1981 నాటి అండర్‌ఆర్మ్ బౌలింగ్ సంఘటన 1 ఫిబ్రవరి 1981న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బెన్సన్ & హెడ్గెస్ ఆస్ట్రేలియా ట్రైసీరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల నడుమ జరిగిన మూడవ వన్‌డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగింది.[1] ఆఖరి ఓవర్‌లో ఒక్క బాల్ మిగిలివుందనగా, న్యూజిలాండ్‌కి మ్యాచ్ డ్రా చేసుకునేందుకు ఆరు పరుగులు కావాల్సిన పరిస్థితి. న్యూజీలాండ్ జట్టుకు అవసరమైన పరుగులు రాకుండా ఉండేలా చేయడానికి, ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ బౌలర్ (తన తమ్ముడు కూడా) ట్రెవర్ ఛాపెల్‌కి ఆఖరి బంతిని చేయి కిందికి తిప్పి నేలబారుగా అండర్ ఆర్మ్ వేయమని సూచించారు. ఇలా చేయడం క్రికెటింగ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కావడంతో ఎవరూ ఎప్పుడూ చూడలేదు, కానీ అప్పటికి ఇది క్రికెట్ నియమాలకు వ్యతిరేకం మాత్రం కాదు.
న్యూజీలాండ్ మొదటి మ్యాచ్, ఆస్ట్రేలియా రెండవ మ్యాచ్ గెలుపొందడంతో సీరీస్ 1-1గా టై అయింది. మూడవ మ్యాచ్ చివర్లో నాన్ బ్యాట్స్‌మాన్‌గా బ్రూస్ ఎడ్గార్ 102 పరుగులతో అజేయంగా నిలిచివున్నారు, ఆయన ఇన్నింగ్స్ అత్యంత ఉపేక్షకు గురైన సెంచరీగా పేరుతెచ్చుకున్నది.[2]