అనురాధ | |
---|---|
దర్శకత్వం | హృషికేశ్ ముఖర్జీ |
స్క్రీన్ ప్లే | సచిన్ భౌమిక్ రాజీందర్ సింగ్ బేడి డి.ఎన్. ముఖర్జీ సమీర్ చౌదరి |
కథ | సచిన్ భౌమిక్ |
నిర్మాత | హృషికేశ్ ముఖర్జీ ఎల్.బి. ఠాకూర్ |
తారాగణం | బలరాజ్ సాహ్ని లీలా నాయుడు |
ఛాయాగ్రహణం | జౌవంత్ పాతరే |
కూర్పు | దాస్ దైమాడే |
సంగీతం | పండిట్ రవిశంకర్ (సంగీతం) శైలేంద్ర (పాటలు) |
విడుదల తేదీ | 1960 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
అనురాధ, 1960లో విడుదలైన హిందీ సినిమా. హృషికేశ్ ముఖర్జీ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బలరాజ్ సాహ్ని, లీలా నాయుడు, అసిత్ సేన్, ముక్రీలు నటించారు.[1] మిస్ ఇండియా నాయుడు తొలి సినిమా ఇది.
ఈ సినిమాకు పండిట్ రవిశంకర్ సంగీతం అందించాడు.[2] బెంగాలీ మాస పత్రిక దేష్‌లో సచిన్ భౌమిక్ రాసిన ఒక చిన్న కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. 1857లో గుస్టావ్ ఫ్లాబెర్ట్ రాసిన మేడమ్ బోవరీ కథ ఆధారంగా ఈ కథ రాయబడింది.
1960లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఉత్తమ చలన చిత్రం అవార్డును గెలుచుకుంది. 1961లో 11వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గోల్డెన్ బేర్‌కు కూడా ఎంపికైంది.
అనూరాధా రాయ్ ఒక పేరుపొందిన గాయని, నర్తకి. రేడియోలో పాడుతూ ఉంటుంది. ఆమె ఒక ధనవంతుని కూతురు. ఆమె ఒక సాధారణ డాక్టర్ నిర్మల్ చౌదరితో ప్రేమలో పడుతుంది. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా అనూరాధ నిర్మల్‌ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. నిర్మల్ తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. దానితో నిర్మల్ దూరంగా ఉన్న నందగావ్ గ్రామంలోని పేదవారికి వైద్యసేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. తన జీవితంలోని కష్టాలలో పాలుపంచుకోవద్దని, తన తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకోమని అనూరాధకు నిర్మల్ సలహా యిస్తాడు. కానీ ఆమె అతడినే ప్రేమిస్తూ ఉంటుంది. తన తండ్రి తెచ్చిన పెళ్ళి సంబంధం లండన్ నుండి వచ్చిన దీపక్‌ను ఆమె తిరస్కరిస్తుంది. దీపక్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇస్తాడు.
పెళ్ళి అయ్యాక ఆమెకు ఒక కూతురు పుడుతుంది. గ్రామంలో నివసించడం వల్ల కలిగే కష్టం ఆమెకు తెలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలను చూసుకోవడంతో ఒకప్పుడు తన జీవితంలో భాగమైన సంగీతాన్ని ఆమె వదిలివేస్తుంది. ఒక రోజు చాలాకాలం తరువాత ఆమె తండ్రి తన కూతురును చూడటానికి గ్రామానికి వస్తాడు. ఆమె పడుతున్న కష్టాలను, ఆమె బీదరికాన్ని చూసి చలించిపోతాడు. తనతో పాటు పట్టణానికి వచ్చేయమని కూతురిని, అల్లుడినీ అడుగుతాడు. ఐతే నిర్మల్ తన పేషెంట్ల కారణంగా అతని ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. కొంత కాలం తరువాత వస్తామని తన మామకు మాట ఇస్తాడు.
దీపక్ అతని స్నేహితురాలితో ప్రయాణిస్తూ ఉండగా ఆ స్నేహితురాలికి ప్రమాదం జరిగి ఆమెను ట్రీట్మెంట్ కోసం నిర్మల్ వద్దకు తీసుకువస్తాడు. నిర్మల్ ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసి బాగుచేస్తాడు. ఆ సమయంలో దీపక్ కొద్దిరోజులు అనూరాధతో కలిసి ఉండాల్సి వస్తుంది. అనూరాధ పడుతున్న కష్టాలను చూసి దీపక్ ఆమెను నిర్మల్‌ను వదిలిపెట్టి నగరానికి వచ్చి తన గానాన్ని మళ్ళీ కొనసాగించమని చెబుతాడు. అప్పుడు ఆమెలో భర్తతో కలిసి ఉండాలా లేక సంగీతం కోసం వెళ్ళిపోవాలా అనే సంఘర్షణ మొదలౌతుంది. ఒక విస్ఫష్టమైన సమయంలో నిర్మల్ కూడా ఆమెను దీపక్ మాటవిని నగరంలో తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించమని చెబుతాడు. అప్పుడు ఆమె "అతడిని (దీపక్)ను వెళ్ళిపొమ్మని చెప్పండి. మళ్ళీ కనిపించవద్దని చెప్పండి" అని తన భర్తను విడిచిపోయే ప్రసక్తి లేదని సూచిస్తూ తన నిర్ణయాన్ని చెబుతుంది.
ఈ సినిమాకు సితార్ మాస్ట్రో పండిట్ రవిశంకర్ సంగీతం అందించగా, శైలేంద్ర పాటలు రాశాడు.