రజత్ కుమార్ గుప్తా (జ. 1948 డిసెంబరు 2) ఒక భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త. మెకన్సీ అండ్ కంపెనీకి 1994 నుంచి 2003 వరకు మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నాడు. ఆ పదవి చేపట్టిన మొట్ట మొదటి విదేశీయుడు ఈయనే. 2012 లో ఈయన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయన గోల్డ్మన్ శాక్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, అమెరికన్ ఎయిర్ లైన్స్ లాంటి సంస్థల బోర్డులో సభ్యుడు. బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ది గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, టిబి అండ్ మలేరియా లాంటి దాతృత్వ సంస్థలకు సలహాదారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్, న్యూ సిల్క్ రూట్, స్కాండెంట్ సొల్యూషన్స్ సంస్థలకు సహ వ్యవస్థాపకుడు.
రజత్ గుప్తా 1948 డిసెంబరు 2 న కలకత్తాలో జన్మించాడు. ఆయన తండ్రి అశ్విని గుప్తా బెంగాలీ, తల్లి ప్రాణ్ కుమారి పంజాబీ.[1] అశ్విని గుప్తా ఆనంద పబ్లిషర్స్ లో విలేఖరిగా పనిచేసేవాడు. అంతకు మునుపు కలకత్తాలోని రిప్పన్ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేసాడు. గుప్తా ఐదేళ్ళ వయసులో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది. అక్కడ ఈయన తండ్రి హిందుస్థాన్ స్టాండర్డ్ అనే పత్రికా విభాగం ప్రారంభించాడు. గుప్తాకు 16 ఏళ్ళ వయసులో తండ్రి మరణించాడు. రెండేళ్ళకు తల్లి కూడా మరణించింది. దాంతో గుప్తా, అతని సహోదరులు అనాథలు అయ్యారు.
గుప్తా అప్పటికి ఢిల్లీలో మోడర్న్ స్కూల్ విద్యార్థి. హైస్కూలు తర్వాత గుప్తాకు ఐఐటీ ప్రవేశ పరీక్షలో దేశంలో 15వ ర్యాంకు వచ్చింది. 1971 లో ఐఐటీ ఢిల్లీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఇ పట్టా పొందాడు. ఐఐటీ ఢిల్లీ ఆయనకు ఆర్థిక శాస్త్రం బోధించిన ఆచార్యుడు సుబ్రమణియన్ స్వామి. హార్వర్డ్ లో ఎం.బి.ఎ చేయడానికి గుప్తాకు సిఫారసు లేఖ రాసింది ఆయనే.[2][3] ఇందుకోసం అప్పటికే ప్రతిష్ఠాత్మక దేశీ సంస్థ అయిన ఐటీసీలో ఉద్యోగం కూడా వదులుకున్నాడు. 1973 లో హార్వర్డ్ లో ఎం.బి.ఎ సంపాదించాడు. డిస్టింక్షన్ స్కాలర్ గా బేకర్ స్కూల్ నుంచి ఉత్తీర్ణుడయ్యాడు.[4]
గుప్తా 1973 లో మెకన్సీ అండ్ కంపెనీ అనే సంస్థలో చేరాడు. ఆ సంస్థలో చేరిన మొట్ట మొదటి భారతీయ అమెరికన్లలో ఆయనా ఒకడు. మొదట్లో ఆయనకు అనుభవం లేదని ఉద్యోగంలో చేర్చుకోలేదు. తర్వాత హార్వర్డ్ ప్రొఫెసర్ వాల్టర్ జె. సాల్మన్ ఆ సంస్థ న్యూయార్కు విభాగానికి అధిపతి యైన రాన్ డేనియల్ కు సిఫారసు చేయడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు.[5]