| ||||||||||||||||||||||
మొత్తం 215 స్థానాలన్నింటికీ | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||
|
బ్రిటిషు భారతదేశంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికలలో భాగంగా మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి శాసనసభ ఎన్నికలు 1937 ఫిబ్రవరిలో జరిగాయి. శాసనసభలోని 215 సీట్లలో భారత జాతీయ కాంగ్రెస్ 159 స్థానాలను గెలుచుకుని మెజారిటీ సాధించింది. 1920 లో తొలిసారిగా మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు ఇది మొదటి ఎన్నికల విజయం. గత 17 ఏళ్లలో ఎక్కువ కాలం అధ్యక్ష పదవిని పరిపాలించిన జస్టిస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. అసెంబ్లీ 1937 జూలైలో ఏర్పాటైంది. సి. రాజగోపాలాచారి (రాజాజీ) మద్రాసు మొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రి అయ్యారు.[2][3]
ఏకకాలంలో శాసనమండలికి కూడా జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. మద్రాసులో కాంగ్రెస్ విజయం దేశం లోని అన్ని ప్రావిన్సులలో కెల్లా అత్యంత ఉత్తమమైన ప్రదర్శన. ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయాన్ని నిరసిస్తూ 1939 అక్టోబరులో రాజీనామా చేసే వరకు వరకు కొనసాగింది. తదుపరి ఎన్నికలు 1946లో జరిగాయి[2]
1935 భారత ప్రభుత్వ చట్టం రాజ్యాధికారాన్ని రద్దు చేసింది. ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని నిర్ధారించింది. ఇది మద్రాసు ప్రావిన్స్‌లో ద్విసభ శాసనసభను సృష్టించింది. శాసనసభలో గవర్నరు, రెండు శాసన సభలు - శాసన సభ, శాసన మండలి ఉన్నాయి . శాసనసభలో 215 మంది సభ్యులు ఉన్నారు. వారు సాధారణ సభ్యులు, ప్రత్యేక సంఘాలు ప్రయోజనాల కోసం ప్రత్యేకించబడిన సభ్యులు అని రెండు విధాలుగా వర్గీకరించారు.[4][5]
జనరల్ | షెడ్యూల్డ్ కులాలు | మహమ్మదీయులు | భారతీయ క్రైస్తవులు | స్త్రీలు | భూస్వాములు | వాణిజ్యం, పరిశ్రమ | కార్మిక, కార్మిక సంఘాలు | యూరోపియన్లు | ఆంగ్లో ఇండియన్స్ | విశ్వవిద్యాలయ | వెనుకబడిన ప్రాంతాలు, తెగలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
116 | 30 | 28 | 8 | 8 | 6 | 6 | 6 | 3 | 2 | 1 | 1 |
శాసన మండలిలో కనిష్ఠంగా 54 మంది, గరిష్ఠంగా 56 మంది సభ్యులు ఉన్నారు. ఇది గవర్నర్ రద్దు చెయ్యలేని శాశ్వత సంస్థ. దాని సభ్యులలో మూడింట ఒక వంతు మంది ప్రతి మూడు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. సభ్యులలో 46 మంది ఓటర్లు నేరుగా ఎన్నుకోబడతారు. 8 నుండి 10 మంది సభ్యులను గవర్నరు నామినేట్ చేయవచ్చు. మండలిలో సీట్ల విభజన ఈ విధంగా ఉంది:[6][5]
జనరల్ | మహమ్మదీయులు | భారతీయ క్రైస్తవులు | యూరోపియన్లు | నామినేటైనవారు |
---|---|---|---|---|
35 | 7 | 3 | 1 | 8-10 |
ఆస్తి అర్హతల ఆధారంగా పరిమిత సంఖ్యలో వోటింగు హక్కులు కల్పించారు.[7] 70 లక్షల ప్రజలు, మద్రాసు జనాభాలో 15% మంది భూమిని కలిగినవారు లేదా పట్టణ పన్నులు చెల్లించేవారు.[4] వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు వేర్వేరుగా బ్యాలెట్ బాక్సులను ఉంచారు. కాంగ్రెస్‌కు పసుపు రంగు పెట్టె, ముస్లిం లీగ్‌కు ఆకుపచ్చ రంగు పెట్టె కేటాయించారు.[8][9]
జస్టిస్ పార్టీ 1920 నుండి 17 సంవత్సరాల పాటు మద్రాసులో అధికారంలో ఉంది. 1926-28లో పి. సుబ్బరాయన్, ఎవరితోనూ అనుబంధం లేని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే అధికారంపై దాని పట్టుకు అంతరాయం కలిగింది.
బొబ్బిలి రాజా ఆధ్వర్యంలోని జస్టిస్ పార్టీ ప్రభుత్వం 1930ల ప్రారంభం నుండి క్రమంగా ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇది వర్గ రాజకీయాలతో నిండిపోయింది. బొబ్బిలి రాజా నిరంకుశ పాలన కారణంగా దాని ప్రజాదరణ నెమ్మదిగా క్షీణిస్తోంది. రాజా తన సొంత పార్టీ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందు పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన జిల్లా స్థాయి నాయకుల అధికారాన్ని, ప్రభావాన్నీ నాశనం చేయడానికి ప్రయత్నించాడు.[10] సుతంతిర సాంగు పత్రిక 1935 ఫిబ్రవరి 26 నాటి సంచికలో స్థానిక సంస్థల అధికార విధ్వంసాన్ని వివరించింది:
ఇటీవల లోకల్ బోర్డుల చట్టాన్ని సవరించాడు. తాలూకా బోర్డులను రద్దు చేసి, జిల్లా బోర్డును విభజించి, తనకు వ్యతిరేకమైన ఇతర బోర్డులను విభజించేందుకు ప్రయత్నించి.... తనకు తలవంచని మున్సిపాలిటీలను అణచివేస్తున్నాడు. తనకు నచ్చని చైర్మన్‌లను తొలగించడం, మిగతవాటిలో కమిషనర్లను నియామకం చేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నాడు.[10]
బ్రిటిషు ప్రభుత్వపు దుష్టపాలనకు మద్దతుగా నిలుస్తూ, వారికి సహకరించే పార్టీగా జస్టిస్ పార్టీకి ప్రజల్లో గుర్తింపు వచ్చింది. 1930 ల గ్రేట్ డిప్రెషన్ సమయంలో అది పాటించిన ఆర్థిక విధానాలు కూడా ప్రజాదరణ పొందలేదు. జమీందారీయేతర ప్రాంతాల్లో భూ రెవెన్యూ పన్నును 12.5% తగ్గించడానికి వ్యతిరేకించడం వల్ల దానిపై ప్రజావ్యతిరేకత వచ్చింది. స్వయంగా జమీందారైన బొబ్బిలి రాజా, ఆదాయాన్ని తగ్గించాలంటూ కాంగ్రెస్ చేసిన నిరసనలపై విరుచుకుపడ్డాడు. దీంతో జస్టిస్ పార్టీ ప్రజాదరణ మరింత తగ్గింది. మద్రాసు గవర్నర్ లార్డ్ ఎర్స్‌కిన్ 1937 ఫిబ్రవరిలో అప్పటి స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెట్‌లాండ్‌కి ఇచ్చిన నివేదికలో దక్షిణ భారతదేశంలోని రైతులు జస్టిస్ పార్టీతో విసిగిపోయారని, "గత పదిహేనేళ్లలో జరిగిన కష్టనష్టాలన్నిటికీ వారు [జస్టిస్ పార్టీ] బాధ్యులౌతున్నారు" అని రాసాడు.[10] మహా మాంద్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు మంత్రులు గడిపిన సంపన్న జీవనశైలిని మద్రాసు ప్రెస్ తీవ్రంగా విమర్శించింది. సెంట్రల్ ప్రావిన్స్‌లలోని మంత్రుల నెలజీతం రూ. 2,250 తో పోలిస్తే, వారు నెలవారీ జీతం రూ. 4,333.60 అందుకున్నారు. ఇది మద్రాసు పత్రికల ఆగ్రహానికి కారణమైంది. ఇండియా వార్తాపత్రిక ఇలా రాసింది:
పల్లెల్లో ఉండే సెకండ్-రేట్ వకీళ్ళ లాంటి ఈ మద్రాసు మంత్రులకు రూ. 2,000 సరిపోదా?నిరుపేదలు డబ్బులేక ఒకవైపు కష్టాలు పడుతోంటే వీళ్ళు దండిగా జీతాలు తీసుకుంటారా? ఏమిటీ అన్యాయం? ఓ పక్క దేశం మండుతూ ఉంటే, నిరుపేదలు ఉపాధి ల్కేఖ అలమటిస్తోంటే, పన్నుల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే, ఈ మద్రాసు మంత్రులు బడ్జెట్‌ను ఆమోదించగానే తమ పర్యటనలు ప్రారంభించారు.[10]
అప్పటి వరకూ ఉన్న జస్టిస్ పార్టీ ప్రభుత్వాలకు మద్దతుగా ఉన్న యూరోపియన్ యాజమాన్యంలోని వార్తాపత్రిక ది మద్రాస్ మెయిల్ కూడా బొబ్బిలి రాజా పరిపాలన అసమర్థత, అవినీతి విధానాల కారణంగా దానికి వ్యతిరేకంగా మారింది. 1935 జూలై 1 న అది తన సంపాదకీయంలో ఇలా రాసింది: "పునర్వ్యవస్థీకరణ పట్ల జస్టిస్ పార్టీ నిజంగా నిశ్చయంగా ఉన్నట్లైతే... ఈ పాడు వ్యవస్థ పోవాలి".[10] జస్టిస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తి ఎంత అనేది, జమీన్ రైతు పత్రికలో వచ్చిన ఒక వార్తా కథనంలో ప్రతిబింబిస్తుంది:
జస్టిస్ పార్టీ ఈ ప్రెసిడెన్సీ లోని ప్రజలను ప్లేగు లాగా పట్టి పీడిస్తోంది. వారి హృదయాలలో శాశ్వత ద్వేషాన్ని నింపింది. అందుకే అందరూ జస్టిస్ ప్రభుత్వ పతనం, కాంగ్రెస్ పరిపాలన ప్రారంభం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.... బొబ్బిలి రాజు మంత్రివర్గం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని గ్రామాల్లోని వృద్ధ మహిళలు కూడా అడుగుతున్నారు[10]
1935లో కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు జస్టిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న స్వరాజ్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది. మద్రాస్ ప్రావిన్స్ కాంగ్రెస్ పార్టీకి S. సత్యమూర్తి నాయకత్వం వహించాడు. 1930–31 నాటి ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి బాగా పుంజుకుంది. శాసనోల్లంఘన ఉద్యమం, భూపన్ను తగ్గింపు ఆందోళనలు, యూనియన్ సంస్థలు బొబ్బిలి రాజా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను సమీకరించడానికి కాంగ్రెస్‌కు సహాయపడ్డాయి. రెవెన్యూ ఆందోళనలు రైతులను కాంగ్రెస్ గూటికి తీసుకువచ్చాయి. గాంధేయ చేనేత కార్యక్రమం చేనేత కార్మికుల మద్దతుకు హామీ ఇచ్చింది. ఐరోపా వ్యాపారులకు ఇచ్చిన అధిక ప్రాధాన్యత కారణంగా స్వదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యారావేత్తల మద్దతు కాంగ్రెసుకు వచ్చింది. కాంగ్రెస్‌కు సత్యమూర్తి, రాజాజీ వంటి ప్రభావవంతమైన ప్రచారకులు ఉండగా, వారిని ఎదుర్కోవడానికి జస్టిస్ పార్టీకి ఆర్కాట్ రామసామి ముదలియార్ మాత్రమే ఉన్నాడు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు జనాదరణ ఉంది. భూమి శిస్తులను తగ్గిస్తామని, కార్మికులకు మంచి పని పరిస్థితులు, వేతనాలు, తక్కువ అద్దెలు, తదితర హామీలు ఇచ్చింది. సభలో రిజర్వు చేసిన సీట్లున్న యూరపియన్లకు కూడా విజ్ఞప్తి చేసింది. జాతీయవాద భావం బలంగా ఉన్న ప్రజలను కూడా ఆకర్షించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై వ్యాఖ్యానిస్తూ, భారత వార్షిక రిజిస్టర్ ఇలా చెప్పింది:
వోట్ల కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తమకు ఉపశమనం ఇస్తుందని ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. బహుశా వ్యవసాయ సంక్షోభం కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని వదులుకుని తమకు నచ్చని చట్టం కిందనే ప్రభుత్వ బాధ్యతలను చేపట్టటానికి నిశ్చయించుకుంది.
కాంగ్రెస్ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. రైతులు, కార్మికులు, నేత కార్మికులు, వ్యాపారవేత్తలు వంటి అన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. జస్టిస్ పార్టీకి కచ్చితమైన కార్యక్రమం గానీ విధానాలు గానీ లేవు. అది కాంగ్రెస్‌లోని బ్రాహ్మణ ఆధిపత్యం గురించి మాత్రమే మాట్లాడగలదు. మహా మాంద్యం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వారి ప్రచారంలో పస లేకుండా పోయింది.[10][11] సత్యమూర్తి ఎన్నికల ప్రచారంలో వి.నాగయ్య, కె.బి.సుందరాంబాల్ వంటి ప్రముఖ నటుల సేవలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా సుందరాంబాల్ కాంగ్రెస్ తరపున జోరుగా ప్రచారం చేసింది. సత్యమూర్తి శ్రీనివాస సినీటోన్‌కి చెందిన ఎ. నారాయణన్ దర్శకత్వంలో ప్రచార చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇందులో రాజాజీ, సత్యమూర్తి, ఇతర కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రాన్ని వలస ప్రభుత్వం నిషేధించింది.[12][13] రంగుల పోలింగు పెట్టె పద్ధతి కారణంగా అత్యంత వ్యవస్థీకృత పార్టీ అయిన కాంగ్రెస్‌కు ప్రెసిడెన్సీ అంతటా ఒకే విధమైన నినాదాలు ఉండేలా చేసింది. "గాంధీకి, పసుపు పెట్టెకూ ఓటు వేయండి" అనే నినాదం చాలా ప్రజాదరణ పొందింది. పార్టీకి మద్దతుదారులను సమీకరించడంలో సహాయపడింది.[14]
ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర పార్టీలు జమాల్ మహ్మద్ నేతృత్వంలోని మద్రాస్ ప్రావిన్స్ ముస్లిం లీగ్ (MPML), పిఠాపురం రాజా ప్రారంభించిన పీపుల్స్ పార్టీ ఆఫ్ మద్రాస్ (జస్టిస్ పార్టీ నుండి విడిపోయిన వర్గం), నవాబ్ C. అబ్దుల్ హకీమ్, SM పాషాల నేతృత్వంలోని ముస్లిం ప్రోగ్రెసివ్ పార్టీ.[15][16]
మద్రాసు శాసనసభలో పార్టీల వారీగా సీట్ల విభజన:[17][18][19][20]
మొత్తం సీట్ల సంఖ్య : 215
కాంగ్రెస్ | సీట్లు | JUSP | సీట్లు | ఇతరులు | సీట్లు |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 159 | జస్టిస్ పార్టీ (JUSP) | 18 | మద్రాస్ ప్రావిన్స్ ముస్లిం లీగ్ (MPML) | 11 |
సదరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ | 1 | నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్ | 1 | యూరోపియన్ వాణిజ్యం | 3 |
జస్టిస్ సపోర్టెడ్ పార్టీలు | 2 | ఆంగ్లో ఇండియన్స్ | 2 | ||
ముస్లిం ప్రోగ్రెసివ్ పార్టీ | 1 | ||||
పీపుల్స్ పార్టీ ఆఫ్ మద్రాస్ | 1 | ||||
ఇతరులు | 1 | ||||
స్వతంత్రులు | 15 | ||||
మొత్తం (1937) | 160 | మొత్తం (1937) | 21 | మొత్తం (1937) | 34 |
గమనిక : నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్, సదరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీట్లను ఇండియన్ కామర్స్ (వ్యాపారవేత్తలు) కోసం రిజర్వ్ చేసారు. నగరతార్ అసోసియేషన్ స్థానాన్ని రాజా ముత్తయ్య చెట్టియార్ (జస్టిస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు), దక్షిణ భారత వాణిజ్య మండలి స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన TT కృష్ణమాచారి గెలుచుకున్నారు.[21]
జస్టిస్ పార్టీపై కాంగ్రెస్ విజయానికి వివిధ కారణాలను ఆపాదించారు.[22] ది హిందూ ఎడిటర్-ఇన్-చీఫ్ N. రామ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్‌లో ఎమెరిటస్ ప్రొఫెసరైన రాబర్ట్ L. హార్డ్‌గ్రేవ్‌లు[23] జస్టిస్ పార్టీ ఓటమికి బ్రిటిష్ వారితో చేతులు కలపడమే కారణమన్నారు. హార్డ్‌గ్రేవ్ ప్రకారం:
జస్టిస్ పార్టీ తాను పేనిన తాడుతో తానే ఉరి బిగించుకుంది: బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు కారణంగా అది అధికారంలోకి వచ్చింది. అయితే జాతీయ స్పృహ, స్వాతంత్ర్య ఆకాంక్షల ప్రభావాలు, వలసవాదులతో దాని బంధం దానికి ఓటమిని తెచ్చిపెట్టాయి.
డాక్టర్ డేవిడ్ A. వాష్‌బ్రూక్, కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చరిత్ర విభాగపు సీనియర్ రీసెర్చ్ ఫెలో,[24] ఆండ్రీ బెటెయిల్లేలు జస్టిస్ పార్టీ సభ్యుల సంపన్న జీవన శైలీ స్వభావం దాని ఓటమికి కారణమైంది. మార్గరీట్ రాస్ బార్నెట్ జస్టిస్ పార్టీ ఓటమికి రెండు కారణాలను ఆపాదించిందిరు - 1) దళితులు, ముస్లింల మద్దతు కోల్పోవడం, 2) సామాజిక రాడికల్స్ ఆత్మగౌరవ ఉద్యమానికి మారడం. పి. రాజారామన్ ప్రకారం:
...అంతర్గత విభేదాలు, అసమర్థమైన వ్యవస్థ, జడత్వం, సరైన నాయకత్వం లేకపోవడం జస్టిస్ పార్టీని పతన మార్గంలో నడిపించాయి.[1]
న్యాయ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన వివి గిరి చేతిలో ప్రధానమంత్రి బొబ్బిలి రాజా 6000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇతర ప్రముఖ జస్టిస్ పార్టీ నాయకులలో వెంకటగిరికి చెందిన కుమారరాజా, PT రాజన్, AP పాత్రో, రామనాద్ రాజులు ఓడిపోయారు.[17][25]
1937 ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. 1937 మార్చిలో రాజాజీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నాయకుడిగా ఎన్నికయ్యాడు. శాసనసభ, మండలి రెండింటిలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వెనుకంజ వేసింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్‌కు ఇచ్చిన ప్రత్యేక అధికారాల పట్ల వారికి అభ్యంతరాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, గవర్నర్‌కు 1) ఆర్థిక రంగంలో ప్రత్యేక బాధ్యతలు (2) కొన్ని ఇతర అంశాలలో మంత్రివర్గంపై నియంత్రణ, సంపూర్ణ విచక్షణాధికారాలు ఉన్నాయి. కేబినెట్‌ను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. వాటి కారణంగా (తాము గెలిచిన ఆరు ప్రావిన్సులలో) అధికారాన్ని స్వీకరించడానికి కాంగ్రెస్ నిరాకరించింది. మద్రాసు గవర్నర్, లార్డ్ ఎర్స్కిన్, శాసనసభలో సభ్యులు కాని, ప్రతిపక్ష సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. VS శ్రీనివాస శాస్త్రికి మొదట తాత్కాలిక ప్రభుత్వం ప్రధానమంత్రి పదవిని ఇవ్వజూపింది, కానీ అతను దానిని నిరాకరించాడు. చివరికి 1937 ఏప్రిల్ 1 న ప్రధానమంత్రిగా జస్టిస్ పార్టీకి చెందిన కూర్మా వెంకట రెడ్డి నాయుడు నాయకత్వాన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎస్.సత్యమూర్తి వంటి కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అంగీకరించరాదనే నిర్ణయం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వారు భారత ప్రభుత్వ చట్టం ద్వారా నిర్దేశించిన పరిమితుల్లో అధికారాన్ని అంగీకరించేలా కాంగ్రెస్ హైకమాండ్ (మోహన్‌దాస్ కె. గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ) పై వత్తిడి తెచ్చే ప్రచారాన్ని చేపట్టారు. అలాగే గవర్నర్ ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయబోమని బ్రిటిష్ ప్రభుత్వం హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 22న, వైస్రాయ్ లిన్లిత్‌గో 1935 చట్టాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనే ప్రభుత్వ కోరికను వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. జూలై 1న, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తాము గెలిచిన ప్రావిన్సులలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. జూలై 14న రాజాజీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5][11][26][27] మొదటి శాసనసభ జూలై 15న మొదటిసారి సమావేశమైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా బులుసు సాంబమూర్తి, ఎ. రుక్మణి లక్ష్మీపతి లను ఎన్నుకున్నారు.[28]
KV రెడ్డి నాయుడు తాత్కాలిక మంత్రి మండలి (1937 ఏప్రిల్ 1 - జూలై 14):[29]
మంత్రి | పోర్ట్‌ఫోలియో |
---|---|
కూర్మ వెంకట రెడ్డి నాయుడు | ప్రధాన మంత్రి, పబ్లిక్, రెవెన్యూ, చట్టపరమైన |
AT పన్నీర్ సెల్వం | హోమ్, ఫైనాన్స్ |
MA ముత్తయ్య చెట్టియార్ | స్థానిక స్వపరిపాలన |
పి. కలీఫుల్లా సాహిబ్ బహదూర్ | పబ్లిక్ వర్క్స్ |
MC రాజా | అభివృద్ధి |
RM పాలట్ | విద్య, ప్రజారోగ్యం |
రాజగోపాలాచారి క్యాబినెట్‌లో మంత్రి మండలి (1937 జూలై 15 – 1939 అక్టోబరు 29):[30][31]
మంత్రి | పోర్ట్‌ఫోలియో |
---|---|
సి.రాజగోపాలాచారి | ప్రధాన మంత్రి, పబ్లిక్, ఫైనాన్స్ |
టి. ప్రకాశం | రాబడి |
పి. సుబ్బరాయన్ | చట్టం, విద్య |
బయ్యా సూర్యనారాయణ మూర్తి | కార్మిక, పరిశ్రమలు |
బెజవాడ గోపాల రెడ్డి | స్థానిక పరిపాలన |
TSS రాజన్ | పబ్లిక్ హెల్త్, రిలిజియస్ ఎండోమెంట్స్ |
మౌలానా యాకూబ్ హసన్ సైత్ | పబ్లిక్ వర్క్స్ |
VI మునుస్వామి పిళ్లై | వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి |
S. రామనాథన్ | పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అడ్మినిస్ట్రేషన్ నివేదికలు |
కొంగత్తిల్ రామన్ మీనన్ | కోర్టులు, జైళ్లు |
1937 ఎన్నికలు భారతదేశ పాలనలో భారత జాతీయ కాంగ్రెస్ భాగస్వామ్యానికి నాంది పలికాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో రాజాజీ అధిరోహణకు కూడా నాంది పలికింది. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించింది సత్యమూర్తి అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ నాయకుల కోరిక మేరకు రాజాజీ కోసం అతను శాసన సభ నాయకత్వాన్ని వదులుకున్నాడు. ఈ ఎన్నికలు మద్రాసు ప్రెసిడెన్సీ లోను, ఆ తరువాత మద్రాసు రాష్ట్ర రాజకీయాల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యానికి నాంది పలికాయి. 1939-46 మధ్య కాలంలో తప్ప, 1967 వరకు కాంగ్రెస్ మద్రాసును నిరంతరాయంగా పాలించింది. తన ఓటమితో జస్టిస్ పార్టీ నిరుత్సాహానికి గురైంది. బొబ్బిలి రాజా క్రియాశీల రాజకీయాల నుండి తాత్కాలికంగా విరమించుకున్నాడు. పార్టీ రాజకీయ అజ్ఞాతంలో ఉండి, చివరికి 1938లో పెరియార్ EV రామసామి నియంత్రణలోకి వచ్చింది. 1944 లో అది ద్రావిడర్ కజగంగా రూపాంతరం చెందింది [11][22]
{{cite web}}
: CS1 maint: unfit URL (link)