ఫోర్ట్ అగ్వాడ | |
---|---|
ప్రదేశం | గోవా, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 15°29′17″N 73°45′47″E / 15.488°N 73.763°E |
నిర్మించినది | 1612 |
రకం | సాంస్కృతిక |
State Party | భారతదేశం |
అగ్వాడ కోట భారతదేశములోని గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలో ఉంది.[1] ఇది గోవాలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నం.
ఈ కోట 1612 లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించబడింది. ఈ కోట యూరప్ నుండి వచ్చే నౌకలకు లంగరు పాయింట్ గా ఉండేది. ఈ పాత పోర్చుగీస్ కోట మాండోవి నది ఒడ్డున కాండోలిమ్‌కు బీచ్‌కు దక్షిణాన ఉంది. ఇది మొదట్లో షిప్పింగ్, సమీపంలోని బర్డెజ్ ఉప-జిల్లా రక్షణకు బాధ్యత వహించింది. కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ ఉండేది, ఇది అక్కడికి వచ్చే నౌకలకు నీటి సరఫరాను అందేచేది. దీని వలన ఈ కోటకు అగ్వాడ అని పేరు వచ్చింది: అగ్వాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. ఓడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవడానికి తరచుగా ఇక్కడ ఆగేవారు. 1864 లో ఏర్పాటు చేసిన అగ్వాడ ఫోర్ట్ లైట్‌హౌస్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనది.[2] 1612లో నిర్మించబడిన కోట ఒకప్పుడు 79 ఫిరంగుల గ్రాండ్‌స్టాండ్. ఆగ్వాడ కోటలోని ట్యాంక్ 2,376,000 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి నిల్వలలో ఒకటి. ఈ కోట రెండు విభాగాలుగా విభజించబడింది: ఎగువ భాగం కోట, నీటి ట్యాంక్ గా ఉండేది, దిగువ భాగం పోర్చుగీస్ నౌకలకు సురక్షితమైన లంగరు పాయింట్ గా ఉండేది. ఎగువ భాగంలో కందకం, భూగర్భ నీటి నిల్వ గది, గన్‌పౌడర్ గది, లైట్‌హౌస్, బురుజులు ఉన్నాయి, ఇది యుద్ధం, అత్యవసర సమయంలో ఉపయోగించడానికి రహస్యంగా తప్పించుకునే మార్గంగా ఉండేది. ప్రారంభ దశలో ఉన్న లైట్‌హౌస్ 7 నిమిషాలకు ఒకసారి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించేవారు.
కోటకు పశ్చిమాన ఉన్న కొండపై 1864లో అగ్వాడ లైట్‌హౌస్ నిర్మించబడింది. ఇది ఆసియాలోని పురాతనమైన వాటిలో ఒకటి. ఇది మోర్ముగావ్ ద్వీపకల్పం, కలంగుట్ బీచ్ మధ్య ఉంది. సుమారు ఒక శతాబ్దం పాటు సేవలందించిన తర్వాత 1976లో దాని స్థానంలో కొత్త లైట్‌హౌస్‌ని ఏర్పాటు చేశారు. ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టస్ మఠం శిథిలాలలో కనుగొనబడిన లైట్‌హౌస్‌పై ఒక పెద్ద గంట ఉంది.
అగ్వాడ సెంట్రల్ జైలు కోటలో ఒక భాగం, ఇది 2015 వరకు గోవాలో అతిపెద్ద జైలుగా ఉండేది. 17వ శతాబ్దపు పోర్చుగీస్ కాలం నాటి నిర్మాణాన్ని గోవా హెరిటేజ్ యాక్షన్ గ్రూప్, గోవా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు గోవా పర్యాటకం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పునరుద్ధరించింది. గోవాలో, భారతదేశ స్వాతంత్ర్య కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ జైలు శిక్ష అనుభవించిన వారందరి గురుంచి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసారు. దీనిని 2021 డిసెంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాడు.[3] కేంద్రం స్వదేశ్ దర్శన్ పథకం కింద పునరాభివృద్ధికి దాదాపు రూ.22 కోట్లు ఖర్చు చేసింది. ఈ మ్యూజియంలో విముక్తి యోధులు టిబి కున్హా, రామ్ మనోహర్ లోహియాలకు అంకితం చేయబడిన రెండు ప్రత్యేక సెల్‌లు ఉన్నాయి, వారు పోర్చుగీస్ పాలనలో జైలులో ఉన్నారు.[4]
తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ గతంలో ఫోర్ట్ అగుడా బీచ్ రిసార్ట్ తాజ్ హోటల్ గ్రూప్‌లో భాగం. ఇది చారిత్రాత్మక పోర్చుగీస్ ఫోర్ట్ అగ్వాడా స్థలంలో 1974లో హోటల్ ప్రారంభించబడింది.[5]