| |||||||||||||||||||||||||
98 స్థానాలు 50 seats needed for a majority | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||
|
1919 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్వంద్వ పాలన వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి మూడవ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు 1926 నవంబరులో జరిగాయి. జస్టిస్ పార్టీ, స్వరాజ్ పార్టీ చేతిలో ఓడిపోయింది. అయితే, స్వరాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించడంతో, మద్రాసు గవర్నర్ పి. సుబ్బరాయన్ నాయకత్వంలో, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మద్రాసు ప్రెసిడెన్సీలో ఆర్థిక కష్టాలు తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వైఫల్యం వలన వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతిని తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పటికే పన్ను వసూలు చేసేవారు, వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్న భూమిలేని కార్మికుల పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఉద్యోగాలు, జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళే రైతుల వలసలు పెరిగాయి.[1] అంతర్గత విభేదాలు, కక్ష సాధింపులతో జస్టిస్ పార్టీ అతలాకుతలమైంది. దాని నాయకుడు త్యాగరాయ చెట్టి 1925 ఏప్రిల్ 28 న మరణించడంతో, మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రథమ మంత్రిగా ఉన్న పానగల్ రాజా అతని స్థానంలో పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు. సి.నటేశ ముదలియార్ వంటి అసమ్మతివాదులను తిరిగి తీసుకురావడం ద్వారా జస్టిస్ పార్టీని ఏకం చేసేందుకు పానగల్ రాజా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1924 లో మద్రాసు గవర్నర్‌గా మార్క్వెస్ విల్లింగ్టన్ తర్వాత వచ్చిన విస్కౌంట్ గోషెన్‌తో జస్టిస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవు. జస్టిస్ మంత్రులు అధికారం, అండదండలకు సంబంధించిన సమస్యలపై గవర్నరు కార్యనిర్వాహక మండలి సభ్యులతో తరచూ విభేదిస్తూ ఉండేవారు.
1925 నవంబరులో పెరియార్ EV రామసామి నిష్క్రమణతో భారత జాతీయ కాంగ్రెస్ కూడా బలహీనపడింది. సామాజికవర్గాల వారీగా ప్రాతినిధ్యానికి మద్దతుగా తీర్మానాలను ఆమోదించడానికి కాంగ్రెస్ నిరాకరించినందుకు ఆగ్రహంతో, అతను కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, ఎన్నికల్లో జస్టిస్ అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. అతను తన తమిళ వార్తాపత్రిక కుడిఅరసు లో కాంగ్రెస్‌పై తీవ్రంగా దాడి చేశాడు.[2]
మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు మొత్తం 132 మంది సభ్యులు ఉన్నారు. 1926 లో దీని అధ్యక్షుడు 40 సంవత్సరాల మరియదాస్ రత్నస్వామి. మండలిలో అనేక ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. వాటిలో ఒకటి, ది హిందూ రిలిజియస్ ఎండోమెంట్స్ యాక్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టడం.[3] 132 మంది సభ్యులలో, 98 మంది ప్రెసిడెన్సీలోని 61 నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు. నియోజకవర్గాల్లో మూడు రకాలు ఉన్నాయి: 1) ముస్లిమేతర పట్టణ, ముస్లిమేతర గ్రామీణ, బ్రాహ్మణేతర పట్టణ, భారతదేశంలోని ఇస్లాం పట్టణ, ముస్లిం గ్రామీణ, భారతీయ క్రైస్తవ, యూరోపియన్, ఆంగ్లో-ఇండియన్; 2) భూస్వాములు, విశ్వవిద్యాలయాలు, ప్లాంటర్లు, వర్తక సంఘాలు (సౌత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ & నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్) వంటి ప్రత్యేక నియోజకవర్గాలు; 3) ప్రాదేశిక నియోజకవర్గాలు. 28 నియోజకవర్గాలు బ్రాహ్మణేతరులకు రిజర్వ్ చేయబడ్డాయి. 34 మంది సభ్యులు నామినేట్ చేయబడినవారు. వీరిలో గరిష్టంగా 19 మంది ప్రభుత్వ అధికారులు, 5 గురు పరైయర్, పల్లార్, వల్లువర్, మాల, మాదిగ, సక్కిలియార్, తొట్టియార్, చెరుమాన్, హోలెయ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఒక్కరు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళలకు ప్రాతినిధ్యం వహించడానికి మరో ఐదుగురు నామినేటెడ్ సభ్యులను ఈ ఎన్నికల నుండి చేర్చారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిపి, శాసనసభ మొత్తం బలం 134. మండలిలో సభ్యులుగా ఉన్న రాజకీయ ప్రముఖులు - 10 సంవత్సరాల తరువాత మొదటి మంత్రి అయిన పిటి రాజన్, ఎస్. శ్రీనివాస అయ్యంగార్, పిటి రాజన్, ఎస్.సత్యమూర్తి, ఆర్కాట్ రామస్వామి ముదలియార్ . మొదటి మంత్రి పానగల్ రాజు, మరో ఇద్దరు మంత్రులు ఎ.పి పాత్రో, టి.ఎన్. శివజ్ఞానం పిళ్లై ఉన్నారు. ఆస్తి అర్హతల ఆధారంగా ప్రజలకు వోటు హక్కు కల్పించారు[1][4][5]
ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీ 21 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారం కోల్పోయింది. స్వరాజ్ పార్టీ 41 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది గానీ, మెజారిటీ సాధించలేకపోయింది. జస్టిస్ పార్టీ స్థవరంగా ఉన్న మద్రాసు నగరంలోని నాలుగు స్థానాలనూ వారు గెలుచుకున్నారు. నటేశ ముదలియార్, O. తనికాచలం చెట్టియార్, కూర్మ వెంకట రెడ్డి నాయుడు, ఆర్కాట్ రామసామి ముదలియార్ వంటి ప్రముఖ జస్టిస్ పార్టీ నాయకులు ఓడిపోయారు.[2] పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను పట్టికలో చూడవచ్చు.[6][7]
పార్టీ | ఎన్నికైనవారు | నామినేటైన, ఎక్స్ అఫీషియో సభ్యులు | మొత్తం |
---|---|---|---|
జస్టిస్ పార్టీ | 21 | 1 | 22 |
స్వరాజ్ పార్టీ | 41 | 0 | 41 |
స్వతంత్రులు | 36 | 22 | 58 |
మంత్రి వ్యతిరేకి | 0 | 0 | 0 |
అధికారులు | 0 | 11 | 11 |
మొత్తం | 98 | 34 | 132 |
క్షీణిస్తున్న జస్టిస్ పార్టీ, స్వరాజ్యవాదుల అత్యున్నత ప్రచార వ్యూహాలు ముఖ్యంగా S. శ్రీనివాస అయ్యంగార్, S. సత్యమూర్తి ల కారణంగా స్వరాజ్ పార్టీ విజయం సాధించిందని విశ్లేషకుల అభిప్రాయం.[8] ప్రజల మద్దతును పొందేందుకు వారు బహిరంగ ప్రదర్శనలు, సమావేశాలు, ఇంటింటికి ప్రచారం, భజన ఊరేగింపులను ఉపయోగించారు. దీనికి విరుద్ధంగా జస్టిస్ పార్టీ, దాని సాంప్రదాయిక ఎన్నికల ప్రచార పద్ధతికే కట్టుబడింది - గ్రామాలు, నగరాల్లోని ప్రభావవంతమైన వ్యక్తులు, బలమైన వ్యక్తుల నుండి మద్దతు కోరుతూ ప్రచారం చేసింది. స్వరాజ్యవాదుల సామూహిక ప్రచారం విజయవంతమైంది. జస్టిస్ పార్టీని ఓడించేందుకు వాళ్ళు తమిళనాడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. వి.కళ్యాణసుందర ముదలియార్, ఎంపి శివజ్ఞానం వంటి కాంగ్రెస్ నాయకులు స్వరాజ్ పార్టీ విజయం కోసం కృషి చేశారు. అయితే, మరో ప్రముఖ కాంగ్రెస్ నేత సి.రాజగోపాలాచారి ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రెసిడెన్సీలోని తమిళం మాట్లాడే ప్రాంతాల్లో బ్రాహ్మణేతర అభ్యర్థులను నిలబెట్టి స్వరాజ్యవాదులు, తమపై ఉన్న పెరియార్ చేసిన బ్రాహ్మణ ఆధిపత్య ఆరోపణలను ఎదుర్కొన్నారు. తద్వారా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని మట్టుబెట్టగలిగారు.[2][6] వివిధ సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్యను కింది పట్టికలో చూడవచ్చు.[6]
పార్టీ | ఎన్నికైనవారు | నామినేటైన, ఎక్స్ అఫీషియో సభ్యులు | మొత్తం |
---|---|---|---|
బ్రాహ్మణులు | 18 | 3 | 21 |
బ్రాహ్మణేతరులు | 56 | 10 | 66 |
అణగారిన తరగతులు | 0 | 10 | 10 |
మహమ్మదీయులు | 13 | 1 | 14 |
భారతీయ క్రైస్తవులు | 5 | 2 | 7 |
యూరోపియన్లు, ఆంగ్లో-ఇండియన్లు | 6 | 8 | 14 |
మొత్తం | 98 | 34 | 132 |
స్వరాజ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మండలిలో సాధారణ మెజారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మండలిలో నాయకుడు సీవీఎస్ నరసింహరాజును గవర్నర్ గోషెన్ ఆహ్వానించారు.[2]జాతీయ కాంగ్రెస్ పార్టీ తన కాన్పూరు సమావేశంలో ద్వంద్వ పాలనను రద్దు చేసే వరకు ప్రభుత్వ ఏర్పాటులో పాల్గొనకూడదని తీర్మానించింది. స్వరాజ్యవాదులు ఆ తీర్మానాన్ని తిరస్కరించారు.[9][10] కౌన్సిల్‌లో తగినంత బలం లేనందున, గవర్నర్‌తో గతంలో ఉన్న వైరుధ్యం కారణంగా జస్టిస్ పార్టీ కూడా అధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం గోషెన్, జాతీయవాద స్వతంత్రులను ఆశ్రయించాడు. ఏ పార్టీకీ అనుబంధంగా లేని పి. సుబ్బరాయన్ను ప్రథమ మంత్రిగా నియమించాడు. అతనికి విద్య (యూరోపియన్, ఆంగ్లో-ఇండియన్ విద్య కాకుండా) 2. లైబ్రరీలు, మ్యూజియంలు, జూలాజికల్ గార్డెన్స్ 3. మునిసిపల్ ప్రాంతాలలో లైట్, ఫీడర్ రైల్వేలు, ట్రామ్‌వేలు 4. గ్రామ పంచాయితీలతో సహా స్థానిక స్వపరిపాలన శాఖలను కేటయించగా, ఎ. రంగనాథ ముదలియార్ కు 1 వ్యవసాయం 2 పౌర పశువైద్య విభాగం 3. సహకార సంఘాలు 4. పరిశ్రమల అభివృద్ధి 5. పబ్లిక్ వర్క్స్ 6. రిజిస్ట్రేషన్ 7. రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్, RN ఆరోగ్యసామి ముదలియార్ కు 1 ఎక్సైజ్ 2. మెడికల్ అడ్మినిస్ట్రేషన్ 3. మత్స్య సంపద 4. ప్రజారోగ్యం, పారిశుధ్యం 5 బరువులు, కొలతలు 6 గణాంకాలు 7. బ్రిటిష్ ఇండియాలో తీర్థయాత్రలు 8. ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల కల్తీ పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.[11] కొత్త మంత్రివర్గానికి మద్దతుగా గోషెన్, 34 మంది సభ్యులను మండలికి నామినేట్ చేశాడు. ఈ మంత్రివర్గం గవర్నర్‌కు కీలుబొమ్మగా వ్యవహరించింది.[2] వార్విక్ విశ్వవిద్యాలయంలోని చరిత్ర ప్రొఫెసర్ డేవిడ్ ఆర్నాల్డ్ ప్రకారం,[12] అది "ప్రభుత్వపు ప్రాక్సీ".[2]
సుబ్బరాయన్ మంత్రివర్గాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తూ గవర్నరు, ద్వంద్వ వ్యవస్థను అపహాస్యం చేసాడు. దీనిని మొదట్లో స్వరాజ్యవాదులు, న్యాయవాదులు వ్యతిరేకించారు. అయితే, మంత్రివర్గం పదవీకాలం సగం గడిచేసరికి గవర్నరు, మంత్రివర్గానికి మద్దతు ఇచ్చేలా జస్టిస్ పార్టీని ప్రలోభపెట్టగలిగాడు. 1927లో, సుబ్బరాయన్ మంత్రుల స్థానంలో S. ముత్తయ్య ముదలియార్, MR సేతురత్నం అయ్యర్ వచ్చారు.[13][14] జస్టిస్ పార్టీ తీసుకున్న ఈ మలుపు వల్ల దానిపై కాంగ్రెస్‌కు అవిశ్వాసం కలిగింది. 1937 ఎన్నికల తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, మద్రాసు కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర మంత్రివర్గం అధికారం చేపట్టకుండా జాగ్రత్తపడ్డారు. స్వతంత్ర మంత్రివర్గం ద్వారా జస్టిస్ పార్టీ ఎలా తిరిగి అధికారంలోకి వచ్చిందో వారు గుర్తు చేసుకున్నారు. ప్రసిడెన్సీలో అధికారాన్ని చేపట్టడానికి జాతీయ కాంగ్రెస్‌ను ఒప్పించగలిగారు.[15][16][17]