| |||||||||||||||||||||||||
46 స్థానాలు 24 seats needed for a majority | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||
|
1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్విసభ శాసనసభను స్థాపించిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి రెండవ శాసన మండలి ఎన్నికలు 1946 మార్చిలో జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయాన్ని నిరసిస్తూ సి. రాజగోపాలాచారికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయడంతో 1939 నుండి 6 సంవత్సరాల పాటు గవర్నర్ పాలన జరిగిన తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ప్రెసిడెన్సీలో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు జరిగిన చివరి ప్రత్యక్ష ఎన్నికలు ఇవి. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. కౌన్సిల్‌కు జరిగే ప్రత్యక్ష ఎన్నికలను రద్దు చేసారు. ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికలతో పాటు ఒకేసారి జరిగాయి. మొత్తం 46 స్థానాలకు గానూ 32 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత సంవత్సరాల్లో మద్రాసు కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ (ప్రధానంగా తమిళం, ఆంధ్ర), మతపరమైన ( బ్రాహ్మణ, బ్రాహ్మణేతర) విభజనలతో వర్గీకరణ కనిపించింది. టి. ప్రకాశం (ఆంధ్ర బ్రాహ్మణ), సి. రాజగోపాలాచారి (తమిళ బ్రాహ్మణుడు), కె. కామరాజ్ (తమిళ బ్రాహ్మణేతరుడు) మధ్య పోటీ ఫలితంగా ప్రకాశం మొదట ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ తరువాత కామరాజ్ మద్దతుతో ఓమండూర్ రామస్వామి రెడ్డియార్ (తమిళ బ్రాహ్మణేతరుడు) చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ రెడ్డియార్ ను తొలగించి కామరాజ్ మద్దతుతో PS కుమారస్వామి రాజా (తమిళ బ్రాహ్మణేతరుడు) గద్దె నెక్కాడు.
1937 ఎన్నికలలో గెలిచి 1937లో మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయాన్ని నిరసిస్తూ 1939 అక్టోబరులో రాజీనామా చేసింది.[3] 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం ప్రెసిడెన్సీ 1939 అక్టోబరు 30 న నేరుగా గవర్నర్ పాలనలోకి వచ్చింది. గవర్నర్ ప్రకటన ద్వారా దీన్ని 1943 ఫిబ్రవరి 15 న, 1945 సెప్టెంబరు 29 న రెండుసార్లు పొడిగించారు. 1945 జూలైలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్లెమెంట్ అట్లీ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల మరింత సానుభూతి చూపింది. భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్, రాజ్యాంగ ప్రతిష్టంభనను విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రణాళికను ప్రతిపాదించాడు. దీన్ని "వేవెల్ ప్లాన్" అంటారు. దీని కింద కాంగ్రెస్ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసారు. సెక్షన్ 93ని రద్దు చేయాలనీ, తాజా ఎన్నికలు నిర్వహించాలనీ పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో తిరిగి పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. 1946 లో ఎన్నికలు జరప తలపెట్టారు.[4][5]
1946 ఎన్నికలకు ముందు సంవత్సరాలలో మద్రాసు ప్రావిన్షియల్ కాంగ్రెస్ నాయకత్వం కోసం సి. రాజగోపాలాచారి (రాజాజీ), కె. కామరాజ్ ల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. పాకిస్తాన్‌కు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ నాయకులతో విభేదాల కారణంగా రాజాజీ 1942 జూలై 15న కాంగ్రెస్‌ను విడిచిపెట్టాడు. ఆయన నిష్క్రమణ తర్వాత, తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ ప్రాంతంలో అపారమైన ప్రజాదరణ పొందిన కామరాజ్ చేతుల్లోకి మారింది. రాజాజీ 1945 మధ్యలో మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చాడు. ప్రెసిడెన్సీకి అతని సేవ చాలా అవసరమని వారు భావించినందున కాంగ్రెస్ హైకమాండ్ అతని తిరిగి రాకను చాలా స్వాగతించింది. సత్యమూర్తి మరణించాడు, ప్రకాశం ప్రజాదరణ ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైంది, కామరాజు చాలా చిన్నవాడు.
1945 అక్టోబరు 31 న తిరుప్పరంకుండ్రంలో జరిగిన ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాజాజీ నాయకత్వానికి బలమైన మద్దతు లభించింది. అతనిని ఎదుర్కోవడానికి కామరాజ్, CN ముత్తురంగ ముదలియార్, M. భక్తవత్సలం వంటి నాయకులతో జతకట్టాడు. రాజాజీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి కాంగ్రెస్ హైకమాండ్ అసఫ్ అలీని మద్రాసుకు పంపింది. కామరాజ్, ముదలియార్ లు స్థానిక రాజకీయాలలో హైకమాండ్ జోక్యాన్ని, రాజాజీకి ప్రాధాన్యతనివ్వడాన్నీ నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు. రాజాజీ సెంట్రల్ అసెంబ్లీలో అడుగుపెడితే మంచిదని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించాడు. కానీ రాజాజీకి ప్రాంతీయ రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో మద్రాసు యూనివర్సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాడు. మొత్తానికి, రాజాజీ లేకుంటే మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ నాయకత్వరహితంగా మారుతుందనే కాంగ్రెస్ హైకమాండ్ వాదనను కామరాజ్ తదితరులకు నచ్చలేదు. అది పూర్తిగా ప్రావిన్స్ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని వారు భావించలేదు.[6]
1946 జనవరిలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మద్రాసును సందర్శించిన గాంధీ, హరిజన్ పత్రికలో రాజాజీ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఒక వ్యాసం రాశారు. "క్యూరియస్" అనే శీర్షికతో వచ్చిన ఆ కథనంలో రాజాజీకి వ్యతిరేకంగా పనిచేసే మద్రాసు కాంగ్రెస్ "గ్రూపు" ఒకదాని గురించిన ప్రస్తావన ఉంది. గాంధీ ఆ కథనాన్ని ఇలా ముగించాడు:
దక్షిణాది ప్రెసిడెన్సీలో రాజాజీ చాలా ఉత్తమమైన వ్యక్తి. నా చేతిలో అధికారం ఉంటే, నేను రాజాజీని పదవిలో కూచోబెడతాను... కానీ ఆ అధికారం ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ వద్ద ఉంది. నా అభిప్రాయం అనేది వ్యక్తిగతమైనది, ఒక వ్యక్తికి సంబంధించినది. దానికి ఎంత విలువ ఉంటుందో అంతే ఉంటుంది.
ఈ వ్యాసం మద్రాసు ప్రావిన్స్‌లో భారీ వివాదానికి దారితీసింది. గాంధీ కథనాన్ని ఖండిస్తూ అతనికి అనేక టెలిగ్రామ్‌లు, లేఖలు వచ్చాయి. ‘గ్రూపు’ అనే పదాన్ని ఉపసంహరించుకోకుంటే నిరాహార దీక్ష చేస్తామని కూడా కొందరు బెదిరించారు. అయినప్పటికీ, గాంధీ పశ్చాత్తాపపడలేదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. 1946 ఫిబ్రవరి 12 న కామరాజ్, తమిళనాడు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు రాజీనామా చేశాడు. ఈ వివాదంతో అసంతృప్తి చెందిన రాజాజీ, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. రాజాజీ ప్రతిష్ఠను బలోపేతం చేయడానికి కృషి చేసిన పటేల్, ఆయన ఆకస్మిక ఉపసంహరణతో ఆగ్రహించి ఇలా అన్నాడు.
మీరు ఇలా ప్రవర్తిస్తే ఎవరైనా మీకు ఎలా మద్దతు ఇస్తారు? మీరేమో మమ్మల్ని సంప్రదించరు. కానీ అది మీకు అలవాటైపోయింది. మీరు నాకు అర్థం కారు.
అయితే మద్రాసు యూనివర్శిటీ నియోజకవర్గం నుండి రాజాజీ ఉపసంహరణను ఆయన అంగీకరించాడు. రాజాజీ, రాజకీయాల నుండి విరమణ చేయడం ఇది మూడోసారి, మిగిలిన రెండు సందర్భాలు 1923, 1936 లో జరిగాయి.
ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉన్న జస్టిస్ పార్టీ 1937 ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతం లోకి వెళ్లిపోయింది. 1937-40 నాటి హిందీ వ్యతిరేక ఆందోళనల సమయంలో, ఇది పెరియార్ EV రామసామికి, అతని ఆత్మగౌరవ ఉద్యమానికీ సన్నిహితంగా ఉంది. పెరియార్ చివరికి 1938 డిసెంబరు 29 న జస్టిస్ పార్టీ నాయకత్వం స్వీకరించాడు. 1944 ఆగస్టు 27 న దానికి ద్రావిడర్ కజగం (DK) అని పేరు మార్చారు.[7] పెరియార్ హయాంలో, ద్రవిడ నాడు కోసం వేర్పాటువాద డిమాండ్ దాని ప్రధాన రాజకీయ నినాదం అయింది. DK 1946 ఎన్నికలను బహిష్కరించింది.[8]
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మద్రాసు ప్రావిన్స్‌లో ద్విసభ శాసనసభను ఏర్పాటు చేసారు. శాసనసభలో గవర్నరు, రెండు శాసన సభలు - ఒక శాసన సభ, శాసన మండలి - ఉంటాయి. శాసన మండలిలో కనిష్ఠంగా 54 మంది, గరిష్ఠంగా 56 మంది సభ్యులు ఉంటారు. ఇది శాశ్వత సంస్థ, గవర్నర్ దీన్ని రద్దు చేయలేరు. దాని సభ్యులలో మూడింట ఒక వంతు ప్రతి మూడు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. సభ్యులలో 46 మందిని ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. 8 నుండి 10 మంది సభ్యులను గవర్నరు నామినేట్ చేయవచ్చు. మండలిలో సీట్ల విభజన ఈ విధంగా ఉంది:[9][10][11]
జనరల్ | మహమ్మదీయులు | భారతీయ క్రైస్తవులు | యూరోపియన్లు | నామినేట్ అయిన వారు |
---|---|---|---|---|
35 | 7 | 3 | 1 | 8-10 |
ఆస్తి అర్హతల ఆధారంగా పరిమిత వయోజన ఫ్రాంచైజీని చట్టం అందించింది.[12] 70 లక్షల ప్రజలు, అంటే మొత్తం మద్రాసు జనాభాలో 15% మంది, భూమి కలిగిన వారు లేదా పట్టణ పన్నులు చెల్లించేవారు.[10]
1946 ఎన్నికల తర్వాత పార్టీల వారీగా సీట్ల విభజన. (మొత్తం సీట్ల సంఖ్య: 56; ఎన్నికలు జరిగిన స్థానాలు: 46; నామినేట్ అయిన వారు: 10) :[13]
పార్టీ | సీట్లు |
---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 32 |
మద్రాస్ ప్రావిన్స్ ముస్లిం లీగ్ (MPML) | 7 |
ఇతరులు | 7 |
మొత్తం | 46 |