ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే | |
---|---|
డిఎన్‌డి ఫ్లైవే | |
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ లిమిటెడ్ (NTBCL) | |
పొడవు | 7.5 కి.మీ. (4.7 మై.) |
Existed | 2001 జనవరి 24–present |
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమ చివర | 1. మహారాణి బాగ్, ఢిల్లీ 2. నిజాముద్దీన్, ఢిల్లీ |
తూర్పు చివర | 1. Sector-15A, నోయిడా 2. మయూర్ విహార్, ఢిల్లీ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ |
Major cities | న్యూ ఢిల్లీ, నోయిడా |
రహదారి వ్యవస్థ | |
ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ ఫ్లైవే లేదా డిఎన్‌డి ఫ్లైవే భారతదేశపు మొదటి 8- వరుసల, 7.5 కి.మీ. (4.7 మై.) ఢిల్లీ NCR లో పొడవైన యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్ వే.[1] ఇది పశ్చిమాన మహారాణి బాగ్, నిజాముద్దీన్‌లను నోయిడా (సెక్టార్-15A), యమునా నదికి తూర్పు వైపున ఉన్న మయూర్ విహార్‌లకు కలుపుతుంది. నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ లిమిటెడ్ (NTBCL) IL&FS యాజమాన్యంలో ఉంది, దీనిని బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOOT) ఆధారంగా నిర్వహిస్తోంది. 2001 జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తెరిచిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే జపాన్‌కు చెందిన మిట్సుయ్ - మరుబేని కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది.[2][3] యమునా నదిపై వంతెనతో సహా ప్రధాన క్యారేజ్ వే (MCW) పొడవు 6.0. కి.మీ. మిగిలిన 1.5 కి.మీ. పొడవైన మయూర్ విహార్ లింకును 2008 లో తెరిచారు.[4]
డిఎన్‌డి ఫ్లైవే అనుకున్నదాని కంటే నాలుగు నెలల ముందుగా 2001 జనవరి 24 న అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కపూర్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ల సమక్షంలో ప్రారంభించాడు.[5] ఢిల్లీలోని మహారాణి బాగ్ వద్ద డిఎన్‌డి ఫ్లైవే, ఇన్నర్ రింగ్ రోడ్ల కూడలి, భారతదేశపు అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేకి ప్రారంభ స్థానం. [6]
ఢిల్లీ జనాభాకు యమునా నదికి అవతల ఉన్న ప్రాంతాలతో రవాణా సౌకర్యం ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం నుండి డిఎన్‌డి ఫ్లైవే ఉద్భవించింది. ఢిల్లీ జనాభాలో ఎక్కువ భాగం ట్రాన్స్-యమునా ప్రాంతంలో నివసిస్తున్నారు. యమునా నదికి ఇరువైపులా పెరుగుతున్న ప్రాంతాల మధ్య ఒక ప్రధాన అనుసంధాన సౌకర్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు, నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు పూర్వగామి. దీనిని భారత ప్రభుత్వం, ఉతర ప్రదేశ్ ప్రభుత్వాలు ఆమోదించాయి.
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ప్రస్తుతం MoHUA) నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం, నోయిడా అథారిటీ (UP ప్రభుత్వం), IL&FS ల మధ్య 1992 ఏప్రిల్ 7 న ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆశ్రమ చౌక్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం ఉంది, దీని నిర్వహణను ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)కి అప్పగించారు. [7] యమునా నదిపై 552.5 మీటర్ల పొడవు గల ప్రధాన వంతెన, 3 చిన్న వంతెనలను మొత్తం ₹ 408 కోట్ల (₹4.08 బిలియన్) వ్యయంతో నిర్మించారు. దీని నిర్మాణం 1999 జనవరి 1 న మొదలై, 2001 ఫిబ్రవరి 7 న తెరిచారు. ఒక వైపు ప్రయాణానికి ₹ 8 ఖర్చు అవుతుంది. మయూర్ విహార్‌ను డిఎన్‌డి ఫ్లైవేతో అనుసంధానించడానికి NTBCL 2006లో, 1.5 కి.మీ. పొడవైన లింకు నిర్మాణాన్ని 2008 జనవరి 19 న ట్రాఫిక్ కోసం తెరిచింది.
ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ ఫ్లైవే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) లేన్‌లను కలిగి ఉన్న భారతదేశపు మొదటి రహదారి ప్రాజెక్టు. ఫెడరేషన్ ఆఫ్ నోయిడా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FONRWA) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తీర్పు నిస్తూ అలహాబాద్ హైకోర్టు, డిఎన్‌డి ఫ్లైవేపై ప్రయాణికుల నుండి ఎటువంటి టోల్ వసూలు చేయరాదని 2016 అక్టోబరు 26న ఆదేశించింది.[8] ఆ తర్వాత 2018 జూలై 13 న భారత అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుతానికి ఎలాంటి పన్ను వేయకూడదని పేర్కొంది. [9] అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై ఎన్టీబీసీఎల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
2016 లో సుంకాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రహదారి ఆదాయం, నిధులు ఎండిపోయాయని NTBCL అధికారి చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి హోర్డింగులు, సైన్‌బోర్డ్‌లను విక్రయించడం ద్వారా ప్రకటనల ఆదాయాల ఆధారంగా కంపెనీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది.[10]
నోయిడా, ఢిల్లీల్లో హైవే నుండి నిష్క్రమణలను కింది పట్టికలో చూడవచ్చు.
రాష్ట్రం | వైపు | నిష్క్రమణ స్థానం | గమ్యస్థానాలు |
---|---|---|---|
ఉత్తర ప్రదేశ్ | తూర్పు | సెక్టార్ 15ఎ, నోయిడా | సెక్టార్ 15 & 15ఎ, సెక్టార్ 16 & 16ఎ (నోయిడా ఫిల్మ్ సిటీ సెక్టార్ 17, సెక్టారు 18, సెక్టార్ 37) |
ఢిల్లీ | తూర్పు | మయూర్ విహార్ పొడిగింపు | న్యూ అశోక్ నగర్, పట్పర్గంజ్, వసుంధరా ఎన్క్లేవ్, మయూర్ విహార్ |
ఢిల్లీ | పశ్చిమం. | మహారాణి బాగ్ | ఎయిమ్స్, ఆశ్రమం, లజపత్ నగర్, మహారాణి బాగ్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ |
ఢిల్లీ | పశ్చిమం. | నిజాముద్దీన్ | ఢిల్లీ జంతుప్రదర్శనశాల, నిజాముద్దీన్, ప్రగతి మైదాన్, ఐ. ఎస్. బి. టి. సరాయ్ కాలే ఖాన్ |