సురభి లక్ష్మి భారతీయ చలనచిత్రం, టెలివిజన్, రంగస్థల నటి. ఆమె మలయాళ చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో నటిస్తుంది.[2] ఆమె మలయాళ చిత్రం మిన్నమినుంగు (Minnaminungu) లో తల్లి పాత్రను పోషించినందుకు 2016లో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3]
మీడియా వన్ టీవీలో ప్రారంభించిన మలయాళ హాస్య టెలివిజన్ సిరీస్ M80 మూసా ద్వారా ఆమె పాతు పాత్రకు ప్రసిద్ధి చెందింది.[4]
సురభి లక్ష్మి కేరళలోని కోజికోడ్ సమీపాన ఉన్న నరిక్కుని ఆండీ, రాధలకు 1986 నవంబరు 16న జన్మించింది.[5][6][7] ఆమె కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మొదటి ర్యాంక్‌తో బి.ఎ. డిగ్రీని పొందింది.[2] ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి థియేటర్ ఆర్ట్స్‌లో ఎం.ఎ డిగ్రీని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకుంది.[6] 2017 నాటికి, ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో పి.హెచ్.డి విద్యార్థిని.[8]
అమృత టీవీలో రియాల్టీ షో బెస్ట్ యాక్టర్లో లక్ష్మి గెలుపొందింది.[9]
మిన్నమినుంగు చిత్రంలో ఆమె నటనకు విశేష స్పందనతోపాటు పలు పురస్కారాలు వరించాయి. ఆమె 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[10][11] కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2016లో ప్రత్యేక జ్యూరీ, రెండవ ఉత్తమ నటిగా మలయాళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు 2016 ఆమె సాధించింది.
ఆమె ఇరవైకి పైగా మలయాళ చిత్రాలలో, రెండు టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[12]