అన్నవరపు రామస్వామి | |
---|---|
![]() | |
జననం | అన్నవరపు రామస్వామి మార్చి 23, 1926 సోమవరప్పాడు (దెందులూరు మండలం), పశ్చిమ గోదావరి జిల్లా |
నివాస ప్రాంతం | విజయవాడ , ఆంధ్రప్రదేశ్ |
ఇతర పేర్లు | అన్నవరపు |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
క్రియాశీలక సంవత్సరాలు | 1926-ప్రస్తుతం వరకు |
ప్రసిద్ధి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
మతం | హిందు |
పురస్కారాలు | సంగీత నాటక అకాడమీ పురస్కారం 1996,[1] పద్మ శ్రీ అవార్డు [2] |
అన్నవరపు రామస్వామి లేదా అన్నవరపు (మార్చి 23, 1926) ఒక భారతీయ వాయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2021 లో పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది,[3] 1996 లో ఈయనను సంగీత నాటక అకాడమీ పురస్కారంతో /సత్కరించింది.[1] ఆయన 1948 నుండి 1986 వరకు ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కు తమ సేవలందించారు.[4] 1988 లో, ఆల్-ఇండియా రేడియో (AIR) ఆయనను టాప్ గ్రేడ్ కర్ణాటక సంగీతకారుడిగా పేర్కొంది.[5] కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పాంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు. ఆయన సహకార వాద్యుడిగానేగాక స్వతంత్రంగా కూడా కచేరీలు చేశారు.
అన్నవరపు రామస్వామి 1926, మార్చి 27న పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో జన్మించారు. తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసులు. అన్నయ్య అన్నవరపు గోపాలం ఘటం విద్వాంసుడుగా చాలా కాలం ఆకాశవాణిలో కళాకారులుగా పనిచేసి పదవీ విరమణ చేసి మరణించారు. ఈయన మాగంటి జగన్నాధం చౌదరి నుండి, తరువాత పారుపల్లి రామకృష్ణయ్య పాంతుల నుండి సంగీతం అభ్యసించారు. పారుపల్లి రామకృష్ణయ్య శిష్యులలో బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు.[6]
గత ఎనిమిది దశాబ్దాలలో, యు.ఎస్.ఎ, కెనడా, యు.కె, ఫ్రాన్స్, మస్కట్, బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, మలేషియా, దోహా, శ్రీలంక వంటి అనేక దేశాలలో కచేరీలు ఇచ్చారు. 1998, 2012 సంవత్సరాల్లో, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అతనికి వయోలిన్ కేటగిరీ కింద అత్యుత్తమ ఆర్టిస్ట్ టైటిల్‌ను ప్రదానం చేసింది.[7][8] మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అతనికి టి.టి.కె. మెమోరియల్ అవార్డును ప్రదానం చేసింది.[9] ఆయన వందన, శ్రీ దుర్గా అనే కొత్త రాగాలను కనుగొన్నారు. ఆయన త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.[10] ఆయన కొత్త వర్ణాలు, కృతులను స్వరపరిచారు.[11] ఆయన వద్ద ఎందరో వయోలిన్ వాయిద్యంతో పాటు గాత్రం, వీణ, క్లారినెట్, వేణువు, నాదస్వరం విద్యలను అభ్యసించారు. ఆయన శిష్యులు వయోలిన్ వాసు వంటి వారు ప్రతి సంవత్సరం హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1948 నవంబరులో చేరారు. అప్పటికింకా విజయవాడ కేంద్రం ప్రారంభం కాలేదు. ఎన్ . ఎస్. రామచంద్రన్ గారు వీరిని, కృష్ణమాచార్యులను, దండమూడిని ఎంపిక చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. వీరు కళాకారులుగా 1986 వరకు పనిచేశారు. ఆయన ఇప్పుడు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ వాద్యకారుడు. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఫెలోగా ఎంపికయ్యారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరాలలో కనకాభిషేకము, సువర్ణఘంటా కంకణం పొందారు.
రామస్వామి జీవితచరిత్రను విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ‘ఓ వయోలిన్ కథ’ పేరుతో రచించారు. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. రామస్వామి జీవితంలోని అనేక ఘట్టాలతో పాటు ఆయన కనుగొన్న రాగాలు, వాటి నొటేషన్లతో సహా ఉన్నాయి.
నాద సుధార్ణవ, నాథనిధి, వాయులీన కళాకౌముది, వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులతో ఆంధ్రదేశం ఆయనను సత్కరించింది.