వెంకటరామ రామలింగం పిళ్ళై | |
---|---|
![]() 1989లో భారత ప్రభుత్వం విడుదల చేసిన రామలింగం పోస్టల్ స్టాంపు | |
జననం | మోహనూరు, నమక్కల్ జిల్లా, తమిళనాడు | 1888 అక్టోబరు 19
మరణం | 24 ఆగస్టు 1972 | (aged 83)
ఇతర పేర్లు | నామక్కల్ కవిగ్నర్ |
వృత్తి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు |
వెంకటరామ రామలింగం పిళ్ళై ( 1888 అక్టోబరు 19 - 1972 ఆగస్టు 24), [1][2] తమిళనాడుకు చెందిన కవి, స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్యం గురించిన కవితలు రాసి గుర్తింపు పొందాడు. ఇతనితోపాటు 7 మంది తోబుట్టువులు ఉన్నారు.
రామలింగం పిళ్ళై 1888, అక్టోబరు 19న వెంకటరామన్ - అమ్మనియమాల్ దంపతులకు తమిళనాడు రాష్ట్రం, నమక్కల్ జిల్లాలోని మోహనూరులో జన్మించాడు. తండ్రి వెంకటరామన్ మోహనూరులో పోలీసు శాఖలో పని చేసేవాడు, తల్లి భక్తురాలు. తల్లిదండ్రులకు ఎనిమిదవ సంతానమైన రామలింగం నామక్కల్, కోయంబత్తూర్లలో పాఠశాల విద్యను చదివాడు. 1909లో తిరుచ్చిలోని బిషప్ హెబర్ కాలేజీ నుండి బిఏ పూర్తిచేశాడు. నామక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేసిన రామలింగం, ఆ తరువాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[1]
దేశభక్తి మీద వందలాది కవితలు రాశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1930లో ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఒక సంవత్సరంపాటు జైలుకు కూడా వెళ్ళాడు.[2]
భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారాన్ని 1971లో భారత ప్రభుత్వం నుండి అందుకున్నాడు.[1]
రామలింగం 1972, ఆగస్టు 24న మరణించాడు.