తేతకూడి హరిహర వినాయకరం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | మద్రాసు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1942 ఆగస్టు 11
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | సంగీత వాద్య కళాకారుడు |
వాయిద్యాలు | ఘటం, మోర్సింగ్ |
క్రియాశీల కాలం | 1951–ప్రస్తుతం |
తేతకూడి హరిహర వినాయకరం (జననం 1942) గ్రామీ అవార్డు గెలుచుకున్న భారతీయ వాద్యకారుడు. విక్కూ వినాయకరమ్ అని పిలువబడే వినాయకం ఘటవాద్య కళాకారుడు.
ఇతడు 1942, ఆగస్టు 11వ తేదీన మద్రాసు పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి కళైమామణి పురస్కార గ్రహీత టి.ఎస్.హరిహరశర్మ ఒక సంగీతకారుడు, గురువు. ఇతడు అతి పిన్నవయసులోనే ఘటవాద్య కళాకారుడిగా మారాడు.
ఇతని మొట్టమొదటి కళాప్రదర్శన తన 13వ యేట 1957, మార్చి 5వ తేదీన తూతుకూడి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలలో వి.వి.శఠగోపన్ కచేరీలో ఘటవాద్య సహకారం అందించడం ద్వారా జరిగింది. అది మొదలు ఇతడు ఎందరో కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులకు సహకారం అందించాడు. వారిలో చెంబై వైద్యనాథ భాగవతార్, ఎం.కె.త్యాగరాజ భాగవతార్, శీర్కాళి గోవిందరాజన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జి.ఎన్.బాలసుబ్రమణియం, మదురై మణి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మహారాజపురం సంతానం మొదలైన వారున్నారు. ఇతని తమ్ముడు టి.ఎన్.సుభాష్ చంద్రన్ కూడా ఘటవాద్య కళాకారుడిగా పేరుగడించాడు. [1]
1970వ దశకం మొదటిలో ఇతడు జాన్ మెక్‌లాగ్లిన్, జాకిర్ హుసేన్ కళాకారులకు సహకారమందించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. ఇతడు "బసంత్ ఉత్సవ్"లో కూడా తన కళను ప్రదర్శించాడు.
ఇతడు చెన్నైలో తన తండ్రి 1958లో స్థాపించిన "శ్రీ జయ గణేష్ తాళవాద్య విద్యాలయ"కు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఇతడు అనేక మంది శిష్యులకు తర్ఫీదునిచ్చి కొత్త వాద్యకళాకారులను తయారు చేశాడు. ఇతని కుమారడు వి.సెల్వగణేష్ కూడా జాన్ మెక్‌లాగ్లిన్ ట్రూపులో దేశదేశాలు పర్యటించి ఘటవాద్య కళాకారుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.[2]
సంగీతంలో అసమానమైన ప్రతిభ కనబరచినందుకు ఇతనికి 200లో "హఫీజ్ అలీఖాన్ అవార్డు" లభించింది. 1992లో మికీ హార్ట్ నిర్మించిన "ప్లానెట్ డ్రమ్" అనే సంగీత ఆల్బమ్‌కు బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగరీలో గ్రామీ అవార్డు లభించింది. ఈ ఆల్బంలో వినాయకరం ఘటాన్ని, మోర్సింగ్‌నీ వాయించాడు. ఈ అవార్డు ద్వారా ఇతనికి వచ్చిన ధనాన్ని ఒక సేవాసంస్థను దానం చేశాడు. 1996లో ఎల్.శంకర్, జాకిర్ హుసేన్‌లతో కలిసి తయారు చేసిన "రాగ అభేరి" ఆల్బంకు బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగరీలో గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు. భారత ప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. [3]
కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 1988లో సంగీత నాటక అకాడమీ అవార్డును, 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను ప్రకటించింది.[4]2014లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.[5] 2016లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి శతజయంతి అవార్డు ఇతడిని వరించింది.