అజయ్ మిత్ర శాస్త్రి | |
---|---|
జననం | మహేంద్ర కుమార్ 1934 మార్చి 5 గుణ, (ప్రస్తుత మధ్య ప్రదేశ్) |
మరణం | 2002 జనవరి 11 | (వయసు: 67)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | విద్యావేత్త, చారిత్రికుడు, నాణేల సేకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1957–2002 |
అజయ్ మిత్ర శాస్త్రి (1934 మార్చి 5 - 2002 జనవరి 11) భారతీయ విద్యావేత్త, చరిత్రకారుడు, నాణేల సేకర్త. అతనికి నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ కాలం పాటు వివిధ పదవుల్లో పనిచేసాడు.
శాస్త్రి 1934 మార్చి 5న బ్రిటిషు భారతదేశం సెంట్రల్ ఇండియా ఏజెన్సీ (ఇప్పుడు మధ్యప్రదేశ్, భారతదేశం) లోని గుణలో జన్మించాడు. అతనికి మహేంద్ర కుమార్ అని పేరు పెట్టారు. అతను రాజోర్ (ఫైజాబాద్), అయోధ్యలలోని గురుకులాల్లో నాలుగు సంవత్సరాలు చదువుకున్నాడు. అక్కడ అతను తన ఆచార్యుడు సూచించిన పేర్ల నుండి "అజయ్ మిత్ర" అనే పేరును ఎంచుకున్నాడు.[1]
తదనంతరం ప్రస్తుత రాజస్థాన్‌లో, బరన్‌లోని సంస్కృత పాఠశాలలో చేరి, మధ్యమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అతను హిందీ భాషలో విశారద్, సాహిత్య రత్న పరీక్షలలో కూడా ఉత్తీర్ణత సాధించాడు. తదనంతరం, అతను వారణాసిలోని ప్రభుత్వ సంస్కృత కళాశాల నుండి శాస్త్రి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, "శాస్త్రి" అయ్యాడు. ఈ కాలంలో మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. 1953లో, అతను కాశీ విద్యాపీఠం నుండి సామాజిక శాస్త్రం, చరిత్ర, పొలిటికల్ సైన్స్ స్పెషలైజేషన్‌లతో శాస్త్రి డిగ్రీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌కు సమానం) పొందాడు. 1957లో, అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందాడు.[1]
1957లో, శాస్త్రి నాగ్‌పూర్ యూనివర్శిటీలో ప్రాచీన చరిత్ర, సంస్కృతి విభాగంలో అధ్యాపకుడయ్యాడు. అక్కడ అతను 1962 లో వరాహమిహిరుని బృహత్-సంహితపై PhD చేశాడు. అతను పదవీ విరమణ చేసే వరకు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ (1957-1965), రీడర్ (1965-1977), ప్రొఫెసర్ (1977-1994) తో సహా వివిధ పదవులను నిర్వహించాడు.[1]
1980లో, శాస్త్రి రెటీనా డిటాచ్‌మెంట్‌తో బాధపడి, అనేక ఆపరేషన్లు చేయించుకున్నాడు. దృష్టిని కాపాడుకోవడానికి చదవడం, రాయడం పూర్తిగా మానేయమని నాగ్‌పూర్‌కు చెందిన కంటి నిపుణుడు డాక్టర్ ఈశ్వరచంద్ర, చెన్నైకి చెందిన కంటి శస్త్రవైద్యుడు డాక్టర్ ఎస్‌ఎస్ బద్రీనాథ్ సలహా ఇచ్చారు. అయితే, శాస్త్రి ఈ కార్యకలాపాలను కొనసాగించాడు. అనేక పుస్తకాలు, పత్రికలకు వ్యాసాలూ రాశాడు.[2] అతను 2002 జనవరి 11 న మరణించాడు [1]