భారత జాతీయ భద్రతా మండలి | |
---|---|
వివరాలు | |
స్థాపన | 19 నవంబరు 1998 |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్, సర్దార్ పటేల్ భవన్, సన్సద్ మార్గ్, న్యూ ఢిల్లీ - 110001[1] |
Child | జాతీయ భద్రత న్యాయ విభాగం |
భారతదేశ జాతీయ భద్రతా మండలి (NSC) జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ప్రధాన మంత్రి కార్యాలయానికి సలహా ఇచ్చే కార్యనిర్వాహక ప్రభుత్వ సంస్థ. దీనిని భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 1998 నవంబరు 19 న స్థాపించాడు. మొదటి జాతీయ భద్రతా సలహాదారుగా బ్రజేష్ మిశ్రాను నియమించాడు.
జాతీయ భద్రతా మండలిలో జాతీయ భద్రతా సలహాదారు (NSA), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), అదనపు జాతీయ భద్రతా సలహాదారు, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, హోం, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు.
2024 జూలై 1 న జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ పునరుద్ధరణ కింద అప్పటి వరకు ఖాళీగా ఉన్న అదనపు జాతీయ భద్రతా సలహాదారు పదవిని భర్తీ చేశారు. అంతర్గత భద్రతా నిర్వహణ, ముప్పు లకు సంబంధించిన విధులను అదనపు ఎన్ఎస్ఎ చూసుకుంటారు. ఈ చర్యతో, ఎన్ఎస్ఎకు ఆ పనుల భారం తగ్గి, ఇతర భద్రతా సవాళ్లలో ప్రధానమంత్రి కార్యాలయానికి నేరుగా సహాయం చేయడానికి మరింత వీలౌతుంది.[2]
NSC అనేది భారతదేశ జాతీయ భద్రతా నిర్వహణ వ్యవస్థ లోని మూడు-అంచెల నిర్మాణంలో శీర్షాన ఉండే సంస్థ. ఇది వ్యూహాత్మక ప్రణాళిక, అంతర్గత వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, మిలిటరీ అనే నాలుగు విభాగాలతో కూడిన జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ద్వారా దాని అధికారాన్ని అమలు చేస్తుంది. జాతీయ భద్రతా మండలి లోని మూడు అంచెలు వ్యూహాత్మక విధాన సమూహం, జాతీయ భద్రతా సలహా బోర్డు, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ నుండి ఒక సెక్రటేరియట్.[3][4]
జాతీయ భద్రతా మండలి లోని మూడు అంచెల నిర్మాణంలో వ్యూహాత్మక విధాన సమూహం మొదటి స్థాయిలో ఉంటుంది. NSC లో ఇది, నిర్ణయాత్మక కేంద్రకం. 2024 జూలై నాటికి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. అందులో క్రింది సభ్యులు ఉంటారు. (బ్రాకెట్లో, 2024 జూలై నాటికి ఈ పదవిలో ఉన్న అధికారి):
వ్యూహాత్మక విధాన సమూహం, వ్యూహాత్మక రక్షణను సమీక్ష చేస్తుంది. ఇది స్వల్ప, దీర్ఘకాలిక భద్రతా ముప్పులకు సంబంధించిన ఒక బ్లూప్రింటు. అలాగే, ప్రాధాన్యతా ప్రాతిపదికన సాధ్యమయ్యే విధాన ఎంపికలు.
మొదటి జాతీయ భద్రతా సలహాదారు (NSA) బ్రజేష్ మిశ్రా, ఇండియన్ ఫారిన్ సర్వీసులో పనిచేసి రిటైరైన వ్యక్తి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో (NSAB) ప్రభుత్వం బయట ఉన్న ప్రముఖ జాతీయ భద్రతా నిపుణులతో కూడుకుని ఉంటుంది.[5] ఈ సభ్యుల్లో సాధారణంగా విశ్రాంత సీనియర్ అధికారులు, పౌర, సైనిక, విద్యావేత్తలు, అంతర్గత, బాహ్య భద్రత, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సైన్స్ & టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యం కలిగిన పౌర సమాజంలోని విశిష్ట సభ్యులు ఉంటారు.
దివంగత కె. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో 1988 డిసెంబరులో ఏర్పాటైన మొదటి NSAB 2001 లో దేశం కోసం ఒక డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రిన్‌ను, 2002లో వ్యూహాత్మక రక్షణ సమీక్షను, 2007 లో జాతీయ భద్రతా సమీక్షనూ రూపొందించింది [6]
బోర్డు కనీసం నెలకు ఒకసారి, అవసరమైనప్పుడు మరింత తరచుగానూ సమావేశమవుతుంది. ఇది NSC కి దీర్ఘకాలిక రోగనిర్ధారణ, విశ్లేషణను అందిస్తూ, పరిష్కారాలను సూచిస్తుంది. తన దృష్టికి తీసుకు వచ్చిన విధాన సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రారంభంలో ఒక సంవత్సరానికి ఈ బోర్డు ఏర్పాటైంది. కానీ 2004-06 నుండి, బోర్డును రెండేళ్లకోసారి పునర్నిర్మిస్తున్నారు.[7]
మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ నేతృత్వంలోని మునుపటి NSAB పదవీకాలం 2015 జనవరిలో ముగిసింది. ఇందులో 14 మంది సభ్యులు ఉన్నారు.
రష్యాలో మాజీ భారత రాయబారి (2014–16) PS రాఘవన్ అధిపతిగా కొత్త బోర్డు 2018 జూలైలో తిరిగి ఏర్పాటైంది. ప్రస్తుతం NSAB కింద రెండు అధీన సంస్థలు పనిచేస్తున్నాయి :- (i) నేషనల్ ఇన్ఫర్మేషన్ బోర్డు (NIB), (ii) టెక్నాలజీ కోఆర్డినేషన్ గ్రూప్ (TCG). దీని పదవీకాలం రెండేళ్లు.[6]
2024 జూలై నాటికి, బోర్డులో కింది సభ్యులున్నారు:[8][9][10]
సభ్యులు | అనుభవం |
---|---|
అజిత్ దోవల్ | జాతీయ భద్రతా సలహాదారు |
బిమల్ ఎన్ పటేల్ | వైస్-ఛాన్సలర్, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం |
కె. రాధాకృష్ణన్ | ఇస్రో మాజీ ఛైర్మన్ |
అంషుమాన్ త్రిపాఠి | అసోసియేట్ ప్రొఫెసర్, IIM బెంగళూరు |
అరుణ్ కె సింగ్ | ఫ్రాన్స్, అమెరికాల్లో మాజీ రాయబారి. |
తిలక్ దేవాషెర్ | పాకిస్తాన్ స్పెషలిస్టు, మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి |
ప్రొ. వి.కామకోటి | డైరెక్టర్, ఐఐటీ మద్రాస్ |
కుల్బీర్ కృష్ణన్ | మాజీ డీజీపీ, మేఘాలయ |
అలోక్ జోషి | మాజీ చైర్మన్, NTRO |
లెఫ్టినెంట్ జనరల్. యోగేష్ కుమార్ జోషి (రిటైర్డ్) | డైరెక్టర్ జనరల్, సెంటర్ ఫర్ కాంటెంపరరీ చైనా స్టడీస్, MEA |
శ్రీధర్ వెంబు | వ్యవస్థాపకుడు, CEO, జోహో కార్పొరేషన్ |
భారత ప్రభుత్వ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ (JIC) - ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ, నావల్, ఎయిర్ ఇంటెలిజెన్స్ నుండి అందే ఇంటెలిజెన్స్ డేటాను విశ్లేషిస్తుంది. తద్వారా దేశీయ, విదేశీ ఇంటెలిజెన్స్ రెండింటినీ విశ్లేషిస్తుంది. JIC కి కేబినెట్ సెక్రటేరియట్ క్రింద పనిచేసే, స్వంత సెక్రటేరియట్ ఉంది.
నేషనల్ సైబరు సెక్యూరిటీ వ్యూహాన్ని, ఎన్ఎస్సి సెక్రటేరియట్‌లోని నేషనల్ సైబరు సెక్యూరిటీ కోఆర్డినేటర్ కార్యాలయం రూపొందించింది. ఎన్ఎస్సి సెక్రటేరియట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ బోర్డులు భారత సైబరు సెక్యూరిటీ విధానాన్ని రూపొందించడంలో సహాయపడుతున్నాయి. దాడి, నష్టం, దుర్వినియోగం, ఆర్థిక గూఢచర్యాల నుండి క్లిష్టమైన సమాచార మౌలిక సదుపాయాలతో సహా యావత్తు సైబరు స్థలాన్ని రక్షించడం దీని లక్ష్యం.
2014లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ కేంద్రం, సమాచార మౌలిక సదుపాయాల రక్షణను తప్పనిసరి చేసింది. నేషనల్ సైబరు సెక్యూరిటీ కోఆర్డినేటర్ కార్యాలయాన్ని, వ్యూహాత్మక సైబరు సెక్యూరిటీ సమస్యలపై ప్రధానమంత్రికి సలహా ఇచ్చేందుకు 2015 లో సృష్టించారు.
2021 జూన్ 15 న, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ సెక్టార్ (NSDTS)పై నేషనల్ సెక్యూరిటీ ఆదేశం అమలులోకి వస్తున్నట్లు సంకేతాలిస్తూ విశ్వసనీయ టెలికాం పోర్టల్‌ను ప్రారంభించింది. పర్యవసానంగా, 2021 జూన్ 15 నుండి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPలు) తప్పనిసరిగా తమ నెట్‌వర్క్‌లలో విశ్వసనీయ మూలాల నుండి విశ్వసనీయ ఉత్పత్తులుగా పేర్కొనబడిన కొత్త పరికరాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది.[11][12]