సి.కేశవన్ | |
---|---|
ట్రావెన్కోర్ కొచ్చిన్ 2వ ముఖ్యమంత్రి | |
In office 1951 మార్చ్ 3 – 1952 మార్చ్ 12 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1891 మే 23 |
మరణం | 1969 జులై 7 (వయస్సు 78) |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | వాసంతి |
సి.కేశవన్(ఆంగ్లం:C. Kesavan:- 1891 మే 23- 1969 జులై 7) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త. 1950 నుండి 1952 వరకు ట్రావెంకోరే-కొచ్చిన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాడు.[1]
కేశవన్ 1891లో ట్రావెన్కోర్ రాష్ట్రంలోని మయ్యనాడ్ గ్రామంలో జన్మించాడు. తిరువనంతపురంలోని ఒక కళాశాలలో న్యాయవిద్యను పూర్తి చేసి లాయరుగా వృత్తిని ప్రారంభించాడు. పద్మనాభన్ పాల్పు అనే సంఘ సంస్కర్త వ్యక్తిత్వంచే ప్రేరణ పొందిన కేశవన్ అతను స్థాపించిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే దళంలో చేరాడు. ఎజ్హ్వా అనే వెనుకబడిన సామాజిక వర్గం అభివృద్ధికై వివిధ కార్యక్రమాలు చేపట్టాడు.[2][3]
కేశవన్ ఒక నాస్తికుడు, 1930లో హిందూ మతాన్ని పరిత్యజించాలని పిలుపునిచ్చాడు. గాంధీ, కార్ల్ మర్క్స్ సిద్ధాంతాలతో ప్రభావం చెందాడు. అంటరానితనం నిర్మూలనకు కృషి చేసాడు.
1933 నుండి, సి. కేశవన్ ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్‌లో సంయమన ఉద్యమం లేదా నివర్తన ప్రక్షోభం నడిపిన నాయకులలో ఒకడు. కోజంచెరిలో జరిగిన ఒక బహిరంగ సభలో అతను చేసిన ప్రసంగం కారణంగా, 7 జూన్ 1935 న అరెస్టు చేయబడ్డాడు. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.[4]
కేశవన్ ట్రావెన్కోర్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ నిర్మాణంన్లో ముఖ్య సభ్యుడు. ట్రావెన్కోర్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం జరిగిన ఆందోళనలో, అతను అనేకసార్లు అరెస్టు చేయబడ్డాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో, కేశవన్‌కు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. తిరిగి 1943 జూలై 19 న విడుదల చేయబడ్డాడు. స్వాతంత్ర్యం తరువాత, కేశవన్ ట్రావెన్‌కోర్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యాడు, పట్టం థాను పిళ్లై నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
1951 మార్చ్ 3వ తారీఖున కేశవన్ ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. ఈయన హయాంలో స్థాపించిన త్రివేండ్రం వైద్య కళాశాలను పండిట్ జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించాడు.
కేశవన్ కేరళ కౌముది స్థాపకులైన సి.వి.కున్హిరామన్ కుమార్తె వాసంతి ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు కె.ఆర్ భద్రన్ ఎయిర్ ఇండియా డకోటా ఆక్సిడెంటు ఘటనలో మృతిచెందాడు.[5]