి చెందినవారని లేదా గౌడ కులం, రెడ్డికులం వారితో సాన్నిహిత్యం ఏర్పరచుకోన్నారని తన పేరును రామకృష్ణారెడ్డి అని మార్చుకున్నారని, తన ముఖ్యమంత్రి పదవీకాలానికి రాజకీయంగా శక్తివంతమైన రెడ్డి సంఘం మద్దతు పొందటానికి రెడ్డి కులస్తులతో వైవాహిక సంబంధాలు కుదుర్చుకున్నారని అతనిపై ఆరోపణలున్నాయి.[2][3]
అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరువాత ఉన్నత విద్యాభాసం చేయలేదు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల (24 పైసలు) కూలీగా జీవితం ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆతరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు.[4][5]
కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు.[6] అంజయ్య తన ప్రారంభ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, ఇది అతనిని సామాజిక న్యాయం కోసం పోరాట యోధునిగా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయాలకు అనుగుణంగా పనిచేసాడు.
1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. అతను మర్రి చెన్నారెడ్డి తరువాత 1980 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలోని 15 మంది అసమ్మతి వాదులకు పదవులు ఇవ్వవలసి వచ్చింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు.[7][8]
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇద్దరు యువ తిరుగుబాటు రాజకీయ నాయకులు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి. నారా చంద్రబాబునాయుడు, ప్రాముఖ్యతను పొందారు. ఈ సమయంలో ఎన్టీఆర్ను రాజ్యసభ సభ్యునిగా చేయాలనే ప్రతిపాదన చేసారు.[9] అంజయ్య పి.జనార్దన్ రెడ్డికి గురువు. విశాఖపట్నం, విజయవాడలలో మునిసిపల్ ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయిన తరువాత టి.అంజయ్య తన పార్టీలోని కొంతమంది మంత్రులతో సహా ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు.
మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు[10]. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఫిబ్రవరి 13 న పదవి నుంచి వైదొలగాలని శ్రీమతి ఇందిరా గాంధీ కోరినప్పుడు, అతను తన రాజీనామాను ఏడు రోజుల తరువాత 1982 ఫిబ్రవరి 20 న అధికారికంగా ఇచ్చాడు. అతను అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. అనుచరులు లేని నాయకుడిగా అతను అనూహ్యమైన ప్రజల సానుభూతిని పొందగలిగాడు. ముఖ్యమంత్రిగా తన చివరి బహిరంగ ప్రదర్శనలో, అతను రాజీనామా చేయడానికి ముందు రోజు 30,000 మంది ప్రజలు పాల్గొన్నారు[11] 1982 ఫిబ్రవరి 24 న భవనం వెంకటరామిరెడ్డి అంజయ్య స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించాడు.
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.[12]
1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైంది. 2018 సెప్టెంబరు 9 న మణెమ్మ హైదరాబాదులో చనిపోయింది.
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనికి విమానాశ్రయంలో అవమానం జరిగింది. రాజీవ్ గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాడు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాజీవ్ గాంధీని స్వాగతించేందుకు అంజయ్య భారీ ఏర్పాట్లు చేశాడు.[13] అంజయ్య అనుచరగణాన్ని వేసుకుని వెళ్ళి విమానం ఆగుతూండగానే భారీ కాయంతో, భారీ దండల్తో రన్‌వే పైకి, పరుగులు పెట్టుకుంటూ వెళ్లాడు. అతనితో పాటు అనేక మంది జనం వెళ్లారు. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్‌కు విమానాశ్రయంలో యీ భద్రతారాహిత్యం ఒళ్లు మండించింది. తెచ్చిన పూలదండలలోని పూల రేకులు విమానం ప్రొపెర్లలో పడతాయని ఆందోళనతో అంజయ్యను మందలించాడు. దానికి అంజయ్య మొహం మాడ్చుకున్నాడు తప్ప నిరసన తెలపలేదు. తను చేసినది ఎయిర్‌పోర్టు రూల్సుకు వ్యతిరేకమని అతనికి తెలుసు. ఈ వార్త పత్రికలకు ఎక్కాక ఎవ్వరూ అంజయ్యగారిని సమర్థించలేదు. రాజీవ్ కాస్త మెత్తగా చెప్పి వుండాల్సిందనే అనుకున్నారంతే.[14]
ఎలాంటి పదవి లేని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిని తోసేయడం సంచలనం సృష్టించింది. అంజయ్య దళితుడు కాబట్టే రాజీవ్ గాంధీ అతన్ని అవమానించారని 2018 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. నిజానికి టి.అంజయ్య దళితుడు కాదు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారన్నది పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పే మాట.[15]
తెలుగు వారికి జరిగిన అవమానంతో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.[16]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
ఇంతకు ముందు ఉన్నవారు: డా.మర్రి చెన్నారెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 11/10/1980—24/02/1982 |
తరువాత వచ్చినవారు: భవనం వెంకట్రామ్ |