47 రోజులు (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
తారాగణం | చిరంజీవి జయప్రద శరత్‌బాబు |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | ప్రేమాలయ |
భాష | తెలుగు |
47 రోజులు చిరంజీవి, జయప్రద, శరత్ బాబు, రమాప్రభ నటించిన తెలుగు సినిమా. కె. బాలచందర్ దర్శకత్వం వహించాడు. 1981 లో విడుదలైన ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా 47 నాట్కల్ పేరుతో నిర్మించారు. నటి సరిత అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రం శివశంకరి రాసిన తమిళ నవల ఆధారంగా రూపొందించారు. ఇది చిరంజీవికి తొలి తమిళ చిత్రం.
నటి సరిత వైశాలి (జయప్రద) తో మాట్లాడటానికి ఒక చిన్న పట్టణానికి వస్తుంది, ఎందుకంటే ఆమె వైశాలి జీవితం ఆధారంగా తీస్తున్న ఒక చిత్రంలో నటించబోతోంది. వైశాలి కోపంతో హిస్టెరికల్‌గా మారి సరితను బయటికి తోసేసి తలుపేసేస్తుంది. కుమార్ (చిరంజీవి) తో ఆమె వైవాహిక జీవితం గురించి వైశాలి సోదరుడు సరితకు చెబుతుండగ ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ రూపంలో సాగుతుంది. ఇది 47 రోజులు నడిచే కథ. కుమార్ వైశాలిని పెళ్ళి చేసుకుని పారిస్ నుండి 30 కి.మీ. దూరం లోని ఫెరోల్స్ అనే చోట ఉన్న ఒక భవంతికి తీసుకువెళ్తాడు. ఆమెకు ఫ్రెంచ్ గానీ, ఇంగ్లీషు గానీ రావు. కుమార్ ఇప్పటికే ఒక ఫ్రెంచి స్త్రీని పెళ్ళి చేసుకుంటాడు.మొదటి భార్య లూసీ (అన్నే ప్యాట్రిసియా) పై అంతస్తులో నివసిస్తుంది. అతను తన భార్యలిద్దరినీ మోసం చేస్తాడు: లూసీ స్నేహితురాలని వైశాలికి, వైశాలి తన చెల్లెలని లూసీకీ చెప్తాడు. చివరికి, వైశాలి అసలు సంగతి గుర్తించి, అతడికి రెండవ భార్యగా కానీ, ఉంపుడుగత్తెగానో ఉండకూడదని నిశ్చయించుకుంటుంది. తన భాష తెలిసినవారెవరూ ఆమెకు తెలియదు. తప్పించుకోవడానికి తనకు ఎవరు సహాయపడతారో తెలియదు.
మానసిక దౌర్బల్యంతో ఉన్న సోదరిగా నటించమని కుమార్ ఆమెను హింసించి, బెదిరిస్తాడు. మనుషులు ప్రవర్తించలేని విధంగా, శాడిస్టిక్‌గా ప్రవర్తిస్తాడు. అతను తన సిగరెట్‌తో ఆమె వేళ్లను కాలుస్తాడు, ఆమె అరచేతిని పొయ్యిపై పెట్టి కాలుస్తాడు. తనతో పడుకోవటానికి ఇష్టపడనందున ఆమెను ఒక పోర్న్ ఫిల్మ్ చూడటానికి తీసుకువెళతాడు.
కుమార్ వైశాలితో చేస్తున్న దురగతాలన్నీ ఒక పిక్ పాకెట్ ( రమాప్రభ ) చూసి, ఆమెకు సహాయం చేయగల శంకర్ ( శరత్ బాబు ) అనే భారతీయ వైద్యుడి గురించి చెబుతుంది. ఈలోగా, వైశాలి గర్భవతి అవుతుంది. లూసీ తన మోసాన్ని కనుక్కుంటుందేమోనని కుమార్ భయపడతాడు. అతను వైశాలికి అసురక్షితమైన, అనాగరికమైన గర్భస్రావం చేసేందుకు బలవంతంగా ప్రయత్నిస్తాడు. డాక్టర్ శంకర్ ఆమెను రక్షించి లూసీకి కుమార్ వ్యవహారం గురించి అంతా చెబుతాడు. లూసీ తన ఉంగరాన్ని నదిలోకి విసిరి వారి వివాహాన్ని ముగిస్తుంది. డాక్టర్ శంకర్ వైశాలిని తిరిగి భారతదేశానికి తీసుకువస్తాడు. ఆమె తన సోదరుడు, తల్లి వద్దకు తిరిగి వస్తుంది.
ఆమె ఎందుకు పునర్వివాహం చేసుకోలేదని సరిత అడిగినప్పుడు (బహుశా ఆమెను రక్షించిన డాక్టర్ శంకర్ తో) వైశాలి, ఈ ప్రశ్నతో పట్టరాని కోపంతో ఒక మహిళ వివాహం చేసుకు తీరాల్సిన అవసరం లేదని సమాధానం ఇస్తుంది. అయితే, ఈ చిత్రంలో తన పాత్ర తిరిగి వివాహం చేసుకున్నట్లు చూపిస్తే తనకు అభ్యంతరమేమీ లేదని చెప్పి సరితను అనునయపరుస్తుంది. [1]
ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం చెయ్యగా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ అందించాడు.
పాట | గాయనీ గాయకులు |
---|---|
"ఓ. పైడి లెడెమ్మ " | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం |
"సూత్రం కట్టాడబ్బాయి" | వాణి జయరామ్ |
"అలంతి ఇలాంటి అమ్మాయిని కాను" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం & వాణ జయరాం |