| ||||||||||||||||||||||||||||||||||||||||||
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై, నియంత్రణ రేఖను దాటి, " సర్జికల్ దాడులు" చేసినట్లు 2016 సెప్టెంబరు 29 న భారతదేశం ప్రకటించింది. ఈ దాడుల్లో "గణనీయమైన ప్రాణనష్టం" కలగ చేసింది.[10] దాడుల్లో 35 నుండి 70 వరకు మృతులు, క్షతగాత్రులూ ఉన్నట్లు భారతీయ మీడియా రాసింది.[11][12] తమ సైనికులు ఇద్దరు మరణించినట్లు, తొమ్మిది మంది గాయపడినట్లూ పాకిస్తాన్ అంగీకరించింది. ఎదురుకాల్పుల్లో కనీసం ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, ఒకరు పట్టుబడ్డారనీ పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. తమ సైనికుల్లో ఒకరు పాకిస్థానీ కస్టడీలో ఉన్నట్లు భారత్ ధ్రువీకరించింది. అయితే దానికీ ఈ సంఘటనకూ సంబంధం లేదనీ, తమ సైనికులు ఎవరూ చనిపోలేదనీ భారతదేశంచ్ చెప్పింది.[13] భారత్ తన ప్రాణనష్టాన్ని దాస్తోందని పాకిస్తాన్ పేర్కొంది.
"దాడి"కి సంబంధించిన వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయని మీడియా సంస్థలు ప్రకటించాయి.[14] ఆ నెల లోనే, సెప్టెంబరు 18 న, జమ్మూ కాశ్మీర్ లోని ఉరీ వద్ద నలుగురు ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేసి 19 మంది సైనికులను హతమార్చారు. సర్జికల్ దాడి చేసినట్లు సెప్టెంబరు 29 న భారత్ అంగీకరించడం, తమ బలగాలు నియంత్రణ రేఖను దాటినట్లు భారత్ బహిరంగంగా అంగీకరించిన మొదటి సంఘటన.[15][16] తరువాతి రోజులూ నెలల్లో, భారత, పాకిస్తాన్లు కాశ్మీర్ సరిహద్దులో కాల్పులు చేసుకుంటూనే ఉన్నాయి. దీని ఫలితంగా రెండు వైపులా డజన్ల కొద్దీ సైనికుల, పౌరుల మరణాలు సంభవించాయి.
2016 సెప్టెంబరు 18 న, ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై నలుగురు సాయుధ మిలిటెంట్లు ఫెడయీన్ దాడి చేశారు. 19 మంది భారత సైనికులు మరణించారు. దాడి చేసినది, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అని భారత్ ఆరోపించింది.[17] గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్‌లలో కూడా అలాంటి దాడులే జరిగిన నేపథ్యంలో, ఉరీ దాడి భారతదేశంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.[18] భారత సైన్యం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించిందనీ, అయితే "మేం ఎంచుకున్న సమయంలో, మేం ఎంచుకున్న చోట" ప్రతిస్పందించే హక్కు మాకుందని భారత సైన్యం మరుసటి రోజు ప్రకటించింది.[19]
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అరికట్టడంలో పాకిస్తాన్ నిష్క్రియాపరత్వం కారణంగా భారత్‌లో సహనం నశించిందని గార్డియన్ పేర్కొంది.[20] సెప్టెంబరు 21న భారతదేశం, పాకిస్తాన్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి, పాకిస్తాన్‌లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ ప్రమేయాన్ని వివరిస్తూ నిరసన లేఖను ఇచ్చింది.[21] ఉరీ దాడి పాక్ నుంచి జరిగిందనేందుకు భారత్ ఎలాంటి ఆధారాలు అందించలేదని పాకిస్తాన్ ఆ తర్వాత పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ప్రజాందోళనల నుంచి దృష్టి మరల్చేందుకే భారత్ ఉరీ దాడికి పాల్పడిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు.[20] మంత్రి వ్యాఖ్యలు పరిస్థితిని "ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్"కు తీసుకువెళ్ళాయని హిందూస్థాన్ టైమ్స్ రాసింది. ఆ తర్వాత భారతదేశం సైనికంగా స్పందించాలని నిర్ణయించుకుంది.[21]
కాశ్మీర్‌లో అశాంతి మొదలైనప్పటి నుండి నియంత్రణ రేఖ మీదుగా సరిహద్దు చొరబాట్లు పెరిగాయని భారత అధికారులు తెలిపారు. సరిహద్దు దాటినవారు, పాక్‌లో తమకు ఇచ్చిన సైనిక శిక్షణకు సంబంధించిన ఆధారాలను చూపించారు.[22] హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సన్నిహితంగా ఉండే వర్గాల ప్రకారం, సెప్టెంబరు 24న భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది, ఇందులో "ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకునే విస్తృత వివరాలను" చర్చించారు.
ఉరీ దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత సెప్టెంబరు 29న, భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ లోను, ఇతర రాష్ట్రాల్లోని వివిధ మెట్రో నగరాల పైనా ఉగ్రవాద దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న తీవ్రవాద బృందాల గురించి తమకు చాలా విశ్వసనీయమైన, నిర్దుష్టమైన సమాచారం అందిందని భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపాడు. భారత్ తలపెట్టిన సైనిక చర్య ఆ ఉగ్రవాదుల చొరబాట్లను ముందస్తుగా నిరోధించడానికి ఉద్దేశించింది.[14][23] భారతదేశం తన ఆపరేషన్‌ను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందస్తు స్వీయ-రక్షణగా, తీవ్రవాద మౌలిక సదుపాయాలపైన, "వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారి" పైనా దాడి చేసింది. కాలమిస్ట్ అంకిత్ పాండా తరువాతి కాలంలో పాకిస్తానీ సైనికులు లేదా పాకిస్తానీ రాజ్యానికి చెందిన అంశాలు ఉన్నాయని భావించాడు.[24] సెప్టెంబరు 30న, భారత సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ దాడుల్లో వైమానిక దాడులు జరగలేదని, మొత్తం ఆపరేషన్ంతా "నేలపైనే" నిర్వహించామనీ చెప్పాడు.
పాకిస్తాన్లో తన సమాన స్థాయి అధికారికి ఈ దాడుల గురించి సమాచారం అందించినట్లు రణబీర్ సింగ్ తెలిపాడు.[25] DGMO కమ్యూనికేషన్లు సరిహద్దు కాల్పుల గురించి మాత్రమే చర్చించారాని, ఇది ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలలో భాగమేననీ పాకిస్తాన్ మిలిటరీ తెలిపింది.[26]
సర్జికల్ దాడులేమీ జరగలేదని పాకిస్తాన్ కొట్టిపారేసింది. "సరిహద్దులో కాల్పులు" మాత్రమే జరిగాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది.[24] పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ "ఏ రెచ్చగొట్టే చర్యలూ లేకపోయినా, భారత బలగాలు జరిపిన విస్పష్టమైన దురాక్రమణ"ను ఖండించాడు. భారతదేశం చేసే ఎటువంటి దాడులనైనా అడ్డుకోగల సామర్థ్యం పాకిస్తాన్ సైన్యానికి ఉందని అతను అన్నాడు.[14][27]
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితి పరిశీలకుల బృందం ఈ ఘటనకు సంబంధించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపడాన్ని ప్రత్యక్షంగా గమనించలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ అన్నాడు.[28][29] ఐక్యరాజ్యసమితిలోని భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ, "ఒకరు అంగీకరించారనో, అంగీకరించకలేదనో క్షేత్రస్థాయి వాస్తవాలు మారవు" అని అన్నాడు.[29]
ది డిప్లొమాట్‌లో రాస్తూ విశ్లేషకుడు సందీప్ సింగ్, "సర్జికల్ స్ట్రైక్స్"లో శత్రు భూభాగంలో బాగా లోపలికి వెళ్ళి దాడి చేయడం, సాధారణంగా వైమానిక శక్తిని ఉపయోగించడం వంటివి ఉంటాయి కాబట్టి, ఈ ఆపరేషన్‌ను సరిహద్దు దాడి అనవచ్చని అన్నాడు.[30] ది డిప్లొమాట్‌లో షాన్ స్నో రాస్తూ, పాకిస్తాన్‌లో చాలా సమగ్రమైన, ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థ ఉందని పేర్కొంటూ, "సర్జికల్ దాడి" చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందా అని ప్రశ్నించాడు.[31] సరిహద్దు మీదుగా దాడి, పాకిస్తానీ పరిపాలనా భూభాగంలో 1 కిమీ లోపున జరిగితే, అది మామూలే. ఇరువైపులా కలిపి డజనుకు పైగా అలాంటి సంఘటనలు జరిగాయి. అంచేత దాన్ని "సర్జికల్ స్ట్రైక్" అనలేం. సందీప్ సింగ్ చెప్పినట్లు, దాని నిర్వచనం ప్రకారం బాగా లోపలికి వెళ్ళి దాడి చెయ్యడం, వైమానిక శక్తి ఉండాలి.
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)కి దగ్గరగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు. ఇక్కడ ఉగ్రవాదులు ఎల్‌ఓసి గుండా భారత్‌లో చొరబడడానికి ముందు చివరిసారి సూచనలు ఆదేశాల కోసం సమావేశమవుతారని భావించారు. భారత బలగాలు సరిహద్దులో ఫిరంగి కాల్పులు జరపడంతో ఈ ఆపరేషను మొదలైంది. పారా స్పెషల్ ఫోర్సెస్‌లోని 4వ, 9వ బెటాలియన్‌లకు చెందిన 70–80 మంది సైనికులతో కూడిన మూణ్ణాలుగు బృందాలు రక్షణ కల్పించడానికీ, కొద్దిసేపటి తర్వాత అనేక వేరువేరు స్థలాల వద్ద వద్ద నియంత్రణ రేఖను దాటేందుకూ ఈ కాల్పులు జరిపారని భారత భద్రతా వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 29 అర్ధరాత్రి వేళ (సెప్టెంబరు 28 18:30 గంటల UTC) కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్‌లో 4 పారా బృందాలు నియంత్రణ రేఖను దాటగా, సరిగ్గా అదే సమయంలో 9 పారాకు చెందిన బృందాలు పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖను దాటాయి.[3][25] తెల్లవారుజామున 2 గంటలకు ప్రత్యేక దళాల బృందాలు 1–3 కి.మీ. కాలినడకన ప్రయాణించి, చేతితో పట్టుకున్న గ్రెనేడ్లు. 84 మి.మీ. రాకెట్ లాంచర్లతో తీవ్రవాద స్థావరాలను నాశనం చేయడం ప్రారంభించాయి. ఆ తరువాత జట్లు వేగంగా నియంత్రణ రేఖ దాటి భారత వైపుకు తిరిగి వచ్చేసాయి. ఒక మందుపాతరపై కాలు వేయడం వల్ల ఒక సైనికుడు గాయపడ్డాడు. అది తప్ప మరే నష్టమూ జరగలేదు.[3]
భారత్‌పై ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తమకు నిఘా సమాచారం అందిందని, అందుచేతనే ఉగ్రవాదుల స్థావరాలపై ముందస్తు దాడి చేసినట్లు భారత సైన్యం పేర్కొంది.[14][23] "ఉగ్రవాద మౌలిక సదుపాయాలను" ధ్వంసం చేయడంలో "వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారి"పై కూడా దాడి చేశామని భారత్ తెలిపింది. అలా అనడంతో, పాక్ సైనికులపై కూడా తాము దాడి చేసామని భారత్ సూచనగా పేర్కొన్నట్లైంది.[24] ఆ తరువాత భారత ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలకూ విదేశీ ప్రతినిధులకూ ఆపరేషన్ గురించి చెప్పింది. కానీ ఆపరేషను వివరాలను వెల్లడించలేదు.
2018లో, భారత ప్రభుత్వం దాడులకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేసింది.[32][33]
దాడి జరిగిన వెంటనే, సాక్ష్యాలను చెరిపివేయడానికి పాకిస్తాన్ సైన్యం హతమైన ఉగ్రవాదుల శవాలను పాతిపెట్టిందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి "గొడవలు" జరిగాయని చెప్పే తమ కథనాన్ని నిరూపించేందుకే పాకిస్తాన్ ఈ పని చేసిందని భారత్ చెప్పింది.[4] అయితే, అలాంటి ప్రాణనష్టమేమీ జరగలేదని పాకిస్తాన్ తిరస్కరించింది: జరిగి ఉంటే మరి "మృత దేహాలన్నీ ఎక్కడికి పోయాయి?" అని ప్రశ్నించింది.[34] దాడుల స్థలంలో దెబ్బలు లేదా నష్టాలు లేకపోవడాన్ని కూడా పాకిస్తాన్ సైన్యం ఎత్తిచూపింది. ఐరాస పరిశీలకులు, జర్నలిస్టులు స్వతంత్ర విచారణ జరపాలని స్వాగతించింది.[34] నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు పెరిగాయని మరుసటి రోజున నివేదించారు.[35]
ఈ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న పంతొమ్మిది మంది సైనికులకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రదానం చేసింది. వారిలో ఆపరేషన్ నాయకుడు మేజర్ రోహిత్ సూరికి రెండవ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన కీర్తి చక్ర అందుకున్నాడు.[36]
2018 జూన్ 27 న, దాడులకు రుజువుగా భారత ప్రభుత్వం దాడుల ఫుటేజీని భారత మీడియాకు విడుదల చేసింది.[32] అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఆ వీడియోను తిరస్కరించాడు. భారతీయ వాదన ఒక ప్రహసనం లాగా ఉందని పేర్కొన్నాడు. 2018 సెప్టెంబరు 27 న భారత ప్రభుత్వం మరిన్ని వీడియోలను విడుదల చేసింది.[33]
భారతీయులు సైనిక దాడిని విస్తృతంగా ప్రశంసించారు. సర్జికల్ దాడి నిజంగా జరిగిందా అని ప్రతిపక్షాలు మొదట్లో సందేహాలు లేవనెత్తాయి. కానీ ఆ తరువాత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని, "తన హయాంలో మొదటిసారి, అతను ఒక ప్రధానమంత్రి హోదాకు తగిన చర్య తీసుకున్నాడు." అని ప్రశంసించాడు [37]
సైనిక దాడి తరువాత, పాకిస్తాన్ నుండి సరిహద్దులో కాల్పులు జరుగుతాయని ఊహించి, భారత అధికారులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సరిహద్దు నుండి పది కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల నుండి 10,000 మందిని ఖాళీ చేయించారు. నియంత్రణ రేఖ వెంబడి సైనిక నిఘా పెంచారు.
సర్జికల్ దాడుల వాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. భారత సైనికులు కేవలం పాక్ సైనికులపై కాల్పులు మాత్రమే జరిపారని, ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారనీ పేర్కొంది.[14] సర్జికల్ దాడులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తానీ సైన్యం ప్రతినిధి ఇలా అడిగాడు: "జరిగిన నష్టం ఏది?".[34] ISPR ప్రతినిధి అసిమ్ బజ్వా "సర్జికల్ స్ట్రైక్" వాదనను "తప్పుడు ప్రభావాలను సృష్టించడానికి భారతదేశం ఉద్దేశపూర్వకంగా కల్పించిన భ్రమ", "లేని నిజాన్ని కల్పించడం" అని పేర్కొన్నాడు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అఖిలపక్ష సమావేశాన్ని, అత్యవసర కేబినెట్ సమావేశాన్నీ ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ తన ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అవసరమైన ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందని అతను పేర్కొన్నాడు. "దురాక్రమణకు వ్యతిరేకంగా మేము మా మాతృభూమిని రక్షించుకుంటాం. దేశం మొత్తం మా సాయుధ బలగాలతో భుజం భుజం కలిపి నిలబడుతోంది." అని అన్నాడు.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)