అంతఃపురం | |
---|---|
దర్శకత్వం | కృష్ణవంశీ |
రచన | కృష్ణవంశీ (కథ), ఆకెళ్ళ (మాటలు) |
నిర్మాత | పి. కిరణ్ |
తారాగణం | సాయి కుమార్, సౌందర్య , ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | ఎస్. కె. ఎ భూపతి |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | నవంబరు 30, 1998 |
సినిమా నిడివి | 137 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అంతఃపురం 1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించాడు.
1999 లో ఈ సినిమాను అదే పేరుతో పునర్నిర్మాణం చేశారు. 2003 లో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్ ముఖ్య పాత్రల్లో శక్తి: ది పవర్ అనే పేరుతో పునర్నిర్మాణం చేసారు.[1][2]
ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ (ప్రకాష్ రాజ్) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ (సాయి కుమార్) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా న్యూజిలాండ్ దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి (సౌందర్య) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య, కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
నాట్ విత్ ఔట్ మై డాటర్ అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని కధ ఆధారంగా తీసుకుని అంతఃపురం సినిమా కథను అభివృద్ధి చేశారు.[3]
అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది.
ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు. పాటలు మెలొడీ మేకర్స్ ఆడియో కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి. సూరీడు పువ్వా అనే పాటకు గాను ఉత్తమ గాయనిగా ఎస్. జానకి నంది పురస్కారం అందుకుంది.