పృథ్వీసింగ్ ఆజాద్ | |
---|---|
![]() భావనగర్‌లోని పృథ్వీ సింగ్ ఆజాద్ విగ్రహం | |
జననం | లాల్రూ గ్రామం, పటియాలా జిల్లా, పంజాబ్ | 1892 సెప్టెంబరు 15
మరణం | 5 మార్చి 1989 భారతదేశం | (aged 96)
వృత్తి | భారత స్వాతంత్ర్య సమర యోధుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1907–1989 |
వీటికి ప్రసిద్ధి | భారత స్వాతంత్ర్యోద్యమము లాహోర్ కుట్రకేసు |
భాగస్వామి | ప్రభావతి ఆజాద్ దేవి |
పిల్లలు | అజీత్ సింగ్ భాటి |
పురస్కారాలు | పద్మభూషణ్ |
పృథ్వీసింగ్ ఆజాద్ (1892–1989) భారత జాతీయ విప్లవ వీరుడు.[1] గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైల్తో సహా పలుచోట్ల అనేక సార్లు ఖైదు చేయబడ్డాడు.భారత ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటంలో ఇతని సేవకు గుర్తింపుగా 1977లో పద్మభూషణ్ పురస్కారంతో ఇతడిని సత్కరించింది.[2]
ఇతడు 1892 సెప్టెంబరు 15న పంజాబ్ రాష్ట్రం, మొహాలీ జిల్లాలోని లాల్రు అనే ఒక కుగ్రామంలో జన్మించాడు. ఇతడు రాజపుత్ర వంశంలో జన్మించినా దళితుల ఉన్నతి కోసం చాలా కృషి చేశాడు. ఇతడు పిన్న వయసులోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1907-08లో బ్రిటీష్ ప్రభుత్వం లోకమాన్య తిలక్, ఖుదీరాం బోస్‌లను అరెస్టు చేయడం ఇతడిపై ప్రభావాన్ని చూపింది. ఇతడు 1912లో అమెరికా సందర్శించాడు. అక్కడ ఇతడు లాలా హర్ దయాళ్ను కలిసాడు. తరువాతి కాలంలో లాలా హర్ దయాళ్ భారతీయుల విముక్తి కోసం ఉత్తర అమెరికాలో గదర్ పార్టీ అనే మిలిటెంట్ సంస్థను ప్రారంభించాడు. పృథ్వీ సింగ్ ఆజాద్ ఆ పార్టీ వాణి ఐన హిందుస్తాన్ గదర్ అనే పత్రిక స్థాపనలో సహకరించాడు. ఇతడు 150 మంది సమరయోధులతో కలిసి తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇతడిని 1914, డిసెంబర్ 7వ తేదీన పట్టి బంధించి 10 సంవత్సరాల కారాగరశిక్ష విధించి కలకత్తా, మద్రాసు, బళ్ళారి, సెల్యులార్ జైల్ వంటి అనేక చోట్ల నిర్భంధించింది.[3] ఇతడిని ఒక జైలు నుండి మరో జైలుకు తరలిస్తున్నప్పుడు కదిలే రైలు నుండి దూకి తప్పించుకుని పారిపోయాడు. తరువాత ఇతడు విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ అనుయాయిగా మారాడు. అతడినుండి ఒక మౌసర్ తుపాకిని పొందాడు. ఒక కథనం ప్రకారం 1931, ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ అజాద్‌ను ఆల్ఫ్రెడ్ పార్కులో బ్రిటీష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు ఇతడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ అజాద్ ఇతడిని తప్పించుకుని పారిపొమ్మని చెప్పి బ్రిటీషు వారితో పోరాడటం కొనసాగించాడు.[4] మరో కథనం ప్రకారం పై సంఘటనకు కొద్ది రోజుల ముందే ఇద్దరు అజాద్‌లూ ఆల్ప్రెడ్ పార్కులో కలుసుకున్నారు.[5]
భగత్ సింగ్ కోరిక మేరకు చంద్రశేఖర్ అజాద్ ఇతడిని మరింత శిక్షణ కోసం రష్యా వెళ్ళమని సలహా ఇచ్చాడు.[5] ఇతడు రష్యా వెళ్ళి అక్కడ కొన్ని నెలలు ఉన్నాడు. ఇతడు రష్యాలో తన అనుభవాలను వివరిస్తూ "లెనిన్ కే దేశ్‌మే" అనే పుస్తకాన్ని రచించాడు. దీన్ని విజయ్ చౌహాన్ "పృథ్వీ సింగ్ ఆజాద్ ఇన్ లెనిన్స్ ల్యాండ్" అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించాడు.[6] ఇతడు భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనేక మంది దేశనాయకులను కలుసుకున్నాడు. వారిలో మహాత్మా గాంధీ కూడా ఉన్నాడు. గాంధీ పిలుపు ఇచ్చిన జాతీయోద్యమంలో ఇతడు పాలుపంచుకున్నాడు. 1933 నుండి 1947 వరకు ఇతడు పలు పర్యాయాలు అరెస్ట్ అయ్యాడు. లాహోర్ కుట్రకేసులో ఇతనికి మరణశిక్ష విధించబడింది. తరువాత ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి సెల్యులార్ జైలుకు తరలించారు.[7] భారత స్వాతంత్ర్యం తరువాత ఇతడు భారత రాజ్యాంగ పరిషత్తుకు సభ్యుడిగా పంజాబ్ తరఫున ఎన్నికైనాడు.[8] 1949లో భీంసేన్ సచార్ మంత్రివర్గంలో పంజాబ్ రాష్ట్రపు కార్మిక, స్థానిక స్వపరిపాలన శాఖల మంత్రిగా ఎన్నికైనాడు.[9] భారత ప్రభుత్వం ఇతడిని 1977లో మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.[2]
ఇతడు 1989, మార్చి 5వ తేదీన తన 96వ యేట మరణించాడు. ఇతనిపై రెండు జీవితచరిత్రలు వెలువడ్డాయి. 1987లో భారతీయ విద్యాభవన్ "బాబా పృథ్వీసింగ్ ఆజాద్, ది లెజండరీ క్రూసేడర్" అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించింది.[10] 1990లో హర్యానా సాహిత్య అకాడమీ "క్రాంతిపథ్ కా పథిక్" పేరుతో మరొక గ్రంథాన్ని వెలువడింది.[11] న్యూఢిల్లీలోని "నెహ్రూ స్మారక మ్యూజియమ్&లైబ్రరీ"లో ఇతని జీవితానికి సంబంధించిన కొన్ని పత్రాలు "బాబా పృథ్వీసింగ్ ఆజాద్ పేపర్స్" పేరుతో భద్రపరచ బడినాయి.[12][13] ఇతని స్వగ్రామమైన లాల్రూలో ఇతని పేరుమీద "బాబా పృథ్వీ సింగ్ ఆజాద్ మెమోరియల్ హాస్పిటల్" ఏర్పాటు చేశారు.[14] ఇతని కుమార్తె "ప్రజ్ఞా కుమార్" పంజాబ్ విశ్వవిద్యాలయంలో ముఖ్య వైద్యాధికారిణిగా పనిచేస్తూ ఉంది.[15]