రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | విశాలాంధ్ర విజ్ఞాన సమితి |
ప్రచురణకర్త | విశాలాంధ్ర విజ్ఞాన సమితి |
సంపాదకులు | కే.శ్రీనివాస్ రెడ్డి |
స్థాపించినది | 1952-06-22, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
రాజకీయత మొగ్గు | కమ్యూనిజం |
కేంద్రం | విజయవాడ |
జాలస్థలి | https://visalaandhra.com/ |
విశాలాంధ్ర సహకారం రంగంలో నిర్వహించబడుతున్న తెలుగు దినపత్రిక.[1] ఇది జూన్ 22 తేదీన, 1952 సంవత్సరం విజయవాడలో ప్రారంభమైనది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం వ్యాప్తి చేయటానికి ప్రజాశక్తి దినపత్రికను విశాలాంధ్రగా మార్చాలని 1952 లో రాష్ట్ర కమ్యూనిష్టు పార్టీ తీర్మానం చేసింది. తొలి సంపాదకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు. తెలుగు ప్రజలందరు ఏకమై ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పేరు సూచించిది ఈ పత్రికే.[ఆధారం చూపాలి] 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలకు వ్యతిరేకంగా కీలకపాత్ర పోషించింది.[2]. 2014లో ఏడు కేంద్రాలనుండి ప్రచురించబడుతున్నది. 2012 సంవత్సరంలో వజ్రోత్సవాలు జరిగాయి.
‘విశాలాంధ్ర’ తెలుగునేలపై తొలి దినపత్రికగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఈ పత్రిక ఆరంభానికి చారిత్రక నేపథ్యం స్వదేశీ సంస్థానాల పాలనలో, బ్రిటిషు వారి పాలనలో చెల్లాచెదరైన తెలుగువారందరూ భౌగోళికంగా, పరిపాలనా పరంగా ఒక్కటి కావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్న రోజులవి. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం పిలువునిచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రోద్యమం సంకల్పానికి బలం చేకూర్చటమే ఈ పత్రిక చారిత్రక లక్ష్యం.
తెలుగు గడ్డపై కమ్యూనిస్టు ఉద్యమం 1933లో ప్రారంభమైంది. తెలుగుగడ్డపై వెలువడిన తొలి కమ్యూనిస్టు పత్రిక 1937 డిసెంబరు 15వ తేదీన రాజమండ్రిలో ప్రారంభమైన నవశక్తి . ఇది కొన్నాళ్ళు రాజమండ్రి నుంచి, మరికొన్నాళ్ళు విజయవాడ నుంచి వెలువడి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మూతపడింది. అటు పిమ్మట ‘స్వతంత్ర భారత్’గా రహస్యంగా ముద్రింపబడింది. అనంతర కాలంలో ‘ప్రజాశక్తి వారపత్రిక’గా 1942 లో ప్రారంభమైంది. పార్టీ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ‘ప్రజాశక్తి’ ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని 1945నుంచి దిన పత్రికగా వెలువడింది. ఆ తరువాత 1948లో నిషేధించబడింది. అప్పుడు విజయవాడ నుంచి ‘జనత’, మద్రాసు నుంచి ‘సందేశం’, తెనాలి నుంచి ‘నగారా’, మద్రాసు నుంచి ‘జనవాణి’ వెలువడినవి.
ప్రజా పత్రికల గొంతుపై ఉక్కుపాదం మోపి పాలకులు నిర్బంధ పాలన సాగిస్తున్న ఈ కాలంలోనే సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో మద్రాసు నుంచి విశాలాంధ్ర పక్షపత్రిక ఒకటి వెలువడుతుండేది. అదే సమయంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీ విశాలాంధ్ర పేరుతో సైక్లోస్టయిల్ పత్రికను ప్రజలకు అందించింది. జాతీయోద్యమం విజయవంతమై భాషాప్రయుక్త రాష్ట్రాలకు ప్రజలు ఉద్యమిస్తున్న ఆ చారిత్రక దశలో విశాలాంధ్ర నినాదం ప్రజాభిమానం పొందింది. మూతపడిన ప్రజాశక్తి 1951 లో వార పత్రికగా వెలువడి, పాలకుల ఆంక్షల మధ్య కొన్నాళ్ళు ద్వైవారపత్రికగా వెలువడగా హైదరాబాద్ నుంచి ‘ప్రజాయుగం’ ప్రారంభమై కొద్దికాలం నడిచింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రజల జాతీయాభిమానాన్ని, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తూ ప్రజాభిమానం విశేషంగా పొందిన ‘విశాలాంధ్ర’ పేరుతో ఒక దిన పత్రికను నిర్వహించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. సొసైటీల చట్టం కింద రిజిస్టరైన విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఏర్పడింది. ఈ సంస్థ నిర్వహణలో విశాలాంధ్ర దినపత్రిక 1952 జూన్ 22 న విజయవాడ నుంచి ఆంధ్రవిశారదతాపీ ధర్మారావు చేతుల మీదుగా అసంఖ్యాక అభిమానుల మధ్య ప్రారంభమైంది
మొదట్లో ముద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి సత్యనారాయణ, కాట్రగడ్డ రాజగోపాలరావులు సంపాదక వర్గంగా ఉండేవారు. ఆ తరువాత మోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసారు.ఆయన 10 ఏళ్ళు ఎడిటర్ గా పనిచేసారు. అలాగే ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గానూ 15 ఎళ్ళుగా పనిచేసారు. ఆయన ఎంపీ, శాసన సభ్యులు గానూ పనిచేసారు. 1965 - 1968 మధ్యకాలంలో ఏటుకూరి బలరామమూర్తి సంపాదకత్వ బాధ్యతను నిర్వహించారు. 1968 -1972 మధ్య వేములపల్లి శ్రీకృష్ణ సంపాదకుడుగా ఉన్నాడు. చక్రవర్తుల రాఘవాచారి 1972 లో సంపాదకత్వం స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగించి కీర్తి గడించాడు. 2002 విశాలాంధ్ర స్వర్ణోత్సవం జరుపుకున్న నాటి నుండి 2011 వరకు ఈడ్పుగంటి నాగేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు. 2011 సంవత్సరం నుండి ఈ బాధ్యతలను కె. శ్రీనివాసరెడ్డి స్వీకరించగా, ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఎడిటోరియల్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)