అనంత్ కుమార్ హెగ్డే[1] (జననం 20 మే 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 3 సెప్టెంబర్ 2017 నుండి 24 మే 2019 వరకు నైపుణ్యాభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రిగా పని చేశాడు.[2] అనంత్ కుమార్ హెగ్డే భత్కల్ మసీదు ధ్వంసం గురించి, భారత రాజ్యాంగంలో మార్పులు చేయడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు బీజేపీ అధిష్టానం 2024లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ టికెట్ ను నిరాకరించింది.[3][4]
అనంతకుమార్ హెగ్డే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యాడు, ఆ తర్వాత 1998లోజరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన మార్గరెట్ అల్వా చేతిలో ఓడిపోయాడు. ఆయన 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎన్నికై సెప్టెంబరు 2017 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[5]
ఆయన జనవరి 2017లో ఆసుపత్రిలో తన తల్లికి తగినంత శ్రద్ధ చూపడం లేదని భావించినందున డాక్టర్‌పై దాడి చేసి కొట్టడం కెమెరాకు చిక్కాడు.[6]
జాబ్ ఫెయిర్, స్కిల్ ఎగ్జిబిషన్‌లో 2018లో మాట్లాడుతూ భారతదేశంలోని యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి తన నిబద్ధతతో ముందుకు సాగుతానని, వీధికుక్కలు మొరిగే వాటి గురించి పట్టించుకోనని, తన మునుపటి “రాజ్యాంగాన్ని మార్చు” వ్యాఖ్యలను నిరసిస్తున్న సమూహాలను ప్రస్తావిస్తూ చెప్పాడు.[7][8]
2018లో సెక్యులర్ అనే పదాన్ని విమర్శిస్తూ, పీఠికలోని పదాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం "రాజ్యాంగాన్ని సవరిస్తుంది" అని అన్నాడు.[9]
తాజ్ మహల్ నిజానికి తేజో మహాలయ అని పిలువబడే శివ మందిరం అని అతను పేర్కొన్నాడు. కేంద్ర మంత్రిగా ఆయన సాధించిన విజయాలపై కెపిసిసి అధ్యక్షుడు దినేష్ గుండూరావు ప్రశ్నించిన తర్వాత హెగ్డే రావును "ఒక ముస్లిం మహిళ వెనుక నడిచిన వ్యక్తి" అని పేర్కొన్నాడు.[10]
2019 జనవరిలో శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని "హిందువులపై పగటిపూట అత్యాచారం"గా ఆయన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్య చేశాడు.[11]
2019 మార్చిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని "కాంగ్రెస్ ప్రయోగశాలలో మాత్రమే కనుగొనగలిగే హైబ్రిడ్ ఉత్పత్తి" అని పిలిచి వివాదాన్ని రేకెత్తించాడు. " ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టినప్పటికీ" గాంధీ తాను బ్రాహ్మణుడినని చెప్పుకుంటున్నారని ఆయన అన్నాడు.[12][13]
2019 సెప్టెంబరులో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. శశికాంత్ సెంథిల్‌ను దేశద్రోహి అని పిలిచి పాకిస్తాన్‌కు వెళ్లమని చెప్పి మరోసారి వివాదాన్ని సృష్టించాడు.[14][15]
2020ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటం ఒక డ్రామా అని పేర్కొంటూ హెగ్డే మరో వివాదాన్ని రెక్కేతించి అలాంటి వ్యక్తిని 'మహాత్మా' అని ఎలా పిలుస్తారని ప్రశ్నిస్తూ గాంధీపై దాడి చేశాడు.[16][17][18][19][20]
ఉత్తర కన్నడలోని కుంటలో జరిగిన సభలో 11 ఆగష్టు 2020లో 'బీఎస్‌ఎన్‌ఎల్‌లో దేశద్రోహులతో నిండిన వ్యవస్థ ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[21]