2016 యూరీ ఉగ్రవాద దాడులు అన్నది 2016 సెప్టెంబరు 18 న భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ పట్టణంపై చేసిన దాడి. కాశ్మీర్ లో భద్రతా దళాలపై 2 దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీన్ని పేర్కొన్నారు.[9] ఏ ఉగ్రవాద సమూహమూ ఈ దాడికి బాధ్యత స్వీకరిస్తూ ప్రకటించలేదు,[10] కానీ ఈ దాడిని ప్రణాళిక వేసి, నిర్వహించింది తీవ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ అని అనుమానిస్తున్నారు.[6] ఈ దాడి జరిగే నాటికి కాశ్మీరులో అలజడి, అశాంతి చోటుచేసుకుంది.[11][12]
2015 నుంచీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు (ఫిదాయీన్ గా ప్రసిద్ధి) భారతీయ రక్షణ దళాలకు వ్యతిరేకంగా సాగించడం పెరుగుతోంది. జూలై 2015లో ముగ్గురు సాయుధులు గురుదాస్ పూర్ లో ఒక బస్సుపై, పోలీస్ ఠాణాపై దాడి చేశారు.
2016లో 4-6 మంది సాయుధులు పఠాన్ కోట్ వైమానిక దళ స్థావరంపై దాడిచేశారు, ఈ దాడి జైష్-ఎ-మొహమ్మద్ చేసిందని భారతీయ అధికార వర్గాలు అంచనా వేశాయి.[13]
2016 జూలై 8 న ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వాణి పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆందోళనలు, అశాంతి ఎడతెగకుండా సాగాయి.[14][15][16][17] ఈ మరణంతో లోయలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళనలు చేసాయి.[10][18][16][19][20]
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, 2016 సెప్టెంబరు 19 న యూరి, జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిపై మీడియాకు వివరిస్తున్న దృశ్యచిత్రం.
సెప్టెంబరు 18 తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు సాయుధులైన ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు సమీపంలోని యూరీ పట్టణంలోని భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై మెరుపుదాడి చేశారు. మూడు నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరారు. అడ్మినిస్ట్రేటివ్ బేస్ కాంపులో మంటలు వ్యాపించడంతో అప్పటికప్పుడు 17 మంది సైనికులు, సైనికాధికారులు మరణించారు, ఆపైన మరో 19-30 మంది సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు.[3][5][21][22][23] బతికి ఉన్నారని భావించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్లు ప్రారంభించారు.[9]
చనిపోయిన సైనికుల్లో అత్యధికులు 10 డోగ్రా, 6 బీహార్ రెజిమెంట్లకు చెందినవారు.[23] గాయపడిన సైనికుల్లో ఒకరు ఆర్&ఆర్ ఆసుపత్రిలో 19 సెప్టెంబరున మరణించగా, మరొకరు 24 సెప్టెంబరులో చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య 19కి చేరింది.[1][2][24][25]
↑"Soldiers killed in army base attack in Indian territory of Kashmir". CNN. 19 September 2016. Retrieved 21 September 2016. After a few years of relative calm in Indian-administered Kashmir -- largely considered one of the world's most tumultuous geopolitical flashpoints since the India-Pakistan partition -- the region has been gripped by unrest for more than two months.