డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం | |
---|---|
ఇతర పేర్లు | ' |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°27′N 78°30′E / 17.45°N 78.5°E |
సంచలనాత్మక | 2019, జూన్ 27 |
నిర్మాణ ప్రారంభం | 2021 జనవరి |
ప్రారంభం | 2023 ఏప్రిల్ 30 |
వ్యయం | 617 కోట్ల రూపాయలు |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఎత్తు | 265 అడుగులు |
సాంకేతిక విషయములు | |
పరిమాణం | 28 ఎకరాలు (11.33119798272 హె.) |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | డా.ఆస్కార్, పొన్ని కాన్సెసావో |
ఆర్కిటెక్చర్ సంస్థ | ఓసిఐ ఆర్కిటెక్ట్స్ |
ప్రధాన కాంట్రాక్టర్ | షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 635 |
పార్కింగ్ | 560 కార్లు, 700 ద్విచక్ర వాహనాలు |
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం. ఇది హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నిజాం నవాబుల పాలన కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది.[1] 2022 సెప్టెంబరు 15న దీనికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టబడింది.[2]
నిజాం కాలం నాటి వారసత్వ నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌గా మార్చబడింది. 16 మంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పాలన చేపట్టారు. 25.5 ఎకరాలలో 10 బ్లాకులు ఈ సెక్రటేరియట్ విస్తరించి ఉంది.[3] ఇందులోని పరిపాలనా భవనాన్ని పేషీ లేదా జి-బ్లాక్ అని పిలుస్తారు. ఈ జి-బ్లాక్‌ను 1888లో ఆరో నిజాం నవాబు కాలంలో నిర్మించారు. 1978లో మర్రి చెన్నారెడ్డి సి-బ్లాక్‌ను 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య ఎ-బ్లాక్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. 1990లో మర్రి చెన్నారెడ్డి జె, ఎల్ బ్లాక్‌లను ప్రారంభిచాడు. 1998 ఆగస్టు 10న నారా చంద్రబాబు నాయుడు, ఎ-బ్లాక్ రెండో దశను ప్రారంభించాడు. 2003లో చంద్రబాబు డి-బ్లాక్‌కు శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని ప్రారంభించాడు.[1] 2014లో రాష్ట్ర విభజన తర్వాత, 10 సంవత్సరాల పాటు (2024 వరకు) ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు 58:42 గా ఈ సెక్రటేరియట్ విభజించబడింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని 2022 సెప్టెంబరు 15న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీచేయగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 111, 15/09/2022) జారీ చేశాడు.[4]
పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేకపోవడం, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో సౌకర్యాల లేమి, ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు-వీడియో కాన్ఫరెన్స్ హాళ్ళు లేకపోడం, అధికారులు ఇతర సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడానికి అనువుగా లేకపోవడం, ఫైళ్ళ తరలింపులో ఇబ్బందులు ఎదురవడం, నేషనల్ బిల్డింగ్ - గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు లేకపోవడం, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినపుడు బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో ఉండడం వంటి కారణాలలో తెలంగాణ ప్రభుత్వం ఈ భవన సముదాయాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక కొత్త కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా, తెలంగాణకే తలమానికంగా ఉండేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయం నిర్మించనున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించాడు.[5]
2019 జూన్ 27న సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుకభాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ, శంకుస్థాపన చేశాడు.[6]
2019 ఆగస్టు నెల ప్రారంభంలో తెలంగాణ సచివాలయాన్ని తాత్కాలికంగా బీఆర్‌కే భవన్‌కు తరలించగా, ఆగస్టు 9 నుంచి కొత్త ప్రాంగణంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. కొత్త సచివాలయ నిర్మాణం పూర్తై, 2023 ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం జరిగేవరకు వివిధ శాఖలు బీఆర్‌కే భవన్‌లోనే కొనసాగాయి.
పాత సచివాలయ భవనాలు బాగానే ఉన్నాయని, వాటిన కూల్చాల్సిన అవసరం లేదని పలువురు తెలంగాణ హైకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు. భవనాల కూల్చివేతలో తాము జోక్యం చేసుకోలేమని, సచివాలయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మించాలి అనేది ప్రభుత్వం ఇష్టమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.[7] ఈ తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని కూడా భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2020 జూలై 7న పాత సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను కూల్చివేయబడి, దాని స్థానంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది.[8][9] పాత భవనాల కూల్చివేత సందర్భంగా సచివాలయ ప్రాంగణంలోని దేవాలయం, మసీదులు (700 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు మసీదులు), చర్చిలను తొలగించగా వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది.[10]
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన మునుపటి సచివాలయంలోని అన్నీ భవనాలు కలిపి సుమారు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. వాటన్నింటినీ 24 గంటల వ్యవధిలో సంప్రదాయ విధానంలో కూల్చివేసి, 1.92 లక్షల టన్నుల (14 వేల ట్రిప్పుల) నిర్మాణ వ్యర్థాలను తొలగించారు.
పాత సచివాలయం కూల్చివేతతో వెలువడిన 1.92 లక్షల టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు సచివాలయం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లు జీడిమెట్లలోని సీ అండ్ డీ వేస్ట్ (నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) సంస్థను నిర్వహిస్తున్న రాంకీతో ఒప్పందం చేసుకున్నారు. 2020 జూలైలో మొదలైన నిర్మాణ వ్యర్థాల తరలింపు గత ఏడాది నవంబరు వరకు కొనసాగింది. మొత్తం 7765 ట్రిప్పుల్లో 1,92,340.695 టన్నుల వ్యర్థాలను తరలించారు. కాంక్రీటు, స్లాబులు, ఇటుక గోడలు, కలప, ఇనుము వంటి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో బండరాళ్ళను కంకరగా, కాంక్రీటును ఇసుకగా, సన్న కంకరగా, సిమెంట్‌ను ఇటుకల తయారీకి ముడిసరుకుగా కాలుష్యరహితంగా రీ సైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేలా మార్చారు. బంకమట్టితో సిమెంట్, ఇసుక కంకరతో ఇటుకలు, పేపర్ బ్లాక్స్ వంటి వస్తువులను తయారుచేసి, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, పార్కింగ్ షెడ్లు, గోడలు, ఇతరత్రా నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారు.[11]
28 ఎకరాలలో 10,51,676 చదరపు అడుగులు నిర్మాణ విస్తీర్ణంలో 26 నెలలలో 265 అడుగుల ఈ భవనం ఎత్తున నిర్మించబడింది. ఈ నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణం 2021 జనవరిలో ప్రారంభించబడింది. 12 అంతస్తుల భవనంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలు.. 2 నుంచి 5 అంతస్తుల్లో 16 మంది మంత్రుల కార్యాలయాలు.. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు... 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు.[12] భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు.
2022 జూన్ 10 నాటికి నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు 70 శాతం వరకు (ఏడు అంతస్తుల నిర్మాణం పనులు) పూర్తయ్యాయి. సచివాలయ నిర్మాణ పనుల్లో 2,200 మంది సిబ్బంది పనిచేశారు. సచివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ డోమ్‌లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించారు. ‘ఏ’ టైప్ డోమ్ 23.6 ఫీట్లు, ‘బీ’ తరహా డోమ్‌లు 31 ఫీట్లు, ‘సీ’ టైప్ 21.6 ఫీట్లు, ‘డీ’ తరహా డోమ్‌లు అన్నిటికంటే పెద్దవి 54.8 ఫీట్లు ఉంటాయి. ఈ డోమ్‌ల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఐరన్ ఉపయోగించబడిందని అంచనా.[13]
ఈ సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ఆర్కిటెక్టులు పనిచేశారు. నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్ లోని సారంగాపూర్ లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలీల ఆధారంగానే ఈ భవనపు గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు.[14]
29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటుచేవారు. ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో ఈ మహాద్వారాన్ని తయారుచేయబడింది. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875కి పైగా తలుపులుండగా అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.[14]
617 కోట్ల రూపాయలతో 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మాణం జరిగింది. దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడిన ఈ సచివాలయంలో మంత్రుల షేఫీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారం నిర్మించారు. మొత్తం 28 ఎకరాలున్న ఈ స్థలంలో సచివాలయం కోసం 20 శాతమే స్థలాన్ని మాత్రమే వినియోగించారు.[15]
ఈ సచివాలయంలో ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉంన్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్స్, రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలయాలు, మొదటి, రెండో ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి.[16]
కొత్త సచివాలయంలో 59 మంది ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులకు ప్రత్యేకంగా ఛాంబర్లతోపాటు పేషీలు, 36 మంది అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులకు ఛాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు, 53 ఉప కార్యదర్శులు, 118 మంది సహాయ కార్యదర్శులకు ఛాంబర్లు, 1158 మంది సెక్షన్ అధికారులు, సహాయ అధికారులు పనిచేసేందుకు పెద్ద హాళ్ళను ఏర్పాటుచేశారు.
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్ తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు 'జనహిత' పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.[14]
ఒకప్పుడు మహమ్మదీయ రాజులు తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ (గుమ్మటాలు) నిర్మించినట్టుగా రాష్ట్ర సచివాలయంలో భాగంగా రెండు భారీ డోమ్స్ నిర్మించబడ్డాయి. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించబడింది. ఇలా సచివాలయానికి ముందు, వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఒక్కో డోమ్ 82 అడుగులు ఎత్తు (దాదాపు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసంగా ఉంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా, సచివాలయ భవనం డిజైన్ ప్రకారం తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై ఉన్నాయి. డోమ్‌ల లోపలి భాగాన్ని స్కైలాంజ్ తరహాలో రూపొందించారు. ఇందులోని విశాలమైన కిటికీల నుండి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోమ్‌ల ప్రాంతం వీఐపీ జోన్‌గా ఉంటూ, సీఎం ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేలా రూపొందించబడింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోమ్స్ కూడా తెలుపు రంగులోనే ఉన్నాయి.[17]
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. అయిదడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలను ఢిల్లీలో సిద్ధం చేయించి తీసుకువచ్చి అమర్చారు.[14]
భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచ్చికబయళ్ళకు వాననీటిని వాడే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించబడింది. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైపైన్ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 9 ఎకరాల పచ్చిక బయళ్ళ నిర్వహణకు రిజర్వాయర్ లోని నీటి వినియోగం వినియోగిస్తున్నారు.
పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో (28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యం) సచివాలయంలో ముందు భాగంలో రెడ్‌శాండ్ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు కూడా ఏర్పాటుచేశారు.లో రూపొందించారు.[14]
ప్రాంగణంలో కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు ఏకకాలంలో పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 700-800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1000 మంది వరకు సచివాలయాన్ని సందర్శిస్తారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ సరిపోకపోతే బయటవున్న వంద అడుగుల రోడ్డు చివరలో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లుచేశారు.[18] అలాగే ముఖ్యమంత్రితోపాటు ఇతర వీఐపీ నేరుగా సచివాలయానికి చేరుకొనేలా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సచివాలయంలో ముందు భాగంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు.
పార్కింగ్ కు వీలుగా రోడ్డు విస్తరణలో భాగంగా సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించారు. ఫుట్ పాత్ పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించడంకోసం, సంబంధిత కమిటీ అనుమతి రావడంతో ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్ కేట్) తిరిగి నాటారు.
సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి.[14]
సచివాలయంలో మునుపటి మాదిరిగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు.[14]
2,300 గజాల స్థలంలో గుడి నిర్మాణంలో భాగంగా శివాలయం, పోచమ్మ, హనుమాన్, గణపతి ఆలయాలు నిర్మించారు.[21] దేవాలయానికి సంబంధించి విగ్రహాలను ప్రత్యేకంగా తిరుపతి నుంచి తీసుకొచ్చారు.
పాత భవనాల కూల్చివేతలో భాగంగా తొలగించిన[22] సచివాలయ ప్రాంగణంలోని మసీదుల (700 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు మసీదులు) స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రకటించినట్టుగా 2021, నవంబరు 25న తెలంగాణ రాష్ట్ర హోంశాఖామంత్రి ఎం. మహమూద్ అలీ చేతులమీదుగా సచివాలయ ప్రాంగణంలో రెండు మసీదుల నిర్మాణాల పనులు ప్రారంభించారు. టర్కీలోని మసీదు తరహాలో కొత్త సచివాలయ ప్రాంగణంలోని 1,500 చదరపు గజాల స్థలంలో 2.90 కోట్ల రూపాయలతో చేపట్టిన అన్ని వసతులతో మసీదులను నిర్మించారు.[23]
ప్రారంభం
2023 ఆగస్టు 23 నుంచి 25 వరకు సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరిగాయి. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభంకాగా, పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం నిర్వహించారు. మొదటి రోజు గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.[24] 24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, సాయంత్రం శయ్యాదివాసం, ఫల పుష్పదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలు జరిగాయి. 25న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి.
2023 ఆగస్టు 25న గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలోని ప్రార్థన మందిరాలను ప్రారంభించాడు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించి, నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.[25][26]
తాత్కాలికంగా బీఆర్‌కే భవన్ నుండి పనిచేస్తున్న సచివాలయ శాఖలు 2023 ఏప్రిల్ 26 నుండి 28 వరకు నూతన సచివాలయంలోకి తరలించబడ్డాయి.
తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మొదటగా 2023 ఫిబ్రవరి 17న ముహూర్తం నిర్ణయించగా, హైదరాబాదు నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదాపడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని 2023 ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింహలగ్న ముహుర్తంలో ప్రారంభించాడు. వేదపండితులు ఉదయం 6 గంటలకు యాగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయానికి చేరుకున్న కేసీఆర్, సుదర్శన యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నాడు. 1.20 నుంచి 1.32 మధ్య సచివాలయ భవనాన్ని ప్రారంభించి, సచివాలయంలో ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ఆసీనులైన అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశాడు.[29][30] ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటి గంటల 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల మధ్య మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులయ్యారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులను ఉద్దేశించి ప్రసంగించాడు.
వ్యాపార కార్యకలాపాల నియమాలు ఆధారంగా సెక్రటేరియట్‌లో వివిధ విభాగాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల నుండి రాష్ట్ర పాలనా వ్యవహారాలు, లావాదేవీలు జరుగుతాయి. ప్రతి విభాగానికి అధికారిక ప్రభుత్వ కార్యదర్శి ఉంటాడు.[31]
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ కొత్త సచివాలయం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గోల్డ్ రేటింగ్‌కు ఎంపికైంది. భారతదేశంలో గోల్డ్ రేటింగ్ లభించిన తొలి సచివాలయంగా తెలంగాణ సచివాలయం గుర్తింపు సాధించింది.[33][34] దీనికి సంబంధించిన అవార్డును సెక్రటేరియట్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్‌రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అందించాడు.[35]
2023 మే 18న కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతనతొలి మంత్రివర్గ సమావేశం జరిగింది.[36] మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6:15 గంటల వరకు దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.[37]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite web}}
: CS1 maint: url-status (link)