మైసూరు వాసుదేవాచార్య | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | కర్ణాటక, భారత దేశం | 1865 మే 28
మరణం | 1961 మే 17 | (వయసు 95)
సంగీత శైలి | కర్ణాటక సంగీతము |
వృత్తి | వాగ్గేయకారుడు |
వాయిద్యాలు | గానం |
మైసూరు వాసుదేవాచార్య భారతీయ సంగీతకారుడు, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, త్యాగరాజ శిష్య పరంపరలో నేరుగా ఉన్నవాడు. వాసుదేవాచార్య కృతులు దాదాపు 200 వరకూ ఉన్నాయి, ఇవి ఎక్కువగా తెలుగులో, సంస్కృతంలో ఉన్నాయి. బ్రోచేవారెవరురా, దేవాది దేవ శ్రీ వాసుదేవ, మామవతు శ్రీ సరస్వతి, భజరే రే మనసా, రారా రాజీవలోచన రామ ఇతను రచించిన కృతులలో బాగా ఎక్కువగా వినిపించేవి.[1] ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం బహూకరించింది. [2] ఇతని పేరున కన్నడంలో రెండు రచనలు లభ్యమవుతున్నాయి. ఒకటి ఇతని ఆత్మకథ, పేరు నెనపుగళు(జ్ఞాపకాలు), రెండవది నా కండ కళావిదరు(నేను చూసిన కళాకారులు). రెండవ పుస్తకం ఆయా వ్యక్తుల ఆత్మకథల సంకలనం. ఇతను రుక్మిణి దేవి అరుండాలె నిర్వహించే కళాక్షేత్ర లో సంగీత బోధన చేసాడు. కళాక్షేత్రలో ముఖ్య సంగీతజ్నుడిగా వ్యవహరిస్తూ, రామయణాన్ని సంగీతంలో మలిచాడు. 1961లో 96 ఏళ్ళ వయస్సులో మరణించాడు.
వాసుదేవాచార్య సంప్రదాయ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో మైసూరులో జన్మించాడు. వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం నేర్చుకున్నాడు. మైసూరు మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత భాష, అందులోని కావ్య, వ్యాకరణ, నాటక, అలంకార, తర్క, ఇతిహాస, పురాణాది భాగాలను అభ్యసించి, నిష్ణాతుడయ్యాడు. ప్రైవేటుగా సంగీతం నేర్చుకున్నాడు. [3] ఆపై ఇతను ప్రముఖ వాగ్గేయకారుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గర మైసూరు మహారాజు ఇచ్చిన ధనసహాయంతో సంగీతం నేర్చుకున్నాడు. తరువాతి కాలంలో తంజావూరు-కావేరి ప్రాంత సంగీతజ్నులకు సరిపోలే సంగీతాన్ని గ్రహించి మైసూరు రాజు ఆస్థానంలో ఆస్థాన విద్వాన్ గా వ్యవహరించాడు. ఇతను తన గురువు వద్ద నేర్చుకున్న మధ్యమకాల తాళంలో పాడతాడని తెలుస్తోంది. కర్ణాటక సంగీతంలోని ముఖ్యమైన భాగాలైన ఆలాపన, తానం, పల్లవి, నిరావళ, కల్పన స్వరం అంశాల్లో నిష్ణాతుడు అని తెలుస్తోంది. [4]
ఇతని కృతులలో చాలా వరకు వాసుదేవ కీర్తన మంజరి అనే పుస్తకంలో ఇతను ప్రచురించుకున్నాడు. ఇతనికి భాష మీద ఉన్న పట్టును ఈ కీర్తనలు తెలుపుతాయి. తెలుగులో భాషా నైపుణ్యాన్ని ఇతను త్యాగరాజ భిక్షగా చెప్పుకుంటాడు. ఇతని కీర్తనల్లో పరమపురుష వాసుదేవ, వాసుదేవ పదాలు మకుటంగా కనిపిస్తాయి.[5] ఇతని కీర్తనలు చాలా వరకు రాముడిని కీర్తిస్తూ ఉంటాయి. కీర్తనలు, కృతులతో పాటుగా ఇతను పలు వర్ణాలను, తిల్లానాలను, జావళీలను, శ్లోకాలను రచించాడు. సంగీతత్రయంలోని త్యాగరాజును, ముద్దుస్వామి దీక్షితయ్యను, శ్యామశాస్త్రిని కీర్తిస్తూ వాసుదేవాచార్య కొన్ని కీర్తనలు రాసాడు. [6]