అన్నమయ్య (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్ర రావు |
---|---|
నిర్మాణం | వి. దొరస్వామి రాజు |
రచన | జె.కె.భారవి |
తారాగణం | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, శుభ(నటి), ఎం.బాలయ్య, సుత్తివేలు |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నేపథ్య గానం | ఆనంద్, అనురాధ, జె.కె.భారవి, ఆనంద్ భట్టాచార్య, కె.ఎస్.చిత్ర, గంగాధర శాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, మనో, పూర్ణచందర్, రేణుక, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, ఎం.ఎం.శ్రీలేఖ, సుజాత |
గీతరచన | అన్నమాచార్యుడు, వేటూరి సుందరరామమూర్తి, జె.కె.భారవి |
ఛాయాగ్రహణం | అజయ్ విన్సెంట్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | వి.ఎం.సి.ప్రొడక్షన్స్ |
నిడివి | 182 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు.[1][2] అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు.[3] చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది.[4] రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే.[5] ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు.[6] అన్నమయ్యకు తదుపరి చిత్రంగా నాగార్జున, రాఘవేంద్రరావు కలిసి అన్నమయ్య కుటుంబం ఆధారంగా ఇంటింటా అన్నమయ్య అన్న చిత్రం తీయబోతున్నట్టు ప్రకటించారు.[7]
అన్నమయ్య సినిమాను తిరుమలలో చిత్రీకరించడానికి అనుమతించలేదు, అదీకాక అసలు దేవాలయంలో అన్నమయ్య కాలం నాటికి లేని అనేక ఆధునిక వసతులు, విద్యుద్దీపాలు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. అవి చిత్రనిర్మాణానికి ఇబ్బంది కలుగజేస్తాయని యూనిట్ సభ్యులు అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవస్థానం యొక్క సెట్ ను నిర్మించి అందులో షూటింగ్ చేశారు. తిరుపతి కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్రములో చిత్రీకరించారు.
అన్నమయ్య సినిమాలో మొత్తం 41 పాటలు ఉన్నాయి. అందులో చాలామటుకు అన్నమయ్య సంకీర్తనలు కాగా మిగిలినవి సినిమా కోసం వ్రాయబడినవి. యేలే యేలే మరదలా పాటకు ఇంతకుముందు సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పూసింది పూసింది పున్నాగా అనే ప్రసిద్ధ పాట యొక్క బాణీనే తిరిగి ఉపయోగించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాకూ నిర్మాత అయిన దొరైస్వామి నాయునికి ఆ బాణీ నచ్చటంతో, దాన్ని తిరిగి అన్నమయ్యలో కూడా ఉపయోగించాలని కీరవాణిని కోరాడు.[9]
పాట | రచయిత | గాయకులు | |
---|---|---|---|
1 | నిగమ నిగమాంత వర్ణిత | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర |
2 | అదివో అల్లదివో | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
3 | అంతర్యామి అలసితి సొలసితి | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ |
4 | అస్మదీయ మగటిమి తస్మదీయ తకథిమి | వేటూరి సుందరరామ్మూర్తి | మనో, కె.ఎస్.చిత్ర |
5 | బ్రహ్మ కడిగిన పాదము | అన్నమయ్య కీర్తన | పూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ |
6 | యేలే యేలే మరదలా | అన్నమయ్య కీర్తనకు వేటూరి మార్పులు | ఎస్.పి.బాలు, సుజాత, అనురాధ |
7 | గోవిందాశ్రిత | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, కీరవాణి, ఆనంద భట్టాచార్య, అనురాధ |
8 | జగడపు చనవుల జాజర | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, మనో |
9 | కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
10 | మూసిన ముత్యాలకేలే మొరగులు | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర |
11 | పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం | జె.కె.భారవి | మనో |
12 | పొడగంటిమయ్యా పురుషోత్తమా | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
13 | శోభనమే శోభనమే | అన్నమయ్య కీర్తన | మనో |
14 | కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
15 | ఏమొకో చిగురుటధరమున | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
16 | నానాటి బ్రతుకు | అన్నమయ్య కీర్తన | మనో |
17 | దాచుకో నీ పాదాలకు | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ |
18 | తెలుగు పదానికి | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలు, సుజాత, రేణుక |
19 | వినరో భాగ్యము విష్ణు కథ | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, కీరవాణి, అనురాధ, ఆనంద్, గంగాధర శాస్త్రి |
20 | విన్నపాలు వినవలె వింతవింతలు | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, రేణుక |
21 | బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు, కోరస్ |
22 | ఫాలనేత్రాలు | అన్నమయ్య కీర్తన | ఎస్.పి.బాలు |
సినిమాలో అన్నమయ్యకు మీసం ఉంచడం, అన్నమయ్య ఇద్దరు భార్యలతో డ్యూయట్లు పాడటాన్ని చాలామంది అవహేళన చేసి విమర్శించారు.[10] ఈ సినిమాలో సాళువ నరసింహరాయలు పాత్ర పోషించిన మోహన్ బాబు తనదైన సొంతబాణీ డైలాగులతో పాత్ర ఔచిత్యాన్ని దిగజార్చారని పలు విమర్శలు వచ్చాయి.
అన్నమయ్య సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. 42 కేంద్రాలలో వందరోజులు ఆడింది.[11] రెండు కేంద్రాలలో 176 రోజులు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నది.[12] సినిమా ఆంధ్రప్రదేశ్ లోనే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఘన విజయం సాధించింది.[13] అప్పటికి దాకా విడుదలైన తెలుగు సినిమా పాటలలో కెళ్ళా అత్యధిక సంఖ్యలో విక్రయించబడిన ఆల్బం.[14]