వరకట్నం (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
నిర్మాణం | ఎన్. త్రివిక్రమరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, సావిత్రి, నాగభూషణం, రాజనాల, పి.హేమలత |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ & ఎన్.ఎ.టి కంబైన్స్ |
భాష | తెలుగు |
ఇది 1969, జనవరి 10వ తేదీన విడుదలైన తెలుగు చిత్రం. ఎన్.టి.ఆర్ సొంత బానర్ పై తీయబడింది. దురాచారమైన వరకట్నం ప్రధాన విషయంగా సాగుతుంది. పల్లెటూరి మొండిపట్టుదలలు, అక్కడి మనుషుల మధ్య అనుబంధాలు, పట్టింపులు చిత్రితమయ్యాయి. ఎన్.టి.ఆర్ ఆహార్యం, పంచకట్టు అప్పటికి అధునాతనం. విలన్ గా నటించిన రాజనాల పై చక్కటి పాట 'సైసై జోడెడ్ల బండి' చిత్రీకరించడం విశేషం. చిత్రంలో కళ ద్వారా కృష్ణాజిల్లా పరిసరప్రాంతాల సంప్రదాయాలు, ఇంటి అలంకరణ తదితర విషయాలు చూపబడ్డాయి.
ఇది రెండు గ్రామాలకు చెందిన కథ. మీసాల సుబ్బయ్య ఓ గ్రామానికి మోతుబరి రైతు (నాగభూషణం). కొడుకు దేవసింహ (ఎన్‌టి రామారావు), భార్య కాంతమ్మ (హేమలత). పక్క గ్రామానికి చెందిన మరో మోతుబరి భద్రయ్య (మిక్కిలినేని). అతని కొడుకు బలరామయ్య (సత్యనారాయణ), కోడలు సుభద్ర (సావిత్రి), కుమార్తె సుజాత (కృష్ణకుమారి). సుబ్బయ్య కుమారునికి భద్రయ్య కుమార్తెకు వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లిలో సుబ్బయ్య గ్రామానికి చెందిన పేచీకోరు అచ్చయ్య (అల్లు రామలింగయ్య) తెచ్చిన మాట పట్టింపుతో దేవసింహ సుజాతకు తాళి కట్టకుండా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే గ్రామంలో శ్రీరాములు (పెరుమాళ్లు) సాధారణ రైతు. అతని కూతురు లక్ష్మి (చంద్రకళ). చుక్కమ్మ- రంగయ్య (రేలంగి)ల కుమారుడు దేవయ్య (పద్మనాభం). దేవయ్య -లక్ష్మి పెళ్లిలోనూ కట్నం కారణంగా గొడవలు తలెత్తుతాయి. అయినా లక్ష్మికి దేవయ్య తాళికట్టడంలో, అత్తింటివారు ఆమెను తమతో తీసుకెళ్తారు. కట్నం పేచీ నేపథ్యంలో కొడుకు దేవయ్యను లక్ష్మి కలవకుండా చుక్కమ్మ వేధింపులకు గురి చేస్తుంటుంది. కట్నం కోసం ఆమెపైన, ఆమె తండ్రిపైన నిందలు వేయటంతో లక్ష్మి, శ్రీరాములు ఇబ్బందులు పడుతుంటారు. లక్ష్మి అన్న సుబ్బన్న (ప్రభాకర్‌రెడ్డి) వేలుకు దెబ్బ తగలడం వలన చెల్లెలి కోసం ఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి ఆంక్షలు పెట్టినా దేవసింహ మాత్రం సుజాతే తన భార్య అని నిశ్చయించుకుంటాడు. తల్లి దీవెన తీసుకుని, సుజాతను ఆమె వదిన సుభద్ర సాయంతో కలుసుకుంటాడు. ఆమెకు తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. బలరామయ్య తన మిత్రుడు మల్లయ్యదొర (రాజనాల)తో తిరిగి, సుజాతకు పెళ్లిచేయ నిశ్చయించటం, దేవసింహ మల్లయ్యదొర గొడవ పడటం, బలరామయ్య వలన దేవసింహ గాయపడటం, మనసు చెదిరిన సుజాత ఆత్మహత్య ప్రయత్నం చేసి మామగారింటికి చేరటం, వారంతా తిరిగి సుజాత ఇంటికి వచ్చి భద్రయ్య, బలరామయ్యతో కలిసి దేవసింహ, సుజాతలను ఆశీర్వదించటం, దేవయ్య తన తల్లితో నాటకమాడి బుద్ధివచ్చేట్టుచేసి, లక్ష్మిని, తండ్రిని కలపటం, ఈ రెండు జంటలు ఒకచోట ఆనందంగా నిలవటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].