సి.ఎం. పూనాచా | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | చెప్పుదిర పునాచా 1910 సెప్టెంబరు 26 అత్తూరు, కూర్గ్ బ్రిటిష్ ఇండియా |
మరణం | 1990 ఆగస్టు 7 | (వయసు 79)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ |
సంతానం | సిపి బెల్లియప్ప, కావేరి నంబీసన్, ఇద్దరు కుమార్తెలు |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు |
Known for | కూర్గ్ ముఖ్యమంత్రి |
చెప్పుదిర ముతన పూనాచా (సి.ఎం. పూనాచా) ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతను కూర్గ్ ముఖ్యమంత్రిగా, మైసూర్ రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడుగా (రాజ్యసభ, లోక్ సభ) భారత కేంద్ర రైల్వే మంత్రిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా, ఒరిస్సా గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించాడు.[1]
సి.ఎం. పూనాచా, కూర్గ్ స్వాతంత్ర్యోద్యమ సమయంలో 1932, 1933 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కాలంలో రెండుసార్లు జైలు పాలయ్యాడు. అతను 1938 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యాడు. అలాగే, 1938 లో కూర్గ్ జిల్లా బోర్డుకు ఎన్నికయి, 1941 లో అధ్యక్షుడయ్యాడు. 1945 లో అతను కూర్గ్ శాసన మండలికి ఎన్నికయ్యాడు. 1945 నుండి 1951 వరకు కౌన్సిల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడుగా వ్యవహరించాడు. అందువల్ల అతను కూర్గ్‌లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ సభ్యుడయ్యాడు.[2]
1947 నుండి 1956 వరకు కూర్గ్ దక్షిణ భారతదేశంలోని ప్రత్యేక రాష్ట్రం. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం, ట్రావెన్కోర్ రాజ్యం, కొచ్చిన్ రాజ్యం, హైదరాబాద్ రాజ్యం ప్రత్యేక రాష్ట్రాలుగా ఉన్నాయి. కూర్గ్ రాష్ట్ర అసెంబ్లీలో 24 మంది సభ్యులు ఉన్నారు.
సి.ఎం. పూనాచా, రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు.[3]
కూర్గ్‌లో పూనాచా మొదటి సాధారణ ఎన్నికల్లో కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1952-56) ఎన్నికయ్యాడు. తర్వాత కూర్గ్ మైసూర్లో విలీనం చేయబడింది.
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్ప ఆధ్వర్యంలో పూనాచా గృహ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు. అతను 1959 నుండి 1963 వరకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడు.[4]
పూనాచా 1964 ఏప్రిల్ లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. తరువాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో పోర్ట్‌ఫోలియో లేకుండా కేంద్ర మంత్రి అయ్యాడు. 1966 జనవరి 1 నుండి 24 వరకు, అతను ఆర్థిక మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా, 1966 జనవరి 25 నుండి 1967 మార్చి 12 వరకు రవాణా, విమానయాన, షిప్పింగ్, పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. అతను 1969 లో మంగళూరు నియోజకవర్గానికి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలిచాడు. తర్వాత 1971 లో NCO పార్టీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు.
కొంతకాలం తర్వాత అతను 1967 నుండి 1969 వరకు రైల్వే మంత్రిగా పనిచేశాడు. ఆ సమయంలో అతను మంగళూరు లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు.[5]
రాజకీయాల నుండి పదవీ విరమణ చేసిన తరువాత, అతను రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేశాడు. 1978 ఆగస్టు 17 న మధ్యప్రదేశ్ గవర్నర్‌గా, తరువాత 1980 ఏప్రిల్ 30 న ఒరిస్సా గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాడు.[6]
పునాచాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని ఇద్దరు పిల్లలు, సిపి బెల్లియప్ప, కావేరి నంబీసన్. వీరు ఆంగ్లంలో ప్రసిద్ధ రచయితలు.[7]