శ్రీ రామదాసు | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | జె. కె. భారవి (కథ, మాటలు) |
నిర్మాత | పంతం నానాజీ, కొండా కృష్ణంరాజు |
తారాగణం | అక్కినేని నాగార్జున, స్నేహ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
సంగీతం | ఎమ్.ఎమ్.కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మార్చి 30, 2006[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీరామదాసు 2006 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన భక్తిరస చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, స్నేహ ముఖ్యపాత్రల్లో నటించారు. తెలుగు వాగ్గేయకారుడు భక్త రామదాసు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నిందించాడు.
అవార్డ్స్
ఉత్తమ నటుడు: అక్కినేని నాగార్జున
ఉత్తమ కుటుంబ కథా చిత్రం , అక్కినేని అవార్డ్
భద్రుడు శ్రీరామునికై తపస్సు చేసి తను కొండగా ఉన్న ఇక్కడ శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వెలియాలని వేడుకొంటాడు.అలాగేనని వరమిచ్చిన శ్రీరాముడు ఆ కొండపై వెలుస్తాడు. కొంతకాలమునకు అదేకొండ ప్రాంతపు అడవిలో నివసిస్తున్న పోకల దమ్మక్క (సుజాత) కు కలలో కనిపించి తాను కొండపై నున్నానని తన ఆలనా పాలనా చూడవలసినదని శ్రీరాముడు చెపుతాడు. ఆమె జనంతో వెళ్ళి వెదికి వాల్మీకంలో కల స్వామిని కనుగొని ఆ ప్రదేశమును శుభ్రపరచి చిన్న పాకవేసి రోజూ స్వామిని సేవిస్తూ ఉంటుంది. నీకు గుడి కట్టే నాదుడే లేడా అని వేడుకున్న దమ్మక్క ప్రార్థనకు స్వామి చిలుక రూపంలో విగ్రహములనుండి వెల్వడి ఒక పల్లెకు చేరుతాడు.
ఒక పల్లెలో పుణ్య దంపతుల (రంగనాథ్, సుధ)ల కుమారుడు, శిల్పకారుడైన గోపన్న తన మామ కూతురైన కమల ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఆమె కోరికపై ఆమె పుట్టిన రోజున చిలుక రూపంలో కల శ్రీరాముని పట్టుకొని పంజరంలో బంధిస్తాడు. కమలను వివాహం చేసుకొన్నవారు కారాగారవాసం అనుభవిస్తారని జ్యోతీష్కుడు ఆమె తలిదండ్రులకు చెపుతాడు. అయినా పరవాలేదని గోపన్న ఆమెను వివాహమాడుతాడు. అతని వివాహానికి వచ్చిన అతని మేనమామలైన అక్కన్న, మాదన్న లతో గోపన్నకు వాళ్ళు పనిచేసే తానీషా నాజర్ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడుగుంది గోపన్న తల్లి.
సరేనని వారితో వెళ్ళి తానీషా వద్ద ఒక పరీక్షతో అతని మెప్పుపొంది భద్రాచల ప్రాంతమున గల హుస్నాబాధ్ తహసిల్ దారుగా నియమింపబడతాడు. అప్పటికి అక్కడ తహసిల్ దారుగా ఉండి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తూ వారి డబ్బుతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్న తానీషా బావమరది మట్టేసాహెబ్ తనను మాజీని చేయడంతో గోపన్నపై ద్వేషాన్ని పెంచుకొంటాడు. అతనిని కొట్టి గోదావరిలో పడేస్తారు. గోదావరిలో కొట్టుకుంటున్న అతనిని దమ్మక్క రక్షించి అతనికి తనకు తెలిసిన కొండవైద్యం చేసి సేవ చేస్తుంది. తనను రక్షించిన దమ్మక్కకు కృతజ్ఞత చెప్పేందుకు వెళ్ళిన అతనికి శ్రీరాముని విగ్రహాలను చూపి గుడి కట్టమని అడుగుతుంది. అక్కడినుండి గోపన్నలో భక్తి భావం కలిగి గుడి కట్టేందుకు శ్రీరామదీక్ష చేపట్టి గుడికి కావలసిన డబ్బు సంపాదిస్తాడు. ఏడు లక్షల వరహాలు వచ్చిన తరువాత పన్నుల రూపంలో తానీషాకు ఇవ్వవలసిన లక్ష వరహాలతో పాటు గుడి నిర్మాణానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తాడు. తానీషా బావమరది మట్టేషాహెబ్ వాటిని కాజేసి ఆ లేఖను తగులబెడతాడు. రామ సంకీర్తనం చేస్తూ ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్న కబీర్ రామదాసును కలసి అతనికి రామనామ తారక మంత్రమును ఉపదేశించి, గుడి నిర్మాణమును మెదలెట్టమంటాడు. గుడి నిర్మాణము మొదలై కొన్ని సంఘటనల తరువాత గోపన్న రామదాసుగా పిలువబడతాడు. మట్టేసాహెబ్ మరికొందరు తానీషాకు గోపన్నపై ప్రజాధనం వృదాచేస్తున్నాడని, ప్రజలను రెచ్చగొడుతున్నాడని పిర్యాదులు చేయడంతో రామదాసును పిలిపించి విచారిస్తారు. అక్కడ రామదాసుకు వ్యతిరేకంగా సాక్షమిచ్చి అతనిని జైలుకు పంపుతారు మట్టేసాబ్, అతనివద్ద పనిచేసే నత్తిపంతులు . అప్పటికి జైలు అధికారిగా ఉన్న మట్టే సాహెబ్ రామదాసుని సరియైన ఆహారము ఇవ్వక చిత్రహింసలు పెడతాడు. శ్రీరాముడు తానీషా కలలో కనపడి అతనికి రామదాసు ఖర్చు చేసిన ఆరు లక్షల వరహాలు ఇచ్చి అతడు నిర్ధోషి అని అతడిని విడూదల చేయమని చెప్పి మాయమవుతారు. నిద్రనుండి లేచిన తానీషాకు నిజంగానే ఎదురుగా ఆరు లక్షల రాముని కాలంలో వినియోగించబడిన వరహాలు కనిపిస్తాయి. వెంటనే రామదాసుని విడిపించి తనను క్షమించమని వేడుకొని సమస్త కానుకలతో అతడీ పంపుతాడు. తానీషాకు కనిపించిన రాముడు ఇంత చేసిన తనకు కనిపించకపోవుటచే బాధతో గుండెను చీల్చుకొంటాడు. గుండెనుండి వెలుపలికి వచ్చిన సీతా సమేత రాముడు నేను నీ గుండెలోనే ఉండగా నీవెక్కడెక్కడో నా కొరకై వెదకుతున్నవు అని చెప్పి, నాకు అత్యంతానందము కలగించిన నీకు సశరీరముగ స్వర్గవాసము కలిగిస్తానని చెపుతాడు. రామదాసు తనకు స్వర్గము శ్రీరాముని సేవలోనే అని అదే ప్రదేశమున తనను ఎల్లకాలమూ స్వామిని దర్శిస్తూ ఉండేలా వరం ప్రసాదించమంటాడు. అలాగేనని శ్రీరాముడు రామదాసుని తనలో ఐక్యం చేసుకుంటాడు.