సరూర్‌నగర్ చెరువు: 16వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా పాలనాకాలంలో, పంటపొలాలకు నీరందించేందుకు ఈ చెఱువు త్రవ్వించబడింది. ఒక చదరపు కిలోమీటరు వైశ్యాల్యం కలిగిన ఈ చెరువు ఇటీవలి కాలంలో భూమి కబ్జాల వల్లను చుట్టుపక్కల నెలక్కొన్న ఆవాసాల వల్ల కుంచించుకుపోయింది. స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాదు నగరం యొక్క పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆవాస యోగ్యమైన భూమి కొరకై చెఱువు చుట్టపక్కల వ్యవసాయభూమిని ఇండ్ల స్థలాలుగా మార్చేశారు. 90వ దశకంలో చెఱువు కట్టను విస్తరించి, చెఱువు పరిసరాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సరూర్‌నగర్ క్రీడా ప్రాంగణం: విజయవాడ జాతీయరహదారిపై నెలక్కొన్న ఇండోర్ క్రీడా ప్రాంగణమిది. 2002లో హైదరాబాదులో జరిగిన 32వ జాతీయ క్రీడల సందర్భంగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం 2,000 మంది ప్రేక్షకులు తిలకించగల సామర్థ్యం కలిగి ఉంది.
విక్టోరియా మెమోరియల్ హోం: ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ తన కుటుంబానికి వేట విడిదిగానూ, వేసవి విడిదిగానూ ఉపయోగించేందుకు నిర్మించిన ఈ మహల్ సరూర్ నగర చెఱువుకు సమీపంలో 65 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది.[4][5] నిజాంకు ఈ మహలు కలిసిరాకపోవటం వల్ల అశుభసూచకంగా భావించి దాన్ని అనాథశరణాలయంగా మార్చేందుకు ఆదేశించాడు. అప్పటి బ్రిటీషు రెసిడెంటు విన్నపం ప్రకారం దాన్ని విక్టోరియా రాణి స్మారకార్ధంగా నామకరణం చేశారు.[6]
అవేర్ హాస్పిటల్: అవేర్ అనే స్వచ్ఛందసంస్థ యొక్క ఛైర్మన్ పి.కె.ఎస్.మాధవన్, ఆ సంస్థ యొక్క రజతోత్సవ సందర్భంగా స్థాపించాడు. ఇది నాగార్జున సాగర్ రోడ్డుపైన బైరాముల్‌గూడాలోని శాంతివనంలో ఉంది. ఇది ఆధ్యాత్మిక దృష్టితో, పర్యావరణానికి అనుగుణంగా రూపొందించబడింది. 50 స్పెషాల్టీ శాఖలున్న ఈ 300 పడకల ఆసుపత్రి అత్యంత ఆధునిక సాంకేతి, పరికరాలతో 24 గంటలు సేవలు అందజేస్తున్నది.