పెండేకంటి వెంకటసుబ్బయ్య | |
---|---|
![]() | |
జననం | |
మరణం | 1993 అక్టోబరు 12 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయ నాయకుడు |
జీవిత భాగస్వామి | కనకమ్మ |
పెండేకంటి వెంకటసుబ్బయ్య (జ: జూన్ 18, 1921 - అక్టోబర్ 12, 1993), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. వీరు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి లోక్‌సభకు నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. వెంకటసుబ్బయ్య 1980 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వములో గృహ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా పనిచేశాడు. ఈయన బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.[1]
వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లా, బనగానపల్లె సంస్థానంలోని సంజామల గ్రామంలోని ఒక సంపన్న రైతు కుటుంబంలో, 1921 జూన్ 18న జన్మించాడు. నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమ కార్యక్రమాల్లో జైలు శిక్షను లెక్కచేయకుండా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఈయన కనకమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[2]
వెంకటసుబ్బయ్య మదనపల్లె బీటీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. వెంకటసుబ్బయ్యతో పాటు సహ విద్యార్థులైన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, సి.దాస్, నూతి రాధా కృష్ణయ్య తదితర 40మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
బనగానపల్లె సంస్థానంలో కాంగ్రేసును స్థాపించి, స్వాతంత్ర్యం తర్వాత 1948లో బనగానపల్లె సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాడు. 1948లో మద్రాసు శాసనసభ సభ్యుడయ్యాడు.[2] ఆ తరువాతి కాలంలో నంద్యాల లోక్‌సభ సభ్యునిగా 27 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు.
గాంధేయవాది అయిన వెంకటసుబ్బయ్య వాసవీ విద్యాసంస్థలను స్థాపించి, వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, [3] పెండేకంటి న్యాయ కళాశాల, పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, [4] వాసవీ సంగీత, నాట్య కళాశాల[5] మొదలైన అనేక విద్యాసంస్థల స్థాపనకు దోహదపడ్డాడు.