అనంత శ్రీరామ్ | |
---|---|
జననం | చేగొండి అనంత శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8 పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | అనంత శ్రీరామ్ |
వృత్తి | సాహితీకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2005 - ఇప్పటివరకు |
అనంత శ్రీరామ్ (జ. 1984 ఏప్రిల్ 8) సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయిత కాగలిగాడు. మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతాడు.