కాశీ విశ్వనాథ్ | |
---|---|
జననం | యనమదల కాశీవిశ్వనాథ్ నవంబర్ 26 పురుషోత్తపట్టణం, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా |
వృత్తి | నటుడు, దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1983 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హేమలత |
పిల్లలు | ప్రవల్లిక, హారిక |
తల్లిదండ్రులు |
|
యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు సినీ నటుడు, దర్శకుడు.[1][2] నువ్వు లేక నేను లేను ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన నచ్చావులే. ఈ సినిమాలో ఆయన కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.[3]ఆయన తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా 14 నవంబర్ 2021న ఎన్నికయ్యాడు.[4]
కాశీవిశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంకు దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నం లో జన్మించాడు.[5] ఆయన తల్లిదండ్రులు భూగోపాలరావు, మంగమణి. ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. పోలవరం ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పన్నెండో తరగతి దాకా చదివాడు. రాజమండ్రిలో బీ.కాం పూర్తి చేశాడు.
బాల్యంలో ఆయన బంధువులకు సినిమా హాలు ఉండేది. అందులో ఆయన ఉచితంగా సినిమాలు చూసేవాడు. వాటిని చూసి స్ఫూర్తి పొంది చిన్న కథనాలు రాసుకుని అమ్మకు వివరించేవాడు. ఆమె కూడా ప్రోత్సహించేది. ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు వారి ఊరికి దగ్గరలో బాలచందర్ దర్శకత్వంలో తొలికోడి కూసింది అనే సినిమా షూటింగ్ జరగడం చూశాడు. అప్పటి నుంచి సినీరంగం వైపు ఆకర్షితులయ్యాడు. కుటుంబ సభ్యులకి ఆ విషయాన్ని తెలియ జేశాడు. తనకి సోదరుడి వరసయ్యే గద్దె రత్నాజీ రావు ప్రోత్సాహంతో చెన్నై వెళ్ళి కానూరి రంజిత్ కుమార్ అనే నిర్మాతను కలిశాడు. అప్పుడు ఆయన విజయనిర్మల దర్శకత్వంలో లంకె బిందెలు అనే సినిమా తీస్తున్నాడు. ఈయన ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు.[6][7]