భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ లేదా భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) భారతదేశంలో మహారాష్ట్ర లోని పూణే నగరంలో ఉంది.[1] ఇది 6 జూలై, 1917న స్థాపించబడింది. ఈ సంస్థ డా. రామకృష్ణ గోపాల్ భండార్కర్ (1837-1925) జీవితం, కృతులను గౌరవిస్తూ స్థాపించబడింది. ఈయన భారతీయత గురించి భారతదేశంలో మొట్టమొదటి సారి పరిశోధన మొదలుపెట్టారు. భారతీయతను ఒక శాస్త్రంగా గుర్తించిందీయనే. ఈ సంస్థ ఎన్నో పురాతన సంస్కృత, ప్రాకృత తాళపత్రాలకు నెలవు.
ఈ సంస్థను 1860 లో ప్రజా ప్రయోజనార్థం యాక్టు XXI కింద నమోదు చేశారు. మొదట్లో బాంబే ప్రభుత్వం ఈ సంస్థకు సాలీనా 3000 రూపాయలు విడుదల చేసేది. ప్రస్తుతం ఈ సంస్థకు మహరాష్ట్ర ప్రభుత్వం నుంచి పాక్షిక సహాయం లభిస్తున్నది. అంతే కాకుండా ఇది ఏదైనా ప్రత్యేకమైన ప్రాజెక్టు చేపడితే అందుకు గాను భారత ప్రభుత్వం నుంచి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ నుంచి కూడా నిధులు వస్తున్నాయి. దక్షిణాసియాలోనే అత్యంత అరుదైన పుస్తకాలు, రాతపత్రులను భద్రపరిచిన అతి పెద్ద సంస్థలలో ఇది ఒకటి. సుమారు 1,25,000 కి పైగా అరుదైన పుస్తకాలు, 29,510కి పైగా పురాతన రాత ప్రతులు ఈ సంస్థలో భద్రపరచబడి ఉన్నాయి.
1932 లో, ఈ సంస్థ మహా భారతము ప్రచురణకు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం డబ్బు అవసరమై హైదరాబాద్ యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను అభ్యర్థించింది.[2] నిజాం 11 ఏళ్ల కాలంలో సంవత్సరానికి రూ .1,000 మంజూరు చేయాలని ఫారం జారీ చేసింది. అయితే, రూ. 50,000 మంది గెస్ట్ హౌస్ కోసం అందించారు. అది ఇప్పుడు "నిజాం గెస్ట్ హౌస్" గా పిలువబడుతుంది.[3]
1866 లో బాంబే ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాతప్రతులకు సేకరించే పని ప్రారంభించింది. ప్రముఖ పండితులైన జార్జి బూలర్ (Georg Bühler), ఎఫ్. కీల్హార్న్ (F. Kielhorn), పీటర్ పీటర్సన్ (Peter Peterson), రామకృష్ణ గోపాల్ భండార్కర్, ఎస్. ఆర్. భండార్కర్, కథావటే, ఘటే మొదలైన వారు 17000 కి పైగా అతి ముఖ్యమైన రాత ప్రతులు సేకరించారు. ఇవన్నీ మొదట్లో బాంబేలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాల ప్రాంగణంలో భద్రపరిచారు. తర్వాత వీటిని మెరుగైన సంరక్షణ కోసం పుణే లోని దక్కన్ కళాశాలకు తరలించారు. 1917లో ఈ సంస్థ ఏర్పడ్డ తర్వాత దీని వ్యవస్థాపకులు ఆ ప్రతులకు మరింత జాగ్రత్తగా చూసుకుంటామనీ, వాటి మీద పరిశోధనలు కూడా చేపడతామని అభ్యర్థించారు. అప్పటి బాంబే ప్రెసిడెన్సీ గవర్నరు, ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు అయిన లార్డ్ విల్లింగ్టన్ ఈ ప్రతులను ఏప్రిల్ 1, 1918 న BORI కి తరలించారు. BORI మొదటి సంరక్షుకుడైన పరశురాం కృష్ణ గోడే మరి కొన్ని పత్రాలను సేకరించడంలో తోడ్పడ్డాడు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం వారు సేకరించిన 17,877, ఇతరులు సేకరించిన 11,633 కలిపి 29000 కి పైగా ప్రతులున్నాయి. సా. శ 1320 సంవత్సరానికి చెందిన చికిత్సాసారసంగ్రహ, సా. శ 906 సంవత్సరానికి చెందిన ఉపమితిభావప్రపంచకథ వీటిలో అతి పురాతనమైన ప్రతులు. ప్రముఖ సంస్కృత పండితుడు, భారతరత్న గ్రహీత అయిన పాండురంగ వామన్ కాణే తన పరిశోధనల కోసం ఈ వనరులను విస్తృతంగా ఉపయోగించుకున్నాడు.
ఏప్రిల్ 1, 1919 న BORI ఆధ్వర్యంలో విమర్శనాత్మక మహాభారతం రాయడానికి ఓ దీర్ఘకాలిక ప్రణాళిక ప్రారంభించారు. విష్ణు సీతారాం సూక్తంకర్ అనే పండితుడిని ఆగస్టు 1, 1925 న ఈ ప్రాజెక్టుకు ప్రధాన సంపాదకుడిగా నియమించారు. జనవరి 21, 1943 ఈయన మరణించేదాకా సంపాదకుడిగా కొనసాగాడు. ఏప్రిల్ 1, 1943 న ఎస్. కె. బెల్వాల్కర్ ఈ ప్రధాన సంపాదకుడి బాధ్యతలు చేపట్టాడు. జులై 6, 1957న ఆర్. ఎన్. దండేకర్ ను ఉపసంపాదకుడిగా నియమించారు. బెల్వాల్కర్ పదవీ విరమణ చేసిన తర్వాత ఏప్రిల్ 1, 1961 న పి. ఎల్. వైద్య సంపాదకుడిగా నియమింపబడ్డాడు. 1966, సెప్టెంబరు 22 న అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్థలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ఈ గ్రంథాన్ని విడుదల చేశారు.
ఈ గ్రంథం కోసం 1259 ప్రతుల నుంచి సమాచారం సేకరించారు.[4] 18 పర్వాలు, 89000 కి పైగా శ్లోకాలు కలిగిన మహాభారతాన్ని విమర్శనాత్మకంగా రచించిన ఈ ఉద్గ్రంథం 19 సంపుటాలుగా వెలువడింది.
జనవరి 5, 2004 లో శంభాజీ బ్రిగేడ్ అనే పేరుతో కొంతమంది మరాఠా యువకులు ఒక సేనగా ఏర్పడి జేమ్స్ లెయిన్ అనే పాశ్చాత్య పరిశోధకుడికి శివాజీ జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు పరిశోధించడంలో ఈ సంస్థలోని కొంతమంది సహాయం చేశారనీ అందుకు తాము ఆగ్రహంతో ఉన్నామనీ తెలియజేశారు.[5] అంతే కాకుండా ఈ గుంపు వేలకొద్దీ ప్రతులను చిందరవందర చేయడమే కాక లెయిన్ కు సంస్కృతం శ్లోకాలను అనువదించి ఇచ్చినందుకుగాను ఆయన ముఖానికి నల్లరంగు పులిమి అవమానించారు.[6] ఈ సంఘటనను పలువురు విద్యావేత్తలు ఖండించారు.[7] శివాజీ జీవితంపై విస్తృత పరిశోధనలు చేస్తున్న గజానన్ మెహండలే అనే చరిత్ర కారుడు తాను అప్పటి దాకా పరిశోధించి ఇంకా ప్రచురణ కాని 400 పత్రాలను ధ్వంసం చేసి తన నిరసన తెలియజేశాడు.[8][9] శివసేన నాయకుడు రాజ్ థాక్రే పుణేకు వెళ్ళి శ్రీకాంత్ బహుల్కర్ కు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దు మణిగింది. మెహెండలే కూడా శివజీ జీవిత చరిత్రపై పరిశోధన పునరుద్ధరించడానికి అంగీకరించాడు.[10]